ఢిల్లీకి...

ABN , First Publish Date - 2021-07-26T16:24:54+05:30 IST

అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌), ఉపన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) ఢిల్లీ బయలుదేరివెళ్లారు. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలు సమీపిస్తుండడం, త్వరలోనే

ఢిల్లీకి...

నేడు మోదీ, అమిత్‌షాలతో ఓపీఎస్‌, ఈపీఎస్‌  భేటీ!

అన్నాడీఎంకేలో తీవ్ర ఉత్కంఠ


చెన్నై: అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌), ఉపన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) ఢిల్లీ బయలుదేరివెళ్లారు. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలు సమీపిస్తుండడం, త్వరలోనే అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ ప్రజల్లోకి వెళ్లనుండడం తదితరాల నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు ఢిల్లీ వెళ్లడం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేగాక అన్నాడీఎంకేకు ‘పెద్ద దిక్కు’గా పేరుగాంచిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోమంత్రి అమిత్‌షాలతో భేటీ కానుండడంతో ఆ పార్టీ వర్గాల్లో సైతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇంతకీ వీరిద్దరికీ ఢిల్లీ నుంచి పిలుపువచ్చిందా? లేక వీరే ప్రధాని అపాయింట్‌ కోరారా అన్నదానిపై అన్నివర్గాలు ఆరా తీస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మోదీతో వీరిద్దరి భేటీ త్వరలో అన్నాడీఎంకేలో నెలకొననున్న పెనుమార్పులకు నాంధీ కానుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 


గత ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 66 స్థానాలు గెలుపొందిన అన్నాడీఎంకే ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. ఎంజీఆర్‌, జయలలిత లేకుండా బరిలోకి దిగిన అన్నాడీఎంకే కుదేలవ్వడం ఖాయమని అన్ని వర్గాలు భావించినా.. నాటి ముఖ్యమంత్రి ఎడప్పాడి.. చెప్పుకోదగిన స్థానాలను రాబట్టగలిగారన్న ప్రశంసలూ వచ్చాయి. అయితే ఆ తరువాతే పార్టీలో లుకలుకలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు నుంచే శశికళతో దోస్తీకి తహతహలాడిన ఓపీఎస్‌.. ఎన్నికల పరాజయం అనంతరం పార్టీపై పట్టుకు పలు ప్రయత్నాలు చేశారు. అంతేగాక అసెంబ్లీ ప్రతిపక్ష నేత పదవిని సొంతం చేసుకునేందుకు సైతం తనవంతు ‘కృషి’ చేసినా తగిన ఫలితం దిక్కంచుకోలేకపోయారు. ఆ తరువాత కూడా బయటకు అంతా బాగానే వున్నట్టు కనిపిస్తున్నా ఈపీఎస్‌కు ఓపీఎస్‌ సరిగ్గా సహకరించడం లేదని, ఇరువురి నేతల మధ్య పొరపొచ్ఛాలు ఏర్పడ్డాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో అన్నాడీఎంకేను చేజిక్కించుకునేందుకు ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీ దుస్థితి గురించి ఆవేదన చెందుతూ, పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు, గాడిలో పెట్టేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానంటూ తనకు అనుయాయులుగా పేరుగాంచిన నేతలతో మాట్లాడిన ఆడియో టేపులను ఆమె మీడియాకు లీక్‌ చేస్తున్నారు. అన్నాడీఎంకే పట్ల ఆమె ప్రత్యక్ష ప్రకటనలు చేయకుండా.. ఇలా పరోక్షంగా కార్యకర్తలకు తన ఉద్దేశాన్ని చేరవేస్తున్నారని, ఇదంతా ఆమె పక్కా ప్రణాళికతో చేస్తున్నారన్న విమర్శలూ రేగుతున్నాయి. త్వరలోనే తాను ప్రజల్లోకి వస్తున్నానని, అన్నాడీఎంకే నుంచి తనను ఎవ్వరూ దూరం చేయలేరని కూడా ఆమె ఘంటాపథంగా చెబుతున్నారు.


ఆమె ప్రకటనలను ఈపీఎస్‌ వర్గం, మాజీ మంత్రి జయకుమార్‌ తదితరులు ఖండిస్తున్నప్పటికీ .. ఓపీఎస్‌ మాత్రం కిమ్మనడం లేదు. అంతేగాక శశికళకు తాను వ్యతిరేకం కాదని, జయ మరణం వ్యవహారంలో ఆమెపడ్డ మచ్చను తొలగించుకోవాలని మాత్రమే చెప్పానంటూ ఓపీఎస్‌ మీడియా ముందు స్పష్టం చేశారు. దీంతో శశికళ రాక పట్ల ఓపీఎస్‌ సానుకూలంగానే వున్నారని తేటతెల్లమైంది. ఇదే సమయంలో తీవ్ర అనారోగ్యం బారినపడిన అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌ ఇ.మధుసూదన్‌ను శశికళ పరామర్శించడం చర్చనీయాంశమైంది. ఆదిలో తన వెన్నంటి వుండి, జైలుకెళ్లాక తనను వ్యతిరేకించిన మధుసూదన్‌ను శశికళ పరామర్శించడం రాజకీయ వ్యూహంలో భాగమేనని, ఈ పరామర్శతో ఆమె పార్టీ నేతల్ని ఆకట్టుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారం ఈపీఎస్‌ను ఇరుకున పెట్టినట్లయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేగాక తనకు తెలియకుండానే పార్టీలో ఏదో జరుగుతోందని ఈపీఎస్‌ అనుమానిస్తున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా చాలాకాలం నుంచి దూరంగా పెడుతున్న పార్టీ సంస్థాగత ఎన్నికలు సైతం ఖచ్చితంగా జరిపాల్సిన పరిస్థితి నెలకొంది. నిజానికి అన్నాడీఎంకే పార్టీకి ప్రధాన కార్యదర్శే సర్వాధికారి. కానీ శశికళ జైలుకెళ్లాక సమన్వయకర్త, ఉపసమన్వయకర్త పదవులను సృష్టించి ఓపీఎస్‌, ఈపీఎస్‌ పంచుకున్నారు. అయితే ఈసారి ఖచ్చితంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పదవిలో ఎవరు కూర్చోవాలన్నదానిపై ఇప్పటికే ఈపీఎస్‌, ఓపీఎస్‌ తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. 


ఢిల్లీ ఏం చెబుతుందో?

శశికళ జైలుకెళ్లాక ఈపీఎస్‌ పార్టీపై పూర్తిగా పట్టు సాధించారు. ఇటీవల అసెంబ్లీ ప్రతిపక్షనేత పదవిని నిలబెట్టుకోవడంలోనే ఈ విషయం పార్టీశ్రేణులకు అవగతమైంది. అయితే ఇప్పుడు సంస్థాగత ఎన్నికలు జరుగనున్న తరుణంలో ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకోవడం అంత వీజీ కాదని ఈపీఎస్‌ భావిస్తున్నారు. ఒకవేళ శశికళ రంగప్రవేశం చేసి, ఓపీఎస్‌తో జత కడితే పార్టీ నిలువునా చీలడం ఖాయమని ఆయన భావిస్తున్నారు. ఓపీఎస్‌ను ఆయన పూర్తిగా నమ్మలేని స్థితిలో వున్నారు. శశికళకు మద్దతుగా ఓపీఎస్‌ చేస్తున్న వ్యాఖ్యలే ఈ అనుమానానికి కారణంగా కనిపిస్తోంది. అందువల్ల ఈ వ్యవహారంలో ఆది నుంచి తనకు అండగా నిలిచిన ప్రధాని మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్‌షా జోక్యం చేసుకోవడం మంచిందని ఈపీఎస్‌ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే వారితో మాట్లాడ్డం మంచిదని ఆయన తలపోశారు. ఓపీఎస్‌ సైతం ఇదేవిధంగా భావిస్తున్నట్టు సమాచారం. నిజానికి ఎన్నికలకు ముందు ఆయన, ఆయన కుమారుడు తేని పార్లమెంటు సభ్యుడు ఓపీ రవీంద్రనాథ్‌ శశికళకు మద్దతుగా మాట్లాడారు. దీంతో ఆయన్ని మోదీ కాస్త దూరంగా పెట్టారని, ఎన్నికల ప్రచారంలో ఈపీఎస్‌కు ఇచ్చినంత ప్రాధాన్యత ఓపీఎస్‌కు ఇవ్వలేదన్న ప్రచారం కూడా వుంది. అందుకే ఓపీఎస్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయకుండా కేవలం తన జిల్లాకే పరిమితమయ్యారన్న వాదన కూడా వుంది. అందుకే మోదీ, అమిత్‌షాలతో మాట్లాడేందుకు ఆయన పలుమార్లు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించినట్టు కనిపిస్తోంది. వారిని కలుసుకునేందుకు మోదీ సమ్మతించినట్టు సమాచారం.


అయితే ఈ భేటీలో నేతలు ఏం నిర్ణయిస్తారన్నదానిపై రకరకాల ఊహాగానాలు రేగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వరకు అన్నాడీఎంకేకి దూరంగా వుండాలని, ఆ తరువాత పార్టీ పగ్గాలు అప్పగిస్తామన్న కమలదళాధిపతుల సూచన మేరకే శశికళ రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి కనుక ఇచ్చిన మాట ప్రకారం ఆమెకు పగ్గాలు అప్పగించడంపై ఈపీఎస్‌, ఓపీఎస్‌లకు స్పష్టత ఇవ్వవచ్చని అన్నాడీఎంకేలోని ఓ నేత పేర్కొన్నారు. అయితే అది శశికళకు అనుకూలంగా వుంటుందా, వ్యతిరేకంగా మారుతుందా అన్నదానిపై పార్టీ వర్గాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారని ఆయన వివరించారు. వ్యూహంలో భాగంగానే శశికళ ‘అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం’ అధినేత దినకరన్‌ బృందాన్ని దూరంగా పెట్టారని, తను అన్నాడీఎంకేలోకి వచ్చినా దినకరన్‌ జోక్యం వుండబోదన్న సంకేతాలను పంపేందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు. అయితే ఆమె ఆశ ఫలిస్తుందా లేదా అన్నది ఆగస్టు మాసంలోనే తేలిపోతుందని ఆయన పేర్కొన్నారు. 


వేర్వేరుగా ఢిల్లీ వెళ్లిన నేతలు

పార్టీలో తమ మాటే నెగ్గేలా వ్యూహాలు కదుపుతున్న ఓపీఎస్‌, ఈపీఎస్‌.. వేర్వేరుగా ఢిల్లీ వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. ఆదివారం ఉదయం ఓపీఎస్‌ ఢిల్లీ వెళ్లగా, సాయంత్రం సేలంలో తన అనుయాయులతో భేటీ అయిన అనంతరం ఈపీఎస్‌ కోయంబత్తూరు నుంచి ఢిల్లీ వెళ్లారు. ఇలా నేతలిద్దరూ వేర్వేరుగా ఢిల్లీ వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. తొలిగా ఓపీఎస్‌కు ఢిల్లీ నుంచి పిలుపురాగా, ఆ తరువాత ఈపీఎస్‌కు ఆహ్వానం అందిందని, అందుకే ఇద్దరు నేతలు వేర్వేరుగా పయనమయ్యారని ఓ వర్గం పేర్కొంది. మరోవర్గం మాత్రం మోదీతో భేటీ సోమవారమే కనుక.. తమ ముందస్తు షెడ్యూల్‌ మేరకే నేతలు ఢిల్లీ పర్యటన ఖరారు చేసుకున్నారని వివరించింది. కాగా తొలిగా మోదీతో భేటీ అవుతున్న నేతలు.. ఆ తరువాత అమిత్‌షాతోనూ సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈపీఎస్‌తో పాటు మాజీ మంత్రులు తంగమణి, వేలుమణి, దళవాయి సుందరం కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కాగా వీరంతా మోదీ, అమిత్‌షాలతో పాటు కేంద్రమంత్రులు నిర్మాలా సీతారామన్‌, పీయుష్‌గోయల్‌, మురుగన్‌లతోనూ భేటీ కానున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2021-07-26T16:24:54+05:30 IST