టూల్‌కిట్ కేసు : దిశ రవికి బెయిలు మంజూరు

ABN , First Publish Date - 2021-02-23T21:55:05+05:30 IST

టూల్‌కిట్ కేసులో నిందితురాలు దిశ రవికి ఢిల్లీలోని పటియాలా

టూల్‌కిట్ కేసు : దిశ రవికి బెయిలు మంజూరు

న్యూఢిల్లీ : టూల్‌కిట్ కేసులో నిందితురాలు దిశ రవికి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు మంగళవారం బెయిలు మంజూరు చేసింది. ఆమె భారత దేశాన్ని అపఖ్యాతిపాలు చేయడానికి ప్రయత్నించినట్లు ఢిల్లీ పోలీసులు ఆరోపించిన సంగతి తెలిసిందే. 


టూల్‌కిట్ కేసులో మరో ఇద్దరు నిందితులు శాంతను ములుక్, నికిత జాకోబ్ ప్రస్తుతం ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిలుపై ఉన్న సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం దిశ రవిని ఢిల్లీ పోలీసు సైబర్ సెల్ కార్యాలయానికి తీసుకెళ్ళారు. శాంతను, నికితలతో కలిపి ఆమెను విచారించేందుకు ఒక రోజు పోలీసు కస్టడీకి కోర్టు సోమవారం అనుమతించిన సంగతి తెలిసిందే.


ఫిబ్రవరి 21న ఇరు పక్షాల వాదనలను పటియాలా హౌస్ కోర్టు స్వీకరించింది. దిశ రవికి బెయిలు మంజూరు చేయరాదని పోలీసులు కోరారు. ఆమెపై ఆరోపణల్లో పస లేదని ఆమె తరపు న్యాయవాది వాదించారు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రైతుల ట్రాక్టర్ ర్యాలీలో జరిగిన హింసకు, టూల్‌కిట్‌కు సంబంధం ఉన్నట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయా? అని జడ్జి ప్రశ్నించారు. 


దిశ రవికి మంగళవారం పటియాలా హౌస్ కోర్టు అడిషినల్ సెషన్ జడ్జి ధర్మేందర్ రాణా బెయిలు మంజూరు చేశారు. రూ.1,00,000 విలువైన సొంత పూచీకత్తును, అంతే విలువగల రెండు ష్యూరిటీలను సమర్పించాలని దిశను ఆదేశించారు. 


దిశ రవిని ఇటీవల బెంగళూరులోని ఆమె ఇంటి వద్ద ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ఖలిస్థాన్ అనుకూల సంస్థ అయిన పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్‌తో కలిసి పని చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. టూల్‌కిట్‌ డాక్యుమెంట్‌ను తయారు చేయడంలో దిశ, నికిత, శాంతను ఈ ఫౌండేషన్‌కు సహకరించారని ఆరోపించారు. జనవరి 26న రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ప్రభుత్వంపై అసంతృప్తిని రెచ్చగొట్టేందుకు ఈ టూల్‌కిట్ డాక్యుమెంట్‌ను తయారు చేసినట్లు ఆరోపించారు. ఈ టూల్‌కిట్‌ను స్వీడిష్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-02-23T21:55:05+05:30 IST