మన్యానికి పోటెత్తిన పర్యాటకులు

ABN , First Publish Date - 2022-01-17T06:26:55+05:30 IST

మన్యంలోని సందర్శిత ప్రాంతాలకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు.

మన్యానికి పోటెత్తిన పర్యాటకులు
చెరువులవేనంలో సందడి చేస్తున్న పర్యాటకులు


చింతపల్లి/పాడేరు/జి.మాడుగుల, జనవరి 16:మన్యంలోని సందర్శిత ప్రాంతాలకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. లంబసింగి, చెరువులవేనం, తాజంగి జలాశయం, వంజంగి మేఘాల కొండలు, కొత్తపల్లి జలపాతాలకు సంక్రాంతి సెలవులు, వీకెండ్‌ కలిసి రావడంతో ఆదివారం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వాతావరణం కూడా అనుకూలించడంతో ఉదయం ఐదు గంటల నుంచే లంబసింగి, తాజంగి జలాశయం, చెరువులవేనం వద్ద పర్యాటకుల సందడి మొదలైంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలిరావడంతో లంబసింగి వద్ద ఉదయం సుమారు గంటపాటు ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు లంబసింగి పరిసర ప్రాంతాలు పర్యాటకులతో కిటకిటలాడాయి. తాజంగి సాహస క్రీడల్లో పాల్గొనేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో క్యూకట్టారు. 

పాడేరు మండలం వంజంగి మేఘాల కొండ, జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతానికి సందర్శకుల తాకిడి తగ్గలేదు. వరుసగా పండగ సెలవులు కావడంతో శనివారం నుంచే వంజంగి మేఘాల కొండకు అధిక సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. అలాగే ఆదివారం ఉదయం వేలాది పర్యాటకులు వచ్చి మేఘాల మాటున సూర్యోదాయాన్ని ఉత్సాహంగా తిలకించారు. అలాగే జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతంలో పర్యాటకులు జలకాలాడుతూ ఆనందంగా గడిపారు. ఈదఫా కుటుంబాలతో వచ్చిన వారే అధికంగా ఉన్నారు. పర్యాటకుల రాకతో పాడేరు, జి.మాడుగుల ప్రాంతాల్లో సందడి నెలకొంది.  

 

Updated Date - 2022-01-17T06:26:55+05:30 IST