సింగరేణిలో కార్మిక సంఘాల కథ కంచికేనా?

ABN , First Publish Date - 2020-12-05T05:18:21+05:30 IST

నూట ముప్పై ఏళ్ళ సింగరేణి చరిత్రలో నూరేళ్ళకు పైబడిన కార్మిక పోరాట చరిత్ర..

సింగరేణిలో కార్మిక సంఘాల కథ కంచికేనా?
సింగరేణి కార్మికులు(ఫైల్‌)

- ఆర్థిక చక్రబంధంలో అతలాకుతం

- సంఘాల మెడకు ‘కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌’

- నీరుగారిపోతున్న జాతీయ సంఘాలు

- విప్లవ సంఘాలకు ప్రతికూల వాతావరణం

- క్రమంగా తగ్గుతున్న కార్మిక సంఘాల బలం

గోదావరిఖని, డిసెంబరు 4: నూట ముప్పై ఏళ్ళ సింగరేణి చరిత్రలో నూరేళ్ళకు పైబడిన కార్మిక పోరాట చరిత్ర..  ఏడు లక్షలకుపైగా ఉన్న కోల్‌ఇండియా కార్మికవర్గానికి ఉద్యమాలు నేర్పిన వీరోచీత ధీరోద్ధాత మార్గదర్శన.. కార్మిక హక్కుల సాధన, సింగరేణి సంస్థ అభివృద్ధిలో పోటీపడి ప్రాణత్యాగాలకు సిద్ధమైన కార్మిక పోరాటాల నిర్మాణ భూమిక.. ఇవన్నీ చరిత్ర గతం.. వర్థమానం వట్టిపోయింది. 

నాడు పోరాటాల బాట..

లక్షా పదిహేడు వేల మంది కార్మికులు 45వేలకు ఎలా తగ్గిపోయారో.. అలాగే సింగరేణి నేలపై పోరాటాలు చేసిన 72 కార్మిక సంఘాలూ ఏడుకు పడిపోయాయి. సింగరేణి కార్మిక పోరాటాల అవనికపై ఇప్పుడు కేవలం 10, 12 సంఘాల ఉనికి మాత్రమే ఉన్నది. అందులో అంపశయ్యపై కొన్ని, వెంటిలేటర్లపై కొన్ని సంఘాలు కొనఊపిరితో ఉన్నాయి. యూనియన్‌ కొంరయ్య, మాదిరెడ్డి భాస్కర్‌రావు, జాడి దుర్గ య్య, రమాకాంత్‌... ఇలా పేర్లు చెబితేనే కార్మికుల్లో వేడిరక్తం ఉబికేది. యాజమాన్యం వెన్నులో వణుకు పుట్టేది. ఒక్క పిలుపుతో సింగరేణిలో సమ్మె జరిగేది. సమ్మె నోటీస్‌లో పెట్టిన డిమాండ్లలో 80 శాతానికిపైగా హక్కులను గత్యంతరం లేక యాజమాన్యం ఒప్పుకునేది. 20 ఏళ్ళక్రితం చెప్పుకోదగ్గ స్థాయిలో సాధించిన హక్కులే ప్రస్తుత కార్మికులు అనుభవిస్తున్నవి. సంప్రదింపుల ద్వారా సాధించిన ఒకటి, అర మినహా ఇప్పటి సంఘాలు సాధించింది ఏమీ లేదు. ఇది కూడా గత చరిత్రే..

మారిన ‘ముఖచిత్రం’..

కార్మికులు ఉంటేనే సంఘాలు ఉంటాయని చెప్పుకునే సంఘాలు సింగరేణిలో కార్మికులు వేలల్లో తగ్గుతున్నా.. 50కి మించి భూగర్భ గనులు 20కి పడిపోతున్నా పట్టించుకోలేదు. నాలుగు ఓపెన్‌కాస్ట్‌లు 20కి పెరుగుతుంటే వాటిని నిలువరించే స్థాయిలో పోరాటాలూ చేయలేదు. ప్రపంచీకరణ, యాంత్రీకరణ.. అన్నీ వెరసి సింగరేణిలో కార్మికులనే గాక కార్మిక సంఘాలను లేకుండా చేసుకుంటూ వస్తున్నాయి. ప్రభుత్వాలను శాసించే స్థాయి నుంచి హక్కుల సాధనకు రాజకీయ నాయకుల గడపల ముందు సాగిలపడి యాచించే దుస్థితి సింగరేణి కార్మిక సంఘాలకు ఏర్పడింది. కారణాలు ఎన్నిఉన్నా, ఏమైనా ఇపుడు సింగరేణిలో కార్మిక సంఘాల ముఖచిత్రం మాత్రం ‘ఖతం బాట పట్టింది’. 

ఆర్థిక ఒడిదుడుకులు..

సంఘాలను నడపలేని దైన్య స్థితిలో కార్మిక నాయకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆఫీస్‌ నడపాలంటే నెలకు రూ.5వేల నుంచి 10వేల ఖర్చు. ఇలా డివిజన్‌కు ఒక ఆఫీస్‌ చొప్పున కార్మిక సంఘాల కార్యాలయాలను నడపలేని దైన్య స్థితిని ఆయా సంఘాల నాయకులు ఎదుర్కొంటున్నారు. ప్రెస్‌మీట్‌ పెట్టేందుకు రూ.500 దొరకడం లేదని ప్రధాన కార్మిక సంఘాల నాయకులు చెబుతున్న పరిస్థితులు ఉన్నాయి. సింగరేణిలో గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రారంభానికి ముందు కార్మికుల సంఖ్య లక్షకు పైగా ఉండేది. కార్మిక సంఘాలు సభ్యత్వం పేరిట కార్మికుల నుంచి చందాలు వసూలు చేసుకునేవి. జీతాల రోజు అన్ని సంఘాల జోలెలు నిండేవి. గర్తింపు సంఘం ఎన్నికలు వచ్చినప్పటి నుంచి గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలకు మాత్రమే కార్మికుల నుంచి చందా అవకాశం కల్పించింది. ఈ డబ్బులను కార్మికల వేతనాల నుంచి యాజమాన్యమే కోత విధించి చెల్లిస్తుంది. దీంతో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయేవి. మిగిలిన సంఘాలు కూడా కార్మికుల వద్ద చందాలు వసూలు చేసుకుని సంఘాలను నడిపేవి. కార్మికులకు బ్యాంక్‌ వేతనాల చెల్లింపులు ప్రారంభమయ్యాక ఆ అవకాశం లేకుండాపోయింది. 

‘కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌’ వేటు..

ఎన్నికలతో పాటు వచ్చిన కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌ పుణ్యాన ఓడిపోయిన సంఘాలకు బొగ్గుబాయిలు, ఓసీపీలపైన మీటింగులు పెట్టుకునే అవకాశాలు లేకుండాపోయాయి. బట్టతలపై తాడిపండు పడ్డట్టు గత గు ర్తింపు ఎన్నికల సందర్భం నుంచి సీఎం కేసీఆర్‌ కార్మిక సంఘాలకు చందాలు అవసరం లేదని చెక్‌అప్‌ సిస్టం ఖతం చేశాడు. దీంతో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకు కూడా రూపాయి దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరగడంతో కార్మిక సంఘాల ప్రాతినిథ్యం, ప్రాబల్యం తగ్గిపోయింది. సీఎండీ నుంచి గని మేనేజర్ల వరకు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు చెబితే తప్ప కార్మిక సంఘాల నా యకుల పనులు అయ్యే పరిస్థితి లేదు. కార్మిక సంఘాల్లో పదవులు కూడా ప్రజాప్రతినిధులు చెబితేనే వచ్చే రోజులు వచ్చాయి. దీంతో కార్మికలు సంఘాల నాయకులను ‘పెద్దమనుషులు’గా మాత్రమే చూస్తున్నారు. 

నీరసించిన జాతీయ సంఘాలు..

సింగరేణిలో 1998కి ముందు 70 సంఘాలు ఉండేవి. కార్మిక సంఘాలతో పాటు వృత్తి సంఘాల హవా కొంతకాలం నడిచింది. ఇపుడు వాటి చరిత్రే లేకుండాపోయింది. నానాకారణాల చేత ఇప్పుడు సింగరేణిలో 13 సంఘాలు మాత్రమే మిగలగా, సగం సంఘాలు నామమాత్రమే. రిజిస్ట్రేషన్‌ నంబర్‌ తప్ప రికగ్నిషన్‌ లేని సంఘాలు సగం ఉన్నాయి. సింగరేణిలో ప్రస్తుతం కనిపిస్తున్న సంఘాలు ఆరు, ఏడు మాత్రమే. ఇక ఎన్నికలు వస్తే పోటీలో నిలిచేది రెండు లేదా మూడుసంఘాలే. స్వతహాగా పోటీచేయలేని దైన్య స్థితిలో జాతీయ సంఘాలు పడ్డాయి. జాతీయ సంఘాలైన సీఐటీయూ, బీఎంఎస్‌ వంటి సంఘాలకు సింగరేణిలో రెండు దశాబ్దాలుగా బోణీయే లేదు. ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్‌ కొంత మెరుగ్గా కనిపించినా గత ఎన్నికల్లో హెచ్‌ఎంఎస్‌ ప్రాతినిధ్యం లేకుండాపోయింది. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీతో పొత్తుపెట్టుకుని గుర్తును, ఉనికిని మరుగున పడేసుకుంది. ఇక ఇప్పుడు జాతీయ సంఘంగా ఏఐటీయూసీ, అధికారిక సంఘం టీబీజీకేఎస్‌ మాత్రమే ఛాంపియన్లుగా కొనసాగుతూ వస్తున్నాయి. జాతీయ సంఘాల పరిస్థితి ఇలా ఉంటే.. ఎన్నికల చట్రంలో పడిన ఇఫ్టూ, ఏఐఎఫ్‌టీయూలాంటి విప్లవ కార్మిక సంఘాలు మిణుకుమిణుకుమంటున్నాయి. ఎన్నికలకు దూరంగా ఉండి కార్మిక సమస్యలపై పోరాటాలు చేసిన సి.కా.స వంటి విప్లవ కార్మిక సంఘాలు కూడా కోల్‌బెల్ట్‌లో వాతావరణం అనుకూలించక కనుమరుగయ్యాయి. గడిచిన 20ఏళ్ళలో కార్మికుల సంఖ్య లక్షా 16 వేల నుంచి 40 వేలకు పడిపోయిన తీరుగానే కార్మిక సంఘాలు కూడా పడిపోతూ వచ్చాయి. వచ్చే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నాటికి ఇప్పుడున్న సంఘాలు కూడా ఉంటాయా మరింతగా బలహీనపడతాయా లేక కనుమరుగు అవుతాయా అనేది తేలాల్సి ఉంది. లేదా కార్మికవర్గ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సరికొత్త పంఘాలో పోరాటపటిమను పునికిపుచ్చుకొని చేసుకొని నిజమైన కార్మిక సంఘాలుగా నిలబడుతాయా లేదా అన్నది వేచిచూడాల్సిందే. 

Updated Date - 2020-12-05T05:18:21+05:30 IST