వారధి.. వర్రీస్‌.. మలుపు మలుపుకో ముప్పు

ABN , First Publish Date - 2020-10-30T19:48:16+05:30 IST

విజయవాడ నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాల వైపు వెళ్లే బస్సులు ఆగేది అక్కడే. తూర్పు కృష్ణా, ఉభయగోదావరి, ఉత్తరాంధ్రల నుంచి పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌కు వచ్చే బస్సులు మలుపు తిరిగేదీ ఇక్కడే. జాతీయరహదారికి ఇవతలి వైపు నుంచి అవతలి వైపునకు తిరిగే మలుపూ ఇదే.

వారధి.. వర్రీస్‌.. మలుపు మలుపుకో ముప్పు

విశాలంగా ఉన్నా ఇరుకే

రహదారులపైకి ఐలాండ్‌లు

అడుగడుగునా వాహనాలే

అడ్డగోలు పార్కింగ్‌లు


విజయవాడ(ఆంధ్రజ్యోతి): విజయవాడ నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాల వైపు వెళ్లే బస్సులు ఆగేది అక్కడే. తూర్పు కృష్ణా, ఉభయగోదావరి, ఉత్తరాంధ్రల నుంచి పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌కు వచ్చే బస్సులు మలుపు తిరిగేదీ ఇక్కడే. జాతీయరహదారికి ఇవతలి వైపు నుంచి అవతలి వైపునకు తిరిగే మలుపూ ఇదే. ప్రతి మలుపులోనూ ముప్పు పొంచే ఉంటుంది. అలా అని అది ఇరుకు మార్గం కాదు.. సువిశాలమైన కనకదుర్గ వారధి ప్రాంతం. ఇంత విశాలమైన మార్గంలో అధికారులు చేసే పొరపాట్లే ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. 


విజయవాడలో ఇబ్రహీంపట్నం తర్వాత అతిపెద్ద కూడలి కనకదుర్గ వారధి. పేరుకు పెద్ద కూడలే అయినా బస్సులను ఎక్కడ ఆపాలన్న దానిపై స్పష్టత లేకపోవడం, మలుపుల వరకు ఐలాండ్‌లు ఉండడంతో ఇక్కడ అంతా తికమకగానూ ప్రమాద కరంగానూ కనిపిస్తోంది. 



ట్రబుల్‌ పాయింట్‌ 

పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ నుంచి గుంటూరు వైపు వెళ్లే బస్సులు కృష్ణలంక వంతెన పైనుంచి వచ్చి వారధికి దిగువ ఉన్న ఐలాండ్‌ వద్ద మలుపు తీసుకుంటాయి. ఆర్టీసీ అధికారులు సరిగ్గా ఈ ప్రదేశంలోనే బస్టాప్‌ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఇక్కడే వేచి ఉంటున్నారు. మొత్తం ఇక్కడ మూడు మలుపులు ఉన్నాయి. రాణిగారితోట వైపు నుంచి మహాత్మాగాంధీ రోడ్డులోని పశువుల ఆసుపత్రివైపు వెళ్లాల్సిన వాహనదారులు వారధి వద్ద మొదటి మలుపు నుంచి వెళ్తారు. రెండో మలుపు నుంచి గుంటూరు వైపు వెళ్లే వాహనాలు, మూడో మలుపులో బందరు రోడ్డు వైపు నుంచి పీఎన్‌బీఎస్‌కు వచ్చే బస్సులు వెళ్తాయి.  గుంటూరు వైపు వెళ్లే బస్సులకు స్టాప్‌ ఇక్కడే ఏర్పాటు చేయడంతో మూడో మలుపులోకి వెళ్లాల్సిన ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. ఫలితంగా మొదటి మలుపు నుంచి పశువుల ఆస్పత్రి రోడ్డులోకి వెళ్లాల్సిన వాహనదారులు రూటు తప్పి, ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. గుంటూరు బస్టాప్‌ వద్ద ఆటోలు, ప్రైవేటు టాక్సీలు ఇష్టానుసారం నిలిపివేయడంతో ఇతర వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. 


ఆక్రమించేసిన ఐలాండ్‌

వారధికి దిగువ పచ్చదనాన్ని పెంచ డానికి, ఇక్కడ మూడు మలుపులను వేరు చేసేలా విశాలమైన ఐలాండ్‌లు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ఐలాండ్‌లో అమరావతి డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ భారీ బౌద్ధస్థూపాన్ని నిర్మిస్తోంది. రెండు వైపులా జాతీయ రహదారులను ఆనుకుని దీనిని ఏర్పాటు చేయడంతో కూడలిలో రహదారులు ఇరుకుగా మారాయి. 


మార్పులు  అవసరం

వారధి వద్ద ట్రాఫిక్‌ ఇబ్బందులకు పరిష్కారంగా గుంటూరువైపు వెళ్లే ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన బస్టాప్‌ను నేతాజీ బ్రిడ్జి వైపునకు మార్చాలని నగర పౌరులు పలువురు సూచిస్తున్నారు.


స్క్యూబ్రిడ్జి వైపు వచ్చే రహదారికి పక్కన జలవనరుల శాఖకు చెందిన ఖాళీ స్థలం ఉంది. ఆర్టీసీ అధికారులు, జలవనరుల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఇక్కడ ఒక పెద్ద బస్‌బేను ఏర్పాటు చేయవచ్చుననేది మరో సూచన. ఇలా చేస్తే కృష్ణలంక వైపు ఉన్న బస్టాప్‌ల వద్ద ట్రాఫిక్‌ ఇబ్బంది చాలా వరకు తగ్గుతుంది. ఈ ఐలాండ్‌కు సమీపానే బస్‌బే ఉంటుంది కాబట్టి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఉన్న బస్టాప్‌లో ఎలాంటి సౌకర్యాలు లేవు. కొత్తగా ఇరిగేషన్‌ స్థలంలో బస్‌బే ఏర్పాటు చేసి, అక్కడ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడానికి వీలుంటుంది. 


ఇక బందరు రోడ్డు వైపు నుంచి పీఎన్‌బీఎస్‌కు వచ్చే బస్సులను, ప్రైవేటు ట్రావెల్స్‌ను నిలపడానికి ప్రత్యేకంగా ఒక ప్రదేశాన్ని ట్రాఫిక్‌ పోలీసులు సూచించాలన్నది మరో సూచన. వారధి వద్ద ఐలాండ్‌ల అభివృద్ధి ఇంకా ప్రాథమిక దశలో ఉన్నందున వాటి విస్తీర్ణాన్ని కుదిస్తే రహదారుల మలుపులు విశాలంగా ఉంటాయి. మొదటి, రెండో మలుపుల వద్ద ఐలాండ్‌ కొంత వరకే ఉండడంతో ఆ రహదారిని విభజించడానికి ట్రాఫిక్‌ పోలీసులు తాత్కాలికంగా కోన్‌లు ఏర్పాటు చేశారు. వాటికి బదులుగా రేడియం స్టిక్కరింగ్‌ ఉన్న చిన్న స్తంభాలను శాశ్వతంగా ఏర్పాటు చేయాలని, వారధికి రెండు వైపులా ఆటోలను నియంత్రించడంపై పోలీసు యంత్రాంగం దృష్టిసారించాలని సూచనలు వస్తున్నాయి. 

Updated Date - 2020-10-30T19:48:16+05:30 IST