ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ లేక ప్రమాదాలు

ABN , First Publish Date - 2021-10-18T05:58:46+05:30 IST

స్థానిక శ్మశాన వాటిక కూడలిలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుం టున్నాయి.

ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ లేక ప్రమాదాలు
రద్దీగా ఉన్న శ్మశాన వాటిక కూడలి

దడ పుట్టిస్తున్న శ్మశాన వాటిక జంక్షన్‌

అస్తవ్యస్తంగా వాహనాల రాకపోకలతో అవస్థలు

గోపాలపట్నం, అక్టోబరు 17: స్థానిక శ్మశాన వాటిక కూడలిలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుం టున్నాయి. బీఆర్‌టీఎస్‌ రహదారితో లింక్‌ రోడ్లు కలిసే ఈ కూడలిలో వాహనాల రాకపోకలు అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రమాదాలు జరుగు తున్నాయి. ఇది మూడు రోడ్ల జంక్షన్‌ కావడంతో పాటు ఎన్‌ఏడీ జంక్షన్‌ నుంచి గోపాలపట్నం వచ్చే బీఆర్‌టీఎస్‌ రహదారి పల్లంగా ఉంటుంది. దీంతో వాహనాలు వేగంగా రావడంతో రోడ్డు దాటే సమయంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గోపాలపట్నం కొండవాలు ప్రాంతాలకు చెందిన ప్రజలు, గోపాలపట్నానికి దిగువ ప్రాంతాల నుంచి సదరం అప్పలనాయుడు మార్గం మీదుగా ఎన్‌ఏడీ జంక్షన్‌ చేరేవారు ఈ కూడలి నుంచే రాకపోకలు సాగిస్తారు. అయితే ఈ రహదారిలో గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని సర్వీసు రోడ్డుల్లో స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేసినా ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఈ కూడలిలో వాహనచోదకులు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదం జరగక తప్పదు.

ట్రాఫిక్‌ పోలీసులు ఉన్నా..

ఈ కూడలిలో ఉదయం నుంచి రాత్రి వరకు ఇద్దరు ట్రాఫిక్‌ పోలీసులు నిత్యం విధులు నిర్వహిస్తూనే ఉంటారు. అయితే కూడలిలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేయకపోవడంతో ట్రాఫిక్‌ నియంత్రణలో పోలీసులదే కీలకపాత్ర. అయితే ట్రాఫిక్‌ పోలీసులు సర్వీస్‌ రోడ్డులో వచ్చే వాహనాలను నియంత్రించడమే సాధ్యపడుతుంది. ఈ క్రమంలో బీఆర్‌టీఎస్‌పై వచ్చే బస్సులు, ఇతర వాహనాలు వేగంగా దూసుకురావడంతో లింక్‌ రోడ్ల నుంచి వచ్చే వాహనచోదకులు ఈ కూడలిలో రోడ్డు దాటాలంటే భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు దృష్టి సారించి గోపాలపట్నం శ్మశాన వాటిక కూడలిలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ పాయింట్‌ ఏర్పాటు చేయాలని వాహనచోదకులు కోరుతున్నారు.

Updated Date - 2021-10-18T05:58:46+05:30 IST