విహార యాత్రలో విషాదం

ABN , First Publish Date - 2021-06-22T07:20:50+05:30 IST

విహారయాత్ర విషాదంగా మారింది. ఈతలో స్నేహితుల ఎదుట ప్రతిభను ప్రద ర్శించబోయిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నీట మునిగి మృతి చెందాడు.

విహార యాత్రలో విషాదం
క్రాంతికుమార్‌ (ఫైల్‌ ఫొటో)

కృష్ణానదిలో ఈత కొడుతూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

నేరేడుగొమ్ము, జూన్‌ 21: విహారయాత్ర విషాదంగా మారింది. ఈతలో స్నేహితుల ఎదుట ప్రతిభను ప్రద ర్శించబోయిన  ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నీట మునిగి మృతి చెందాడు. నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం వైజాగ్‌  కాలనీలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ సతీష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని బీఎన్‌రెడ్డి కాలనీ చైతన్యనగర్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పున్న యాదయ్య, పద్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రెండో కుమారుడు క్రాంతికుమార్‌(28) ఆస్ర్టేలియాలో ఎంఎస్‌ పూర్తి చేసి, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆదివారం సెలవు కావడం, లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో బీఎన్‌రెడ్డికాలనీకి చెందిన స్నేహితులైన పోలె దామోదర్‌, కొత్తపల్లి త్రిజిత్‌రెడ్డి, వడ్డెపల్లి ప్రవీణ్‌రెడ్డి, కేసాని యువరాజులతో కలిసి కారులో కృష్ణా పరివాహక ప్రాంతమైన మండలంలోని  వైజాగ్‌కాలనీకి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో చేరుకున్నాడు. స్నేహితులతో కలిసి భోజనాలు చేసిన అనంతరం సాయంత్రం క్రాంతికుమార్‌ నది మధ్యలో ఓ స్తంభానికి కట్టిన పుట్టీ (మరపడవ)ని తాకి వస్తానని స్నేహితులతో చెప్పి కృష్ణానదిలో దిగాడు. ఈత కొడుతూ వెళ్లి స్తంభాన్ని క్రాంతికుమార్‌ తాకాడు. అనంతరం తిరిగి ఒడ్డుకు చేరుకునే క్రమంలో ఆయాసం రావడంతో నీట మునిగాడు. ఒడ్డున ఉన్న స్నేహితులు గమనించి కేకలు వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో స్నేహితులు క్రాంతికుమార్‌ తల్లి దండ్రులకు, నేరేడుగొమ్ము పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గల్లంతైన క్రాంతికుమార్‌ కోసం వెతికారు. చీకటిపడడంతో సోమవారం ఉదయం వైజాగ్‌ కాలనీకి చెందిన గజ ఈతగాళ్లు నదిలో గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. సోమవారం ఉదయం 6.30 గంటలకు వైజాగ్‌కాలనీకి చేరుకున్న క్రాంతికుమార్‌ తల్లిదండ్రులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో స్నేహితులతో కలిసి విహారయాత్రకు వచ్చి తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని వారు వాపోయారు. క్రాంతికుమార్‌కు ఇంకా పెళ్లి కాలేదు. దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనం తరం మృతదేహాన్ని మధ్యాహ్నం ఒంటిగంట సమ యంలో హైదరాబాద్‌ తరలించారు. క్రాంతికుమార్‌ తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 



Updated Date - 2021-06-22T07:20:50+05:30 IST