రైల్వే.. టైం ట్రబుల్‌

ABN , First Publish Date - 2021-04-14T06:08:00+05:30 IST

రైల్వే నూతన సమయపట్టికపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. లాక్‌డౌన్‌కి ముందున్న టైంటేబుల్‌ని జీరో చేసి మళ్లీ కొత్త సమయపట్టిక తీసుకొచ్చిన రైల్వే శాఖ ఏమాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అభాసుపాలౌతున్నది.

రైల్వే.. టైం ట్రబుల్‌

రైళ్ల నూతన సమయపట్టికపై విమర్శలు

రైలులో కంటే నడిచివెళ్తేనే ముందుగా గమ్యస్థానం

పేరేచర్ల నుంచి గుంటూరుకు రెండున్నర గంటల ప్రయాణం

కాచీగూడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌కు కేటాయించిన సమయంపై విస్మయం


గుంటూరు, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): రైల్వే నూతన సమయపట్టికపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. లాక్‌డౌన్‌కి ముందున్న టైంటేబుల్‌ని జీరో చేసి మళ్లీ కొత్త సమయపట్టిక తీసుకొచ్చిన రైల్వే శాఖ ఏమాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అభాసుపాలౌతున్నది. కొన్ని రైళ్లకు ఒక స్టేషన్‌ నుంచి మరో స్టేషన్‌కి ఇచ్చిన సమయం చూసి నెటిజన్లు ట్రోలింగ్‌ చేస్తున్నారు. 11 కిలోమీటర్ల దూరానికి రెండున్నర గంటల సమయం కేటాయించడం చూసి ఇది రైల్వేకే సాధ్యమని విమర్శిస్తున్నారు. అంత సమయం అయితే రైలు కంటే నడిచి వెళ్తేనే నయమన్న అభిప్రాయం వ్యక్తమౌతున్నది. నిర్ణీత సమయానికి రైళ్లని నడపడం అంటే ప్రధాన స్టేషన్లకు కేటాయించిన సమయానికి చేరుకోవడం కాదని, మార్గమధ్యలో ఉన్న ప్రతీ స్టేషన్‌కు నిర్ణీత సమయానికి చేరుకోవడమని, రైల్వే పరిభాషలో మాత్రం గమ్యస్థానానికి చేరుకోవడంగా వ్యాఖ్యానిస్తున్నారు.  నిత్యం రాత్రి వేళ కాచీగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయానికి ఎక్స్‌ప్రెస్‌ రైలు గుంటూరుకు చేరుకుంటుంది. ఈ రైలు గతంలో ప్యాసింజర్‌గా నడిచేది. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. కాగా ఈ రైలుకు టైంటేబుల్‌లో పేరేచర్లకు ఉదయం 4.15కి చేరుకుంటుందని, గుంటూరుకు 6.45కి చేరుతుందని పేర్కొన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకొంటే పేరేచర్ల నుంచి గుంటూరుకు 11 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి రైల్వే శాఖ 2.30 గంటల సమయాన్ని కేటాయించింది. ఈ నేపథ్యంలో మార్గమధ్యలో ఎంత జాప్యం అయినా ఇక్కడ దానిని అధిగమించి నిర్ణీత సమయానికి తీసుకొచ్చి 100 శాతం సమయపాలన పాటిస్తున్నట్లుగా రైల్వేవర్గాలు భావిస్తున్నాయి. ఇదేవిధంగా సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ విశాఖపట్టణం నుంచి గుంటూరుకు వచ్చేటప్పుడు పెదకాకానికి 2.26 గంటలకు చేరుతుంది. అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోనే గుంటూరు రైల్వేస్టేషన్‌ ఉన్నది. అయినప్పటికీ పెదకాకాని నుంచి గుంటూరుకు 54 నిమిషాలను కేటాయించారు. కాచీగూడ - రేపల్లె డెల్టా ఎక్స్‌ప్రెస్‌ వేకువజామున 4.45 గంటలకు పల్లికోన చేరుతుందని సమయపట్టికలో పేర్కొన్నారు. ఇక్కడి నుంచి రేపల్లెకు ఆరు కిలోమీటర్ల దూరమే. అయినప్పటికీ గంట ఐదు నిమిషాల సమయం కేటాయించారు. ధర్మవరం - విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ నరసరావుపేట నుంచి గుంటూరుకు గంట 50 నిమిషాల సమయాన్ని కేటాయించారు. అలానే గుంటూరు నుంచి విజయవాడకు గంట 50 నిమిషాలు ఇచ్చారు. పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ విషయంలోనూ ఇదే తంతు. నాగిరెడ్డిపల్లి మొదలుకొని సత్తెనపల్లి వరకు సమయపాలన అనేదే ఉండదు. అరగంట నుంచి 50 నిమిషాల ఆలస్యంతో సత్తెనపల్లికి చేరుకుంటుంది. అయితే సత్తెనపల్లి నుంచి గుంటూరుకు గంటా 40 నిమిషాల సమయం కేటాయించారు. దీనివల్ల దెబ్బతిన్న సమయపాలనని ఇక్కడ అధిగమిస్తున్నారు. ఈ నేపథ్యంలో జీరో టైం టేబుల్‌లో ఆయా లోపాలని అధిగమించకుండా పాత సీసాలో కొత్త సారాయి అన్న చందంగా కొత్త టైంటేబుల్‌ తీసుకొచ్చారన్న విమర్శలు వ్యక్తమౌతున్నాయి. 


Updated Date - 2021-04-14T06:08:00+05:30 IST