ఇంకా పట్టాలెక్కని రెగ్యులర్ రైళ్లు.. అసలు కారణమిదేనా..?

ABN , First Publish Date - 2020-10-30T19:40:03+05:30 IST

అన్నింటా అన్‌లాక్‌లు అమల్లోకి వచ్చాయి. ఆర్టీసీ సిటీ బస్సులు కూడా రోడ్డెక్కాయి. ఆటోలు, కార్లు, టూరిస్ట్‌ బస్సులు, ప్రైవేటు బస్సులు అన్నీ తిరుగుతున్నాయి. ప్రజా రవాణాలో అందరికీ చవకైనది..

ఇంకా పట్టాలెక్కని రెగ్యులర్ రైళ్లు.. అసలు కారణమిదేనా..?

రెగ్యులర్‌ లాక్‌ తీయరా? ప్రత్యేక రైళ్లతో ఇంకెన్నాళ్లు?

‘ప్రైవేటు’ యోచనే జాప్యానికి కారణమా?

పేద, మధ్య తరగతి వర్గాలకు భారమేనా?

పాసింజర్‌ రైళ్ల రద్దే ఇందుకు నిదర్శనం

‘స్పెషల్స్‌’ పేరుతో అన్ని రాయితీలకూ కోత


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): అన్నింటా అన్‌లాక్‌లు అమల్లోకి వచ్చాయి. ఆర్టీసీ సిటీ బస్సులు కూడా రోడ్డెక్కాయి. ఆటోలు, కార్లు, టూరిస్ట్‌ బస్సులు, ప్రైవేటు బస్సులు అన్నీ తిరుగుతున్నాయి. ప్రజా రవాణాలో అందరికీ చవకైనది.. అత్యవసరమైనదీ అయిన రైలు ప్రయాణం మాత్రం ఇంకా దూరంగానే ఉండిపోయింది. కరోనా మాటున ‘ప్రైవేట్‌’కు లైన్‌ క్లియర్‌ చేసే పనిలో బిజీగా ఉన్న రైల్వే బోర్డు పాసింజర్‌ రైళ్లను రద్దు చేసింది. ‘ప్రత్యేక’ ఆదాయంపై దృష్టి సారించి, రెగ్యులర్‌ రైళ్లను ప్రజలకు దూరంగానే ఉంచింది. 


రైళ్లను ప్రైవేటీకరించేందుకు బిడ్డర్లను ఎంపిక చేసిన నేపథ్యంలో, రెగ్యులర్‌ రైళ్లను నడపటానికి ఇప్పటి వరకు ఆదేశాలు రాకపోవటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ‘ప్రైవేటు’ బాట పట్టే క్రమంలో ఆదాయమే పరమావధిగా భావిస్తున్న రైల్వేబోర్డు సాధారణ రైళ్లను నడపటానికి అనుమతులు ఇవ్వటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. వారం క్రితం పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఆదరించే పాసింజర్‌ రైళ్లను రద్దు చేసి, ఆ స్థానంలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడుపుతామన్న ప్రకటనతో రైల్వే బోర్డు అంతరార్థం బయట పడిందని ప్రయాణికులు అంటున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలు ఆశ్రయించే రైళ్లను అప్‌గ్రేడ్‌ పేరుతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా మార్చటం.. ప్రైవేటు చేతుల్లో పెట్టేందుకేనని రైల్వే ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 


‘ప్రత్యేక’ ఆదాయంపైనే దృష్టి 

విజయవాడ డివిజన్‌ నుంచి దసరాకు ముందు వరకు ప్రతి రోజూ 42 ప్రత్యేక రైళ్లు నడిచేవి. దసరా సందర్భంగా మరో 61 రైళ్లను స్పెషల్స్‌గా నడిపారు. దాదాపు 103 రైళ్లు విజయవాడ మీదుగా రాకపోకలు సాగించాయి. ఇన్ని స్పెషల్‌ రైళ్లను నడపగలిగినప్పుడు రెగ్యులర్‌ రైళ్లను నడపటానికి వచ్చిన ఇబ్బందులేమిటి? అన్నదే ప్రయాణికుల సందేహం. ‘ప్రత్యేకం’ పేరుతో ప్రయాణికులపై భారాలు మోపుతున్న రైల్వే.. రెగ్యులర్‌ రైళ్ల ఊసు మాత్రం ఎత్తటం లేదు. ఇది సామాన్యులకు రైళ్లను దూరం చేసే ప్రయత్నంలో భాగమేననే విమర్శలు వస్తున్నాయి.


రాయితీలు గోవిందా  

 రెగ్యులర్‌ రైళ్లలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు పలు రాయితీలు, ప్రయోజనాలు ఉంటాయి. కరోనా వల్ల రెగ్యులర్‌ రైళ్లనే పరిమితంగా నడిపితే సమస్య ఉండేది కాదు. ప్రత్యేక రైళ్ల పేరుతో నడుపుతున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో చార్జీ కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. అదే రెగ్యులర్‌ రైళ్లలో అయితే టికెట్‌ ధరలో రాయితీలు వర్తిస్తాయి. జనరల్‌ బోగీలు అందుబాటులో ఉంటాయి. జనరల్‌ బోగీలలో సాధారణ చార్జీలు ఉంటాయి. అలాగే దివ్యాంగులకూ రాయితీలు ఉంటాయి. ప్రత్యేక రైళ్లలో ఈ కేటగిరీలు ఏమీ ఉండవు. అందరూ ఎక్స్‌ప్రెస్‌ చార్జీలను చెల్లించే ప్రయాణించాలి. 


చిరు వ్యాపారులకు, ఉద్యోగులకు దూరం 

రెగ్యులర్‌ రైళ్లు లేకపోవటంతో చిరు వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగస్థులకు ఇబ్బందిగా ఉంది. సమీప ప్రాంతాల నుంచి నిత్యం విజయవాడ వచ్చే చిరు వ్యాపారులకు పాసింజర్‌ రైళ్లు అందుబాటులో ఉండేవి. ఇక్కడలో ఉద్యోగాలు చేసుకునే దూర ప్రాంతాల వారు కూడా పాసింజర్‌ రైళ్లపైనే ఆధారపడుతుంటారు. మరీ దూరప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే ఇంకొందరు రాయితీలతో రత్నాచల్‌, శాతవాహన, పినాకినీ ఎక్స్‌ప్రెస్‌లపై ఆధారపడేవారు. ఇప్పుడు ఆ రైళ్లు కూడా లేవు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల వారికి రైలు దూరమయింది.


కావాలనే దూరం చేస్తున్నారా? 

రైల్వేను ప్రయాణికులకు దూరం చేస్తున్నారన్న విమర్శలను రైల్వేబోర్డు మూటకట్టుకుంటోంది. పాసింజర్‌ రైళ్లను రద్దు చేసి, ఎక్స్‌ప్రెస్‌లుగా నడుపుతామని ప్రకటించడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. రైల్వే కార్మిక సంఘాలు సైతం ఇదే ఆందోళనలో ఉన్నాయి. 

Updated Date - 2020-10-30T19:40:03+05:30 IST