Advertisement
Advertisement
Abn logo
Advertisement

వర్షాలతో రైతన్నలో వణుకు

ఇటీవల వచ్చిన తుఫాన్‌కు మండలంలో 75 ఎకరాల వరి పంటకు నష్టం

3 నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారంతో గుబులు

చేతికొచ్చిన పంట నేలపాలవుతుందేమోనని ఆందోళన


సబ్బవరం, నవంబరు 30 : రైతులను భారీ వర్షాల భయం వీడడం లేదు. డిసెంబరు 3వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో మరింత ఆందోళన చెందుతున్నారు. వరి పంట చేతి కొచ్చే దశలో నేలపాలవుతుందేమోనని రైతులు భీతిల్లుతున్నారు. ఇటీవల వచ్చిన పలు తుఫాన్లు, అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలను తట్టుకుని నిలబడిన వరి పంట ఈసారి వచ్చే వర్షాలకు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పది రోజుల క్రితం వచ్చిన తుఫాన్‌కు మండలంలో సుమారు 75 ఎకరాల వరి పంట మాత్రమే దెబ్బతినడంతో రైతులు పెద్దగా ఆందోళన చెందలేదు. ఆ సమయానికి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట పసురు మీద ఉండడంతో వర్షం ప్రభావానికి తట్టుకుని నిలబడింది. వారం రోజుల్లో పలు గ్రామాల్లో వరి పంట పూర్తిగా కోత దశకు చేరుకుంది. వెన్నుతో పాటు చేను కూడా పండిపోయి బలహీనంగా మారింది. వాతావరణం అనుకూలించి ఉంటే సోమ, మంగళవారాల్లో రైతులు కోతలకు ఉపక్రమించేవారు. అయితే తుఫాన్‌ హెచ్చరికలతో కోత కోసేందుకు వారు వెనుకాడుతున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో బాగా పండిపోయిన పైరును రైతులు కోసేశారు. ప్రస్తుతం ఆ పంట మళ్లపైనే ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ ప్రథమార్థంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు మండలంలో 1,532 హెక్టార్లలో వరినాట్లు వేశారు. దాదాపుగా 80 శాతం కోత దశలో ఉండడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించినట్టయితే పంటను కాపాడుకోవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎవరూ కోతలు కోయవద్దని, కోసిన వారు మళ్లపై కుప్పలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఒక వేళ భారీ వర్షాలు కురిస్తే మళ్లలో నీరు లేకుండా దిగువకు కాలువల ద్వారా తరలించాలని సూచిస్తున్నారు. నేల వాలిన పైరును నిలబెట్టి కట్టలుగా కట్టుకుంటే కొంత మేర నష్టాన్ని తగ్గించుకోవచ్చని వ్యవసాయాధికారి పోతల సత్యనారాయణ సూచిస్తున్నారు. 

Advertisement
Advertisement