స్వయం పాలనతోనే గిరిజనాభివృద్ధి సాధ్యం

ABN , First Publish Date - 2021-11-27T06:09:48+05:30 IST

ఆదివాసీల స్వయం పాలనతోనే గిరిజన ప్రాంత అభివృద్ధి సాధ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎంవీఎస్‌.శర్మ అన్నారు.

స్వయం పాలనతోనే గిరిజనాభివృద్ధి సాధ్యం
మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర నేత ఎంవీఎస్‌.శర్మ



సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎంవీఎస్‌.శర్మ 

పాడేరులో ఉత్సాహంగా సీపీఎం సభల మహా ప్రదర్శన 

పాడేరు, నవంబరు 26: ఆదివాసీల స్వయం పాలనతోనే గిరిజన ప్రాంత అభివృద్ధి సాధ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎంవీఎస్‌.శర్మ అన్నారు. సీపీఎం జిల్లా మహాసభల సందర్భంగా శుక్రవారం స్థానిక అంబేడ్కర్‌ కూడలి వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో స్వయం పాలన ఉండాలని, ఐటీడీఏ అధికారుల నిర్ణయాల కంటే.. ఐటీడీఏ పాలకవర్గ నిర్ణయాల ఆధారంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గిరిజన ప్రాంతంలో వెయ్యి కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి, గిరిజనుల సమస్యలను పాలకుల ముందుంచామన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో సహజ సంపదలపైనా గిరిజనులకే హక్కు ఉంటుందని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. రైతుల పోరాట ఫలితంగానే కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసిందని శర్మ గుర్తు చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కొత్తపల్లి లోకనాథం మాట్లాడుతూ.. ఈనెల 27 నుంచి పాడేరులో మూడు రోజులు నిర్వహించే జిల్లా మహాసభలను విజయవంతం చేయాలన్నారు. అలాగే ప్రతి గిరిజన పల్లెలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పాడేరులోని మెడికల్‌ కాలేజీ నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో ఎస్‌టీ తెగల తొలగింపు వంటి చర్యలతో గిరిజనులపై పాలకుల వివక్ష స్పష్టమైందన్నారు.అంతకుముందు  పట్టణంలో మహా ప్రదర్శన ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు పాలకి లక్కు, కిల్లో సురేంద్ర, ఎస్‌.కొండలరావు, ఎల్‌.సుందరరావు, పోతురాజు, వై.మంగమ్మ పాల్గొన్నారు.


 

 

Updated Date - 2021-11-27T06:09:48+05:30 IST