పల్లెలకూ టీఎస్‌ బీపాస్‌

ABN , First Publish Date - 2021-07-30T04:33:26+05:30 IST

గ్రామాల్లో అక్రమ వెంచర్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మున్సిపల్‌ పాలన సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం రెండేళ్ల క్రితం తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టం(టీఎస్‌ బీపాస్‌) విధానాన్ని తీసుకొచ్చింది.

పల్లెలకూ టీఎస్‌ బీపాస్‌
పల్లె ముఖచిత్రం

- అమలుకు ప్రభుత్వం ఆదేశాలు
- లేఅవుట్ల వివరాలు కోరిన సర్కారు
- ఇప్పటికే ఈ పంచాయతీ ద్వారా అనుమతులు

కామారెడ్డి, జూలై 29: గ్రామాల్లో అక్రమ వెంచర్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మున్సిపల్‌ పాలన సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం రెండేళ్ల క్రితం తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టం(టీఎస్‌ బీపాస్‌) విధానాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో వివిధ రకాల అనుమతులు బీపాస్‌ ద్వారా మంజూరు అవుతున్నాయి. ఈ విధానాన్ని పల్లెల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. వివిధ రకాల పర్మీషన్లు కాకుండా గ్రామాల్లో కేవలం లే అవుట్‌ అనుమతులు మాత్రమే ఇవ్వాలని ఆదేశాల్లో స్పష్టం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
వివరాలు కోరిన ప్రభుత్వం
గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ లే అవుట్లు, ఇళ్ల నిర్మాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్న నేపథ్యంలో పల్లెలకు బీపాస్‌ను లింకు చేస్తే అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపాలిటీల్లో టీఎస్‌బీపాస్‌ ద్వారా భవన నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులు ఇస్తుండగా పల్లెల్లో కేవలం లేఅవుట్‌ పర్మిషన్లు మాత్రమే ఇవ్వనున్నారు. జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జీపీల వారిగా లే అవుట్ల వివరాలు ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. అధికారులు అక్రమ, సక్రమ లేఅవుట్ల వివరాలను జీపీల వారిగా సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఏఏ పంచాయతీల్లో లేఅవుట్లు ఉన్నాయి. ఏ సర్వే నెంబర్‌లో ఉన్నాయి. ఎన్ని ఎకరాల్లో ఉన్నాయి.. పర్మీషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అనే వివరాలు ఆరా తీస్తున్నారు.
ప్రస్తుతం వివిధ అనుమతులు ఇలా
పంచాయతీల్లో వివిధ రకాల అనుమతులు వేర్వేరుగా మంజూరవుతున్నాయి. ప్రతీ ఏడాది 3 నుంచి 5 వరకు దరఖాస్తులు వస్తుండగా పంచాయతీలే పర్మీషన్‌ ఇస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గ్రామాల్లో 200 స్క్వేర్‌ ఫీట్లలోపు ఇల్లు నిర్మించాలని దరఖాస్తు చేసుకున్న వారికి పంచాయతీ నుంచి పర్మీషన్‌ ఇస్తుండగా, 200 స్క్వేర్‌ఫీట్‌ కంటే ఎక్కువగా విస్తీర్ణం గల వారికి టౌన్‌ ప్లానింగ్‌, వెయ్యి స్క్వేర్‌ ఫీట్లకు ఉన్న వారికి హుడా నుంచి అనుమతులు మంజూరు చేస్తున్నారు. ప్రతీ ఏడాది ఇంటి నిర్మాణ అనుమతుల కోసం జిల్లాలో 10 నుంచి 15 దరఖాస్తులు వస్తున్నట్లు సమాచారం. ఇక ట్రేడ్‌ లైసెన్స్‌ జారీ విషయం పంచాయతీలే చూసుకుంటున్నాయి. ప్రతీ ఏడాది ట్రేడ్‌ లైసెన్స్‌ కోసం 20 వేల దరఖాస్తులు రాగా జీపీలకు రూ.1 కోటి వరకు ఆదాయం సమకూరింది. భవన నిర్మాణాలు, ట్రేడ్‌ లైసెన్స్‌లు, లేఅవుట్‌ పర్మీషన్ల కోసం పంచాయతీల్లో అమలవుతున్న ఈ పంచాయతీలోని సిటిజన్‌ ఆప్షన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత ధ్రువ పత్రాలను పరిశీలించి ఆన్‌లైన్‌లోనే అనుమతులు మంజూరు చేస్తున్నారు. గ్రామాలకు టీఎస్‌ బీపాస్‌ లింకు చేయడంతో బీపాస్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలన చేసి కలెక్టర్‌ అనుమతి ఇవ్వనున్నారు.

లేఅవుటక్లు పర్మీషన్లు తీసుకోవాలి
- సునంద, జిల్లా పంచాయతీ అధికారి
గ్రామాల్లో టీఎస్‌ బీపాస్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పంచాయతీల వారిగా లేఅవుట్ల వివరాలు కోరింది. ప్రస్తుతం జీపీల వారిగా వివరాలు సిద్ధం చేస్తున్నాం. పూర్తయిన వెంటనే నివేదికను కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి సమర్పిస్తాం. గ్రామాల్లో టీఎస్‌బీపాస్‌ ద్వారా కేవలం లేఅవుట్‌ అనుమతులు మాత్రమే ఇవ్వాలని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. దరఖాస్తు చేసుకున్న వెంటనే పరిశీలన చేసి కలెక్టర్‌ ద్వారా అనుమతులు మంజూరు చేస్తాం.

Updated Date - 2021-07-30T04:33:26+05:30 IST