బిక్కు...బిక్కు

ABN , First Publish Date - 2021-12-03T05:39:04+05:30 IST

మరో తుపాను ముంచుకొస్తోందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా రైతాంగం ఆందోళన చెందుతోంది. నెల రోజుల నుంచి వరుస అల్పపీడనాలతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి.

బిక్కు...బిక్కు

రైతుల్లో తుఫాన్‌ భయం.. 

రెండు రోజులపాటు వర్షాలు

వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆందోళన

అప్రమత్తంగా ఉండాలి  : కలెక్టర్‌ 

ఏలూరు సిటీ, డిసెంబరు 2 : మరో తుపాను ముంచుకొస్తోందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా రైతాంగం ఆందోళన చెందుతోంది. నెల రోజుల నుంచి వరుస అల్పపీడనాలతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ ప్రకటించిన తుపాను హెచ్చరిక రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. ఇప్పటికే చాలాచోట్ల వరి పంటకు అపారనష్టం వాట్లింది. ఇంకా కొన్నిచోట్ల చేలల్లో నీరు నిలిచే ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో మిగిలిన పంటను కోసేందుకు రైతులు రెడీ అవుతున్నారు. ఈ సమయంలో భారీగా వర్షాలు కురిస్తే చేతికొచ్చిన వరిపంట నాశనం అవుతుందని, పండ్ల తోటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది సార్వాలో 5.59 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా ఇప్పటివరకు వ్యవసాయ శాఖ అందించిన నివేదికల ప్రకారం లక్షా 25 వేల ఎకరాల్లోనే వరి మాసూళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికే తడిసిన ధాన్యం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని, మళ్లీ వర్షాలు కురిస్తే పంట పూర్తిగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతన్నారు.  


అప్రమత్తం చేయాలి :  కలెక్టర్‌ మిశ్రా

తుపాను ముప్పు పొంచి ఉన్నందున ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఆర్డీవోలు, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆదివారం సాయంత్రం వరకు తుఫాను ప్రభావం ఉండవచ్చునని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు తమ పంటలను భద్రపరచుకోవాలని సూచించారు. తుపాను ప్రభావం దృష్ట్యా పంటలను కోయవద్దన్నారు. వేగంగా గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. విద్యుత్‌ స్థంభాలు కూలితే రవాణాకు ఎటువంటి ఆటంకం లేకుండా వెనువెంటనే తొలగించేందుకు అవసరమైన పనిముట్లు, యంత్రాలు సిద్ధం చేసుకోవాలని రహ దారులు భవనాల శాఖను ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో జేసీలు హిమాన్షు శుక్లా, సూరజ్‌ ధనుంజయ్‌ తదితరులు పాల్గొన్నారు. 


 జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

నరసాపురం : తుఫాన్‌ హెచ్చరికతో రైల్వేశాఖ జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసింది. వాటిలో భువనేశ్వర్‌, రామేశ్వరం, హౌరా, యశ్వంత్‌పూర్‌, భువనేశ్వర్‌ – ముంబయి, పూరీ– తిరుపతి, హౌరా–చెన్నై, హౌరా– మైసూర్‌, హౌరా–యుశ్వంత్‌పూర్‌, భువనేశ్వర్‌– బెంగళూరు, భువనేశ్వర్‌– సికింద్రాబాద్‌, రాయఘడ్‌– గుంటూరు, చెన్నై–సెంట్రల్‌ హౌరా, హైద్రాబాద్‌– హౌరా, హౌరా– గోవా, తిరుచునాపల్లి– హౌరా, గుంటూరు– రాయఘడ్‌ రైళ్లు ఉన్నాయి. వీటిలో కొన్ని 3,4 తేదీల్లో తాత్కాలికంగా నిలిపి వేసినట్లు రైల్వేశాఖ పేర్కొంది. ఈ రైళ్లు జిల్లాలో తాడేపల్లిగూడెం, ఏలూరు, నిడదవోలు స్టేషన్ల మీదుగా వెళతాయి.


వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కు

తీరంలో జవాద్‌ ఫియర్‌ నెలకొంది. తుఫాన్‌ హెచ్చరిక తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. అధికారులు అలర్ట్‌ అయ్యారు. నరసాపురం, మొగల్తూరు తహసీల్దార్లు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. తుఫాన్‌ ప్రభావం త్రీవంగా ఉండే అవకాశం ఉన్నందున తీరం దాటే వరకు గ్రామాల్లోనే ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం అందిం చాలన్నారు. మత్స్యకారుల్ని వేటకు వెళ్లనివ్వకుండా చూడాలన్నారు. మత్స్యశాఖ అధికారులు వేటకు వెళ్లిన బోట్లను వెనక్కి రప్పిస్తున్నారు. 


Updated Date - 2021-12-03T05:39:04+05:30 IST