పసుపు అమ్మేదెలా!?

ABN , First Publish Date - 2020-02-23T05:42:02+05:30 IST

పంట చేతికి వస్తుందంటే రైతుకు పండుగే. దిగుబడిని అమ్మేసి అప్పులు తీర్చేసి కాస్తాకూస్తో మిగుల్చుకుని

పసుపు అమ్మేదెలా!?

దిగుబడికి ముందే దిగాలు...!

క్వింటం రూ.4 వేలకు దిగజారిన ధర

దిక్కుతోచని స్థితిలో సాగుదారులు


ఉదయగిరి రూరల్‌, ఫిబ్రవరి 22 : పంట చేతికి వస్తుందంటే రైతుకు పండుగే. దిగుబడిని అమ్మేసి అప్పులు తీర్చేసి కాస్తాకూస్తో మిగుల్చుకుని ఏడాది కష్టం మరిచిపోవాలనుకుంటాడు. కానీ పసుపు రైతు పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సరైన ధర లేక ఇప్పటికే సుమారుగా 5 వేల క్వింటాళ్ల వరకు నివాసాలు, గోదాముల్లో మూలుగుతోంది. ధర చూస్తే రూ.4వేలు దాటడంలేదు. అంత తక్కువ ధరకు నిల్వ సరుకే అమ్ముకోలేని పరిస్థితి కొత్తగా వచ్చే దిగుబడిని ఏం చేసుకోవాలి, అమ్ముదామంటే ధర లేదు. దాచుకుందామంటే నివాసాలు ఖాళీ లేవు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేదెలా అని పసుపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు, అనంతసాగరం, పొదలకూరు, వింజమూరు, ఇందుకూరుపేట, మర్రిపాడు, ఏఎస్‌పేట తదితర మండలాల్లో పసుపు పంట సాగు చేశారు. వారం రోజుల్లో పంట దిగుబడి చేతికొస్తుంది. ప్రస్తుతం ఽక్వింటా ధర రూ.4 వేలు పలుకుతుంది. ఈ ధరకు విక్రయిస్తే పెట్టుబడులు కూడా రావని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


మగ్గుతున్న నిల్వలు

పసుపు పంటకు గత తొమ్మిదేళ్లుగా సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు వచ్చిన దిగుబడిని గోదాములు, నివాసాల్లో సుమారు 5 వేల క్వింటాళ్ల వరకు నిల్వ చేసుకొని ఉన్నారు. ఎలాగైనా మద్దతు ధర వస్తుందన్న ఆశతో నెలల తరబడి వేచి చూస్తున్నా అది మాత్రం పెరగడంలేదు. దీంతో నిల్వ చేసిన పంటను కాపాడుకొనేందుకు రైతులకు తలకుమించిన భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో మరో వారం రోజుల్లో వస్తున్న దిగుబడిని ఎలా నిల్వ చేయాలో అర్థంకాక రైతులు తల పట్టుకొంటున్నారు. 


ప్రభుత్వం కొంటామంటూనే కొర్రీలు...

ప్రభుత్వం పసుపు పంటను కొంటామంటూనే కొర్రీలు వేసింది. క్వింటా రూ.6,875 మద్దతు ధరతో ఒక్కో రైతు గరిష్ఠంగా 30క్వింటాళ్లు మాత్రమే కొంటామని నిబంధన పెట్టారు. ఉద్యాన శాఖ అధికారుల అంచనా మేరకు హెక్టారుకు 70-80 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మార్కెఫెడ్‌ అధికారులు కొన్నాక మిగిలిన దిగుబడి ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం బయట మార్కెట్‌లో క్వింటా రూ.4500 పలుకుతుంది. మద్దతు ధర ప్రకారం క్వింటాపైనే రూ.2375 నష్టపోవాల్సి వస్తుంది. ఈ-కర్షక్‌లో నమోదైన పంటను మాత్రమే కొనుగోలు చేస్తారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన పంటను మార్కెట్‌ యార్డులో సిబ్బంది తనిఖీ చేసి నాణ్యత బాగుందని నిర్ధారించాలి. కొమ్ములు, ఉండల్లో తేమ శాతం, రాళ్లు, మట్టి, తాలు, పురుగు, పుచ్చిపోవడం వంటి ఉంటే అలాంటిని పసుపును కొనుగోలు చేయరు. ఇలాంటి పరిస్థితుల్లో నిల్వ ఉన్న దిగుబడి, రానున్న దిగుబడిని ఏలా అమ్ముకోవాలో రైతులకు అర్థం కాక ఆందోళన చెందుతున్నారు.  


అప్పులే మిగులుతున్నాయి..! 

రెండేళ్ల క్రితం రూ.3లక్షలు వెచ్చించి రెండెకరాల్లో పసుపు పంట సాగు చేశా. నాటి నుంచి సరైన ధర లేకపోవడంతో పంట దిగుబడిని ఇంట్లోనే నిల్వ చేశా. ప్రస్తుతం సాగులో ఉన్న పంట దిగుబడి మరో వారం రోజుల్లో వస్తుంది. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు.

- అంబవరం నారాయణ, కొత్తపల్లి


నిబంధనలు సడలించాలి..వాసిరెడ్డి సీతారామిరెడ్డి, కృష్ణారెడ్డిపల్లి

ప్రభుత్వం 30 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధన విధించడం బాధాకరం. ఆ నిబంధన సడలించాలి. ఎకరాకు సుమారు 40-50 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మిగిలిన పంటను ఏలా అమ్ముకోవాలి. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే రైతులకు ఎంతో బాగుంటుంది. 

Updated Date - 2020-02-23T05:42:02+05:30 IST