అంగడిబజార్‌లో అలజడి

ABN , First Publish Date - 2022-05-31T06:33:28+05:30 IST

ఆర్మూర్‌ పట్టణంలోని అంగడిబజార్‌లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం కోసం సోమవారం మున్సిపల్‌ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య కూరగాయలు అమ్మే గద్దెలను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న రైతులు అంగడిబజార్‌కు రావడంతో పోలీసులు సంఘటన స్థలానికి రాకుండా వారిని అడ్డుకున్నారు.

అంగడిబజార్‌లో అలజడి
ఆర్మూర్‌ పట్టణంలోని అంగడిబజార్‌లో గద్దెలను కూల్చివేస్తున్న మున్సిపల్‌ సిబ్బంది

పోలీసుల బందోబస్తు మధ్య మార్కెట్లో కూరగాయలు అమ్మే గద్దెల కూల్చివేత

ఇంటిగ్రేటెడ్‌ నిర్మాణంతో ఉపాధిని కోల్పోతామంలూ రైతుల నిరసన

గంటన్నర పాటు నిజాంసాగర్‌ కెనాల్‌ బ్రిడ్జి వద్ద రాస్తారోకో

ఆర్మూర్‌ టౌన్‌, మే 30: ఆర్మూర్‌ పట్టణంలోని అంగడిబజార్‌లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం కోసం సోమవారం మున్సిపల్‌ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య కూరగాయలు అమ్మే గద్దెలను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న రైతులు అంగడిబజార్‌కు రావడంతో పోలీసులు సంఘటన స్థలానికి రాకుండా వారిని అడ్డుకున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, ఎస్సై శ్రీకాంత్‌ రైతులతో మాట్లాడినా.. శాంతించని రైతులు స్థానిక నిజాంసాగర్‌ కెనాల్‌ బ్రిడ్జిపై గంటన్నర పాటు రాస్తారోకో చేశారు. కాగా, ఫిబ్రవరి 21వ తేదీన రూ.4.50 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించి ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో, మార్చి 10న రైతులందరూ కలిసి శిలాఫలకాన్ని ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం ఆగిపోయిందనుకున్న రైతులకు తిరిగి సోమవారం కూరగాయలు అమ్మె గద్దెలను కూల్చివేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి రైతులపై ఎందుకు కక్షకట్టారని, వారంతపు సంతకు ఉన్న స్థలం సరిపోవడంలేదని, ఒకపక్క టీఆర్‌ఎస్‌ నాయకులతో చర్చలు జరుపుతూ.. మరోపక్క అంగడిబజార్‌లో కరెంటు స్తంభాలకు ఉన్న లైట్‌లను తొలగింపజేసి చీకట్లో కూరగాయలు అమ్ముకోకుండా చేశారని, ఇక్కడి స్థలంలో కూరగాయలు అమ్మవద్దని బెదిరింపులు చేయించడం సమాజంకాదని రైతులు వాపోతున్నారు. గతంలో పోలీస్‌ క్వాటర్‌ నిర్మిస్తామంటే రైతులందరూ ఉద్యమం చేసి కాపాడుకున్న స్థలం అని, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తెలుసుకోవాలని సూచించారు. పది ఏళ్ల కిందట మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ రైతుల కోసం కూరగాయలు అమ్ముకోవడానికి గద్దెలు నిర్మించారని, అట్టి గద్దెలను మున్సిపల్‌ వారు కూల్చివేయడం సమంజసం కాదని అన్నారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మించుకోవాలంటే మరో చోట నిర్మించాలని సూచించారు. అంగడిబజార్‌లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మిస్తే మరో ఉద్యమం ప్రారంభమవుతుందని పలువురు రైతులు హెచ్చరించారు. 

Updated Date - 2022-05-31T06:33:28+05:30 IST