ప్రాదేశిక ఓట్ల లెక్కింపు రేపే

ABN , First Publish Date - 2021-09-18T05:33:30+05:30 IST

మండల, జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీపీ, జడ్పీటీసీ) ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.

ప్రాదేశిక ఓట్ల లెక్కింపు రేపే
చోడవరం ఓట్ల లెక్కింపు కేంద్రంలో పూర్తయిన ఏర్పాట్లు

ప్రతి మండలానికి ఆర్వో, ఏఆర్వో నియామకం

మండల స్థాయిలో శిక్షణ

కౌంటింగ్‌కు 79 హాళ్లు ఏర్పాటు

ఎంసీటీసీ ఓట్లకు 594, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు 568 టేబుళ్లు

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు

మండల కేంద్రాల్లో 144 సెక్షన్‌


విశాఖపట్నం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): మండల, జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీపీ, జడ్పీటీసీ) ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆదివారం జిల్లాలోని 39 మండల కేంద్రాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఇందుకోసం అనకాపల్లిలో ఐదు, కె.కోటపాడు, కోటవురట్లలో నాలుగు చొప్పున, మిగిలిన చోట్ల ఒకటి నుంచి మూడు వరకు... మొత్తం 79 హాళ్లు ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపునకు 587, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు 568 టేబుళ్లు వేస్తారు. ఓట్ల లెక్కింపు కోసం రిజర్వు సిబ్బందితో కలిపి 3,811 మందిని నియమించారు. ఓట్ల లెక్కింపునకు హాజరుకానున్న సిబ్బందికి మండలాల వారీగా శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆర్డీవోస్థాయి అధికారిని ప్రత్యేకాధికారిగా, జిల్లా అధికారులను మండలాలకు ఆర్వోలుగా, ఎంపీడీవోలు/ తహసీల్దార్లను ఏఆర్వోలుగా నియమించారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కిస్తారు. తరువాత సాధారణ ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల లోపల, బయట పరిసరాల్లో కొవిడ్‌ నిబంధనలను పక్కా అమలుచేస్తారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు వీడియో చిత్రీకరిస్తారు. ఎన్నికల ఫలితాల కోసం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌, మీడియా సెల్‌ ఏర్పాటుచేస్తున్నారు. 


జిల్లాలో 39 జడ్పీటీసీలకుగాను రోలుగుంట జడ్పీటీసీ ఏకగ్రీవం కాగా ఆనందపురంలో టీడీపీ అభ్యర్థి మృతితో ఎన్నిక వాయిదాపడింది. మిగిలిన 37 జడ్పీటీసీ స్థానాలకు 174 మంది పోటీ చేశారు. మొత్తం 652 ఎంపీటీసీ స్థానాలకు 37 స్థానాలు ఏకగ్రీవం కాగా... కె.కోటపాడు, ఎస్‌.రాయవరం మండలాల్లోని రెండు స్థానాల్లో ఇద్దరు అభ్యర్థులు మృతిచెందడంతో ఎన్నికను రద్దు వేశారు. భీమిలి మండలం రేఖవానిపాలెం ఎంపీటీసీ ఎన్నికను వాయిదా చేశారు. మిగిలిన 612 స్థానాలకు 1,790 మంది పోటీ చేశారు. దీంతో జిల్లాలో 37 జడ్పీటీసీ, 612 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది.


ఓట్ల లెక్కింపు ఇలా...

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది. సిబ్బంది, ఏజెంట్లు ఉదయం ఆరు గంటలకే కేంద్రాలకు చేరుకోవాలి. బ్యాలెట్‌ బాక్సులు వున్న స్ట్రాంగ్‌ రూమ్‌లను అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో తెరుస్తారు. ప్రతి కేంద్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు వేర్వేరుగా టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. ప్రతి టేబుల్‌కు ముగ్గురు సిబ్బందిని నియమించారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తారు. తరువాత బ్యాలెట్‌ బాక్సులు తెరిచి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్లు వేరుచేస్తారు. తరువాత ప్రతి 25 బ్యాలెట్‌ పత్రాలను ఒక కట్టగా కట్టి డ్రుముల్లో వేసి కలియతిప్పుతారు. తరువాత ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. తొలుత ఎంపీటీసీ స్థానాల ఫలితాలు వెలువడే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు.


భారీ బందోబస్తు

ఓట్ల లెక్కింపు నిర్వహించే మండల కేంద్రాల్లో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వుండేందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. మండల పరిధిలోని పోలీసులతోపాటు విశాఖ పోలీసు కమిషనరేట్‌ నుంచి ప్రతి మండలానికి పది మంది చొప్పున పోలీసు సిబ్బందిని పంపుతున్నారు.

Updated Date - 2021-09-18T05:33:30+05:30 IST