Abn logo
Aug 11 2021 @ 16:11PM

రాహుల్ గాంధీకి ట్విటర్ షాక్

న్యూఢిల్లీ : అత్యాచార బాధితురాలి తల్లిదండ్రుల గుర్తింపును వెల్లడిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన ట్వీట్ తమ విధానానికి వ్యతిరేకమని ట్విటర్ తెలిపింది. ఈ ట్వీట్‌ చేసినందుకు రాహుల్‌పై చర్యలకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణ సందర్భంగా ట్విటర్ తన వాదనను వినిపించింది. రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్)ను, పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఈ పిల్ దాఖలైంది. 


మకరంద్ సురేశ్ మద్లేకర్ ఈ పిల్‌ను దాఖలు చేశారు. జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్, 2015లోని నిబంధనల ప్రకారం రాహుల్ గాంధీపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని కోరారు. లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ చట్టం (పోక్సో)లోని నిబంధనల ప్రకారం అత్యాచార బాధితుల కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడించరాదు. ఈ నేపథ్యంలో ఎన్‌సీపీసీఆర్ ఢిల్లీ పోలీసులను, ట్విటర్‌ను సంప్రదించింది. రాహుల్ గాంధీపై ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరింది. 


ఢిల్లీలో ఇటీవల ఓ తొమ్మిదేళ్ళ బాలికపై కొందరు దుండగులు అత్యాచారం చేసి, హత్య చేసినట్లు కేసు నమోదైంది. బాధితురాలి కుటుంబ సభ్యులను రాహుల్ గాంధీ గత బుధవారం పరామర్శించారు. వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. అత్యాచార బాధితురాలి వివరాలు బహిరంగంగా తెలిసే విధంగా ఫొటోను ట్వీట్ చేయడం తమ విధానానికి విరుద్ధమని ట్విటర్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.