జిల్లాలో రెండు కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-04-05T10:45:57+05:30 IST

జగిత్యాల జిల్లా ఒక్కసారిగా ఉలి క్కిపడింది. ఊహించినట్లుగానే మర్కజ్‌కు వెళ్లినవారిలో కోరుట్లకు

జిల్లాలో రెండు కరోనా కేసులు

కోరుట్లలో ఇద్దరికి పాజిటివ్‌ 

చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలింపు  

కుటుంబ సభ్యులను జేఎన్‌టీయూ క్వారంటైన్‌కు తరలింపు

పరీక్షల కోసం 73 మంది శాంపిల్స్‌ సేకరణ 

ఇప్పటి వరకు 51 మందికి నెగెటివ్‌ రిపోర్ట్‌ 

ఇంకా అందని 20 మంది ఫలితాలు


జగిత్యాల, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా ఒక్కసారిగా ఉలి క్కిపడింది. ఊహించినట్లుగానే మర్కజ్‌కు వెళ్లినవారిలో కోరుట్లకు చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు.   పాజిటివ్‌ కేసులు బయటపడిన రెండు ప్రాంతాల్లో హెల్త్‌ సర్వే చేపట్టాల ని నిర్ణయించారు. వారు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారనేదా నిపై ఇప్పుడు ఆందోళనలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే పాజిటివ్‌ కేసులకు సంబంధించిన కుటుంబసభ్యులను కూడా ముందస్తుగా కొండ గట్టు జేఎన్‌టీయూలో ఉన్న క్వారంటైన్‌కు తరలించారు.


జగిత్యాల జిల్లాలో మర్కజ్‌కు వెళ్లినవారి సంఖ్య జిల్లాలో ఎక్కువగా ఉండగా, శనివారం వచ్చిన రిపోర్ట్‌లో కోరుట్లకు చెందిన ఇద్దరికి పాజిటివ్‌ అని తేలడంతో జిల్లావ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఢిల్లీలోని మర్కజ్‌కు జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, పెగడపల్లి ప్రాంతాల నుంచి 32 మంది వెళ్లారు. మొదట్లో 18 మంది అని తేలగా, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి 25 మందిగా నివేదికలు వచ్చాయి. కోరుట్లకు చెందిన తహసీల్దార్‌ ప్రత్యేక చొరవ తీసుకుని కొన్ని సర్వేలు చేయగా, మొత్తం మర్కజ్‌కు వెళ్లినవారు 32 మందిగా గుర్తించారు.


వీరందరూ హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు అధికా రులు చెబుతున్నా కొందరు మాత్రం ఇష్టానుసారంగా తిరిగారనే విమర్శ లు ఉన్నాయి. ఈ 32 మందితో పాటు హర్యానా వెళ్లి వచ్చిన మరో 32 మంది, వ్యాన్‌ డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు విదేశాలకు వెళ్లి వచ్చిన ఏడుగురి శాంపిల్స్‌ను తీసి మొత్తంగా 73 శాంపిల్స్‌ను కరోనా పరీక్ష నిమిత్తం హైదరాబాద్‌కు పంపామని జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి తెలిపారు. శని వారం 45 మంది రిపోర్ట్స్‌ రాగా, ఇద్దరికి పాజిటివ్‌, మిగిలిన 43 మందికి నెగెటివ్‌గా రిపోర్ట్‌ వచ్చింది. గతంలో పంపిన 8 మందికి ఇప్పటికే నెగెటివ్‌ రిపోర్ట్స్‌ రాగా, మిగిలిన 20 మంది రిపోర్ట్స్‌ ఇంకా రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.


ఆ రెండు ప్రాంతాలకు చెందినవారు ఎవరైనా కరోనా లక్షణా లైన జలుబు, దగ్గు, జ్వరం ఉన్నట్లయితే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్‌ రవి ఆదేశించారు. అయితే పాజిటివ్‌ వచ్చిన కోరుట్ల మండలంలోని కల్లూరు, కోరుట్ట పట్టణంలోని భీముని దుబ్బకు చెందిన ఇద్దరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కల్లూరు, భీముని దుబ్బ ప్రాంతాల వాసు లను అలర్ట్‌ చేశారు. వారి కుటుంబసభ్యులను కూడా ముందస్తుగా కొండ గట్టు జేఎన్‌టీయూలో ఉన్న క్వారంటైన్‌కు ప్రత్యేక అంబులెన్స్‌లో తరలిం చారు.


వారు ఎవరెవరితో కలిశారనే వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. కల్లూరులో కుటుంబసభ్యులతో పాటు మరో 21 మందిని బాధితుడు కలిసినట్లుగా గుర్తించి వారి పేర్లను అధికారులు నోట్‌ చేసుకు న్నారు. వారెవరు కూడా బయటకు రావొద్దని, హోం క్వారంటైన్‌లో ఉండా లని సూచించారు. భీముని దుబ్బ ప్రాంతాన్ని అదనపు కలెక్టర్‌ బి.రాజేశం పరిశీలించారు. ఏఎన్‌ంలు, హెల్త్‌ అసిస్టెంట్లు ఇంటింటా తిరిగి హెల్త్‌ చెకప్‌ చేయాలని, విదేశాల నుంచి వచ్చినవారి వివరాలు కూడా సేకరిం చాలని సూచించారు. ఆయన నివసిస్తున్న చుట్టుపక్కల 50 గృహా లవారు ఎవరూ బయటకు రావొద్దని ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి శ్రీధర్‌తో పాటు కోరుట్ల బల్దియా కమిషనర్‌ అయాజ్‌, తహసీల్దార్‌ సత్యనారా యణతో మున్సిపల్‌ కార్యాలయంలో సమీక్షించారు. 


జిల్లావ్యాప్తంగా అలర్ట్‌..

జగిత్యాల జిల్లాలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు బయట పడటంతో అధికారులందరూ అలర్ట్‌ అయ్యారు. జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై అదనపు కలెక్టర్‌ బి.రాజేశం, జిల్లా వైద్యాధికారి శ్రీధర్‌, కోరుట్ల మున్సిపల్‌ కమిషనర్‌ అయాజ్‌తో సమీక్షిం చారు. కల్లూరుకు చెందిన వ్యక్తిని రెండు, మూడు రోజులుగా జగిత్యా లలోని ప్రధాన ఆస్పత్రిలో ఉన్న ఐసోలేషన్‌లో ఉంచారు. ఆయనకు చికిత్స అందించిన వైద్యులతో పాటు సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆస్పత్రి ప్రాంతాన్ని కూడా సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణంతో స్ర్పే చేయించారు. మొదటి అంతస్థులో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డు వైపునకు ఎవరూ వెళ్లకుండా రెడ్‌జోన్‌గా ప్రకటించారు. సిబ్బందికి ముందు జాగ్రత్తగా కరోనా సూట్‌లు అందజేశారు.


ఇదిలా ఉంటే కల్లూరుకు చెందిన పాజిటివ్‌ కేసు వ్యక్తి ఇటీవలే వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకున్నాడు. ఆయన మర్కజ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత నాలుగైదు రోజుల క్రితం కోరుట్ల తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి తనకు రావాల్సిన బిల్లుల విషయంలో పొద్దంతా అక్కడే గడిపినట్లు తెలిసింది. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన ఆయన తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులతో ఆలింగనం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆయనకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయనను కలిసిన ఉద్యోగుల్లో భయం మొదలైంది.


వారంతా హోం క్వారంటైన్‌కు వెళ్లనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే వాలంటరీ రిటైర్డ్‌తో ఆయన కుమారునికి ఉద్యోగం రాగా, ఆయన జగిత్యాల కలెక్టరేట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. సదరు యువకుడు ఇద్దరు, ముగ్గురితో ఎక్కువగా కలిసి ఉంటుం డేవాడు. ఆయన తండ్రికి పాజిటివ్‌ రావడంతో కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఆయన స్నేహితుల్లో కూడా కలవరం మొదలైంది. ఇదిలా ఉండగా కోరుట్లలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి రిటైర్డ్‌ టీచర్‌. ఈయన స్థానికంగా పాల ప్యాకెట్లు విక్రయిస్తుంటాడు. మూడు, నాలుగు రోజుల క్రితం వరకు కూడా ఆయన పాల ప్యాకెట్లు విక్రయించారు. దీంతో ఆయన వద్ద ఎవరెవరు పాల ప్యాకెట్లు కొన్నారో వారిలో కూడా ఇప్పుడు గుబులు మొదలైంది.

Updated Date - 2020-04-05T10:45:57+05:30 IST