పిడుగుపాటు

ABN , First Publish Date - 2021-04-19T04:57:38+05:30 IST

జిల్లాలో ఉరుములు, మెరుపులతో ఆదివారం వర్షం కురిసింది. వేర్వేరుచోట్ల పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతిచెందారు. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే.. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి పంచాయతీ జగన్నాథపురం గ్రామానికి చెందిన ఆశి జయమ్మ(28) పిడుగుపాటుకు గురై దుర్మరణం చెందింది. కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ శవసానపుట్టుగలో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు గురై కోరాడ గౌరమ్మ(48) మృతి చెందింది.

పిడుగుపాటు
ఇచ్ఛాపురంలో కురుస్తున్న వర్షం... జయమ్మ, గౌరమ్మ (ఫైల్‌ఫొటోలు)

జిల్లాలో వేర్వేరుచోట్ల పిడుగు పడి ఇద్దరు మహిళల మృతి

కుటుంబ సభ్యుల్లో విషాదం

ఇచ్ఛాపురం రూరల్‌/కవిటి/సోంపేట రూరల్‌ : జిల్లాలో ఉరుములు, మెరుపులతో ఆదివారం వర్షం కురిసింది. వేర్వేరుచోట్ల పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతిచెందారు. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే.. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి పంచాయతీ జగన్నాథపురం గ్రామానికి చెందిన ఆశి జయమ్మ(28) పిడుగుపాటుకు గురై దుర్మరణం చెందింది. ఆదివారం ఉదయం ఈమె తన మరిది పెళ్లి సంబంధం కోసం మశాఖపురం గ్రామానికి  రెండు బైకులపై మరో ముగ్గురితో కలిసి వెళ్లింది. తిరిగి సాయంత్రం వస్తుండగా, వర్షం కురవడంతో ఓ చెట్టు కింద కాసేపు ఆగారు. ఇంతలో జయమ్మకు ఫోన్‌ కాల్‌ వచ్చింది.  ఆమె ఫోన్‌ మాట్లాడుతుండగా పిడుగుపడడంతో అక్కడికక్కడే జయమ్మ మృతి చెందింది. పక్కనే ఉన్న మోహినికి స్వల్ప గాయాలయ్యాయి. జయమ్మ భర్త కేశవరావు విదేశాల్లో పని చేస్తున్నారు. వీరికి కుమారుడు చైతన్య(7), కుమార్తె వెన్నెల(5) ఉన్నారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. 

కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ  శవసానపుట్టుగలో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు గురై  కోరాడ గౌరమ్మ(48) మృతి చెందింది. తోటలో పనులు ముగించుకొని ఈమె  ఇంటికి వస్తుండగా  సాయంత్రం పిడుగులతో వర్షం కురిసింది. ఆ సమయంలో ఆమె చెట్టు కింద నిలవగా.. అగ్గిపిడుగు పడింది. దీంతో గౌరమ్మ ఛాతి, ముఖం భాగాలు కాలిపోయి మృతి చెందింది. గౌరమ్మ   భర్త రామయ్య వలసకూలీ. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ అప్పారావు  కేసు నమోదు చేశారు. శవపంచనామా నిమిత్తం మృతదేహాన్ని సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గౌరమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 


కొబ్బరి చెట్లు దగ్ధం 

ఇచ్ఛాపురం మండలం కేశుపురం పొలాల్లో పిడుగు పడడంతో ఐదుగురు రైతులకు చెందిన ఆరు కొబ్బరి చెట్లు దగ్ధమయ్యాయి. బుడత శ్యామలరావుకు చెందిన రెండు, డొంక భాస్కరరావు, బుడత తిరుపతి, బుడత యశోద, బి.కృష్ణారావుకు చెందిన ఒక్కో కొబ్బరి చెట్టు కాలిపోయాయని బాధిత రైతులు వాపోయారు. అలాగే సోంపేట మండలం మామిడిపల్లి పంచాయతీ పరిధిలోని చిన్నమామిడిపల్లిలోగల నూకల బంద చెరువు సమీపంలో  పొలాల్లో కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. దీంతో రైతు  బచ్చల సారధికి చెందిన కొబ్బరి చెట్టు కాలిపోయింది. సాయంత్రం ఒక్కసారిగా పిడుగుల శబ్దం రావడంతో పొలాల్లో ఉన్న రైతులంతా పరుగులు తీశారు. 


ఉద్దానంలో వర్షం 

సోంపేట/ఇచ్ఛాపురం/కవిటి: ఉద్దానంలో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడింది. సోంపేట, ఇచ్ఛాపురం, కవిటి మండలాల్లో వర్షంతోపాటు ఈదురుగాలులు వీశాయి. దీంతో జీడి, మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. కొద్దిరోజులుగా ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు మాత్రం ఉపశమనం లభించింది.  

Updated Date - 2021-04-19T04:57:38+05:30 IST