కలిసికట్టుగా కొల్లగొట్టారు!

ABN , First Publish Date - 2020-07-08T22:21:40+05:30 IST

ఉదయగిరి మేజర్‌ పంచాయతీలో చోటుచేసుకొన్న అవినీతి బాగోతం..

కలిసికట్టుగా కొల్లగొట్టారు!

ఉదయగిరి పంచాయతీలో నిధుల గోల్‌మాల్‌

రూ.3.19 కోట్ల దుర్వినియోగం

కావలి డీఎల్పీవో విచారణలో వెలుగులోకి..

ఐదుగురు అధికారులపై చర్యలకు కలెక్టర్‌ సిఫారసు

ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌

సర్పంచు నుంచి రికవరీకి ఆదేశాలు


ఉదయగిరి(నెల్లూరు): ఉదయగిరి మేజర్‌ పంచాయతీలో చోటుచేసుకొన్న అవినీతి బాగోతం అధికారుల విచారణలో వెలుగుచూసింది. గతంలో పని చేసిన ఐదుగురు అదికారులు, ఇద్దరు పంచాయతీ పంచాయతీ కార్యదర్శులు, ఓ సర్పంచు అవినీతిలో భాగస్వాములై రూ.3,19,30,620 నిధులు గోల్‌మాల్‌ చేయడం గమనార్హం. అయితే, 2014 నుంచి 2020 వరకు జరిగిన పలు రకాల నిధులకు సంబంధించి అధికారులు అవినీతికి పాల్పడి ప్రభుత్వ సొమ్మును కాజేశారంటూ ఓ వ్యక్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారి ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన కావలి డీఎల్‌పీవో రమేష్‌ నిధులు గోల్‌మాల్‌ విషయం వాస్తవమేనని ధ్రువీకరించి కలెక్టర్‌కు నివేదికలు అందజేశారు.


దీంతో అప్పట్లో విధులు నిర్వహించిన ఫణిపవన్‌కుమార్‌, షేక్‌ జహీర్‌, ప్రస్తుతం విధుల్లో ఎంపీడీవో ఆర్‌ఎస్‌ వీరాస్వామితోపాటు పీఆర్‌ ఏఈలు, పంచాయతీ ప్రత్యేకాధికారులు వీవీ దయాల్‌, వాణిలపై చర్యలు చేపట్టాలని సూచిస్తూ పంచాయతీరాజ్‌ కమీషనర్‌కు కలెక్టర్‌ సిఫారసు చేశారు. అలాగే, అప్పటి కార్యదర్శి, ప్రస్తుతం కలిగిరి మండలం కాకుటూరు పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న ఎల్‌.శ్రీనివాసులు, బండగానిపల్లి పంచాయతీ కార్యదర్శి ఎన్‌.చినబాబులను సస్పెండ్‌ చేశారు. వీరితోపాటు అప్పటి సర్పంచు షేక్‌ మొబీనాను బాధ్యురాలు చేస్తూ రికవరీకి ఆదేశాలు జారీ చేశారు. 


అవినీతి జరిగిన తీరిదే!

అప్పట్లో విధులు నిర్వహించిన ఎమ్పీడీవో ఫణిపవన్‌కుమార్‌ హయాంలో రూ.9,56,731, షేక్‌ జహీర్‌ రూ.83,212, ప్రస్తుత ఎంపీడీవో వీరాస్వామి రూ.77,41,214, మాజీ సర్పంచ్‌ షేక్‌ మొబీనా రూ.1,14,43,991, పీఆర్‌ ఏఈలు వీవీ దయాల్‌ రూ.16,28,527, వాణి రూ.5,24,020, పంచాయతీ కార్యదర్శలు ఎల్‌.శ్రీనివాసరావు రూ.89,80,851, ఎన్‌.చినబాబు 5,72,074 నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారు. 


ఇంటి పన్నుల్లోనే..

ఇంటి పన్నుల్లో భారీగా గోల్‌మాల్‌ చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. లైసెన్సు ఫీజులు, కొళాయి డిమాండ్‌ రిజిస్టర్లు, రశీదు పుస్తకాలు, ఖజానా చలానాల రికార్డులు మాయం చేశారు. ఖజానాకు చెల్లింపుల్లో తక్కువ చేసి స్వాహా చేశారు. మార్కెట్‌ రూములు, మాంసం, కూరగాయలు, మార్కెట్‌, బస్టాండ్‌ వేలం సొమ్ములు జమ చేయలేదు. 13, 14వ ఆర్థిక సంఘం నిధులు డ్రా చేసి వివిధ పనులకు ఖర్చు చేయగా వాటికి తీర్మానాలు, ఎంబుక్‌లు లేనట్లు విచారణలో గుర్తించారు. ఇలా ఒకటి రెండు.. కాదు అడుగడుగునా ఉదయగిరి పంచాయతీలో నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు అధికారులు నిగ్గు తేల్చారు. దీంతో ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకొన్నారు. 


Updated Date - 2020-07-08T22:21:40+05:30 IST