వీథుల్లో యుద్ధం మొదలైంది... ప్రజలను హెచ్చరించిన ఉక్రెయిన్...

ABN , First Publish Date - 2022-02-26T17:20:35+05:30 IST

రష్యా దళాలు శనివారం ఉదయం ఉక్రెయిన్ రాజధాని నగరం

వీథుల్లో యుద్ధం మొదలైంది... ప్రజలను హెచ్చరించిన ఉక్రెయిన్...

కీవ్ : రష్యా దళాలు శనివారం ఉదయం ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌లోకి చొచ్చుకెళ్ళాయి. దీంతో వీథి పోరాటం మొదలైందని కీవ్ అధికారులు ప్రజలను హెచ్చరించారు. ప్రజలు షెల్టర్లు, బంకర్లలో ఉండాలని, కిటికీలకు దూరంగా ఉండాలని తెలిపారు. పేలుళ్ళు జరిగినపుడు శిథిలాలు ఎగిరిపడి, దెబ్బలు తగిలే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. 


గురువారం ఉదయం ప్రారంభమైన యుద్దం కారణంగా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు, వందలాది మంది గాయపడ్డారు. వంతెనలు, భవనాలు, పాఠశాలలు, అపార్ట్‌మెంట్లు ధ్వంసమయ్యాయి. 


ఇదిలావుండగా, ఉక్రెయిన్‌లో ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చేసి, తనకు నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ కోరుకుంటున్నారని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యాపై కఠినమైన ఆంక్షలను విధించింది. 


ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు. అనేక నగరాలపై రష్యా దాడులు కొనసాగుతున్నారు. ఈరోజు రాత్రి మనం దృఢంగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ భవిష్యత్తు ఇప్పుడే నిర్ణయమవుతోందన్నారు. రష్యాతో యుద్ధం నేపథ్యంలో సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని అమెరికా ఇచ్చిన ఆఫర్‌ను జెలెన్‌స్కీ తిరస్కరించారు. యుద్ధం ఉక్రెయిన్‌లో జరుగుతోందని, తనకు ఆయుధాలు కావాలని, పలాయనం కోసం మార్గం కాదని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. 


Updated Date - 2022-02-26T17:20:35+05:30 IST