Ukraine Crisis: హృదయ విదారక దృశ్యం.. వైరల్ వీడియో!

ABN , First Publish Date - 2022-02-25T15:04:17+05:30 IST

రష్యా దాడితో ఉక్రెయిన్‌లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

Ukraine Crisis: హృదయ విదారక దృశ్యం.. వైరల్ వీడియో!

కీవ్: రష్యా దాడితో ఉక్రెయిన్‌లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రష్యన్ మిలిటరీ బాంబు దాడులతో రాజధాని కీవ్‌తో పాటు కీలక నగరాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కీవ్‌లోని స్థానికులు ప్రాణాలు అరచేత పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కొందరు నగరాలను వీడి ఇతర దేశాల సరిహద్దులకు వెళ్తోంటే.. మరికొందరు అండర్‌గ్రౌండ్‌ మెట్రో స్టేషన్లు, బంకర్లలో తలదాచుకుంటున్నారు. కొంతమంది తమ భార్యాపిల్లలైనా ప్రాణాలతో బయటపడాలని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదే కోవలో ఓ తండ్రి తన కూతురిని సురక్షిత ప్రాంతానికి పంపిస్తూ హత్తుకుని ముద్దులు పెడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో నెటిజన్ల హృదయాలను కలిచి వేస్తోంది. ఆ చిన్నారి కూడా తండ్రిని పట్టుకుని గట్టిగా ఏడ్వడం వీడియోలో ఉంది.




ఇక ఉద్రిక్తతల నేపథ్యంలో కీవ్‌లో మంచినీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో తాగునీటి కోసం స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అటు రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో ఎమర్జెన్సీ ప్రకటించడంతో వాహనాల్లో ఇంధనం నింపేందుకు పెట్రోల్‌ బంకులకు వాహనదారులు పోటెత్తారు. సురక్షిత ప్రాంతాలకు భారీగా జనాలు తరలివెళ్తుండడంతో కీవ్‌ వీధుల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడ్డాయి. కాగా, రష్యా మిలిటరీ క్షిపణుల దాడిలో ధ్వంసమైన భవనాలు.. గాయపడిన సైనికులు, పౌరులతో ఉక్రెయిన్‌లో  భయానక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. రష్యా బలగాలు ఇప్పటివరకు కీవ్, సుమి, కార్కివ్, డొనెస్టక్, లుగాన్స్క్, చెర్నోబిల్, మారియూపూల్ ప్రాంతాల్లో వైమానిక దాడులు నిర్వహించాయి. మరికొన్ని ప్రాంతాలను హస్తగతం చేసుకునేందుకు ముందుకు సాగుతున్నాయి. 

Updated Date - 2022-02-25T15:04:17+05:30 IST