ఉక్రెయిన్‌లో చిక్కుకున్న కన్నడిగుల రక్షణకు చర్యలు

ABN , First Publish Date - 2022-02-26T18:20:19+05:30 IST

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న కన్నడిగులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. నగరంలో శుక్రవారం ఆయన మీడియాతో

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న కన్నడిగుల రక్షణకు చర్యలు

- విదేశీ వ్యవహారాల శాఖ మంత్రితో సీఎం చర్చలు

- 180 మంది విద్యార్థులు ఉన్నట్లు అంచనా

- బంకర్లలో తలదాచుకున్నట్లు సమాచారం

- ఆందోళనలో కుటుంబీకులు

- నోడల్‌ అధికారి నియామకం


బెంగళూరు: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న కన్నడిగులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. నగరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో రాష్ట్రానికి చెందిన 180 మంది విద్యార్థులు మెడిసిన్‌ తదితర కోర్సులు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. బెంగళూరు, మైసూరు, బళ్లారి, హాసన, ధార్వాడ, విజయపుర, హావేరి, రాయచూరు, దావణగెరె, కల్బుర్గి, బాగల్కోటె, శివమొగ్గ జిల్లాలకు చెందిన వారు అధికంగా ఉక్రెయిన్‌లో వైద్య విద్యాకోర్సులు చేస్తున్నారన్నారు. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే వీరిలో చాలా మంది విద్యార్థులు భారత్‌కు తరలివచ్చేందుకు విమాన టికెట్లు కూడా సిద్ధం చేసుకున్నా చివరి క్షణంలో విమాన ప్రయాణాలు రద్దుకావడంతో చిక్కుకుపోయారని సీఎం వివరించారు. ఈ విద్యార్థులంతా సురక్షితంగానే ఉన్నారని చెప్పారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమని గడుపుతున్నట్లు ధార్వాడ జిల్లా కుందగోళ తాలూకా యరగుప్పి గ్రామానికి చెందిన విద్యార్థిని చైత్రా సంశి తమ కుటుంబీకులకు గురువారం రాత్రి ఫోన్‌చేసి చెప్పినట్లు తెలిసింది. రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉన్నామన్నారు. తాము ఉంటున్న యూనివర్సిటీ హాస్టల్‌కు కిలోమీటర్ల దూరంలోనే బాంబుల మోతతో తీవ్రంగా భయపడ్డామని సదరు యవతి వెల్లడించింది. కాగా ఉక్రెయిన్‌ విద్యార్థుల భద్రతకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్థనారాయణ నగరంలో శుక్రవారం మీడియాకు చెప్పారు. ఉక్రెయిన్‌లో రాష్ట్ర విద్యార్థులతో పాటు అక్కడ పనిచేస్తున్న వారి సంఖ్య 200 వరకు ఉందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. వైద్య కోర్సులు చేస్తున్న విద్యార్ధుల సంఖ్య 91 వర కు ఉందని జిల్లాల వారీగా వీరి పేర్లు, ఫోన్లు, విద్యనభ్యసిస్తున్న యూనివర్సిటీ తదితర  వివరాలను విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందజేశామన్నారు. కాగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులందర్నీ సురక్షిత ప్రాంతాలకు తరలించే బాధ్యతను అక్కడి రాయబార కార్యాలయం చేపట్టినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు తెలిపారన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న  కన్నడిగులంతా సురక్షితంగా తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మాజీ ప్రధాని దేవెగౌడ శుక్రవారం ట్వీట్‌ చేశారు.


ఆందోళనలో కొడగు జిల్లా విద్యార్థుల కుటుంబాలు

కొడగు జిల్లాకు చెందిన నలుగురు ఉక్రెయిన్‌లో ఉన్నారు. వీరిలో నాల్వరు గ్రామానికి చెందిన నర్సు కుమారుడు లిఖిత్‌, కుశాల్‌నగర్‌ తాలూకా కొడ్లూరు గ్రామానికి చెందిన రా జకీయ నాయకుడు మంజునాథ్‌ కుమారుడు చందన్‌గౌడ, కూడిగె గ్రామానికి చెందిన అక్షిత, విరాజ్‌పేటకు చెందిన సోను సుఫియా తమ తల్లిదండ్రులకు ఫోన్‌చేసి తమను కాపాడాలని వేడుకున్నట్లు తెలుస్తోంది. ఈ నలుగురు ప్రస్తుతం బెకటోవా మెట్రో రైల్వేస్టేషన్‌ అండర్‌గ్రౌండ్‌లో రక్షణ పొందుతున్నట్లు సమాచారం అందింది. అక్కడ ఇప్పటికే వందలాది మంది రక్షణ పొందుతున్నారని, వీరిలో భారతీయులతో పాటు ఇతర దేశాలకు చెందిన వారూ ఉన్నట్లు విద్యార్థులు వెల్లడించినట్లు తెలిసింది. తమ పిల్లలు ఎలా ఉన్నారో తెలియక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ పిల్లలు సురక్షితంగా తిరిగి రా వాలని కోరుకుంటూ ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.


నోడల్‌ అధికారిగా మనోజ్‌

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న కర్ణాటక విద్యార్థులు, ఉద్యోగులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీనియర్‌ ఐఎ్‌ఫఎస్‌ అధికారి డాక్టర్‌ మనోజ్‌ రాజన్‌ను నోడల్‌ అధికారిగా నియమించింది. ప్రస్తుతం ఆయన రెవెన్యూ శాఖ నిర్వహణలోని విపత్తు నిర్వహణా ప్రాధికార కమిషనర్‌గా సేవలందిస్తున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న కన్నడిగులకు నోడల్‌ అధికారి హెల్ప్‌లైన్‌ 080- 22340676ను సంప్రదించేలా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీకి చేరుకోగానే కన్నడిగులను ప్రత్యేక విమానంలో బెంగళూరుకు రప్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నోడల్‌ అధికారి మనోజ్‌ వెల్లడించారు.

Updated Date - 2022-02-26T18:20:19+05:30 IST