నిరుద్యోగులకు.. నిరాశే!

ABN , First Publish Date - 2021-08-12T05:01:49+05:30 IST

పేద, బడుగు, బలహీనవర్గాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఏటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు తదితర కార్పొరేషన్లు సబ్సిడీ రుణాలు మంజూరు చేసేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీటిని మంజూరు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కార్పొరేషన్ల వారీగా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. లక్ష్యాల మేరకు యూనిట్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. దీంతో రుణం చేతికి అంది.. ఆర్థికంగా అభివృద్ధి చెందుతామని దరఖాస్తుదారులు భావించారు. కానీ, రెండేళ్లుగా రుణాలు మంజూరు చేయకపోవడంతో వారంతా నిరాశ చెందుతున్నారు.

నిరుద్యోగులకు.. నిరాశే!

 ‘స్వయం ఉపాధి’కి అందని రుణం 

రెండేళ్లుగా మంజూరు కాని కార్పొరేషన్ల రుణాలు

(ఇచ్ఛాపురం రూరల్‌/శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి)

పేద, బడుగు, బలహీనవర్గాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఏటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు తదితర కార్పొరేషన్లు సబ్సిడీ రుణాలు మంజూరు చేసేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీటిని మంజూరు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కార్పొరేషన్ల వారీగా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. లక్ష్యాల మేరకు యూనిట్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. దీంతో రుణం చేతికి అంది.. ఆర్థికంగా అభివృద్ధి చెందుతామని దరఖాస్తుదారులు భావించారు. కానీ, రెండేళ్లుగా రుణాలు మంజూరు చేయకపోవడంతో వారంతా నిరాశ చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి  కార్పొరేషన్ల ద్వారా మంజూరయ్యే వ్యక్తిగత రాయితీ రుణాల కోసం జిల్లా వ్యాప్తంగా అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో యూనిట్‌కు సామాజిక వర్గాల వారీగా స్థాపించే విభాగాలను బట్టి 40 నుంచి 90 శాతం రాయితీ ఉండేది. మిగతా వాటాను లబ్ధిదారుడు భరించేవాడు. యూనిట్ల మంజూరుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. బీసీ కార్పొరేషన్‌ ద్వారా 6050 యూనిట్లకు, కాపు - 831 యూనిట్లకు, ఎంబీసీ(మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌) - 475 యూనిట్లకు, ఈబీసీ -77 యూనిట్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎస్టీ, ఎస్సీలకు సంబంధించి సైట్‌ బ్లాక్‌ చేయడంతో వివరాలు అందుబాటులోలేవు. అయితే ఇంతలో సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో సబ్సీడీ నగదు విడుదలకు అడ్డంకిగా మారింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2018- 19 ఆర్థిక సంవత్సరంలో ఎంపికై సబ్సిడీ విడుదల కాని యూనిట్లను రద్దు చేసింది. మళ్లీ కొత్తగా దరఖాస్తులు స్వీకరించింది. గతంలో రద్దయిన వారికి కూడా 2019-20 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసే రుణాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఆ ఏడాది నవంబరు 10తో దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. అదే నెల చివరిలో ఇంటర్వ్యూలు పూర్తి చేశారు.  దరఖాస్తులు అధిక సంఖ్యలో రావడంతో అక్కడే ఆపేశారు. అప్పటి నుంచి ఉపాధి యూనిట్లపై ప్రతిష్టంభన నెలకొంది. నిరుద్యోగులు రుణాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. 


సంక్షేమానికి మళ్లింపుతో బ్రేక్‌ :

ప్రభుత్వం నవరత్నాల అమల్లో భాగంగా విద్యార్థుల తల్లులకు అమ్మఒడి, వాహన మిత్ర కింద ఆటో డ్రైవర్లకు, జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు బ్యాంకు వ్యక్తిగత ఖాతాలకు రూ.10 వేల చొప్పున నగదు జమ చేసింది. కాపు నేస్తం, వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకం వంటి వి ఎన్నో అమలవుతున్నాయి. గత రెండేళ్లుగా ఎస్సీ. ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు నిధులు మళ్లించడం  తో స్వయం ఉపాధి యూనిట్ల రాయితీ రుణాల మంజూరుకు బ్రేక్‌ పడిందని తెలుస్తోంది. ప్రసుత్త ఆర్థిక సంవత్సరంలోనైనా యూనిట్లు మంజూరు చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంపై చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే : 

గతంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సబ్సిడీ రుణాలు కోసం దరఖాస్తులు ఆహ్వానించి ఇంటర్వ్యూలు నిర్వహించాం. తరువాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోడంతో ఎవరికీ రుణాలు మంజూరు చేయలేదు. 

- జి.రాజారావు, ఈడీ, జిల్లా బీసీ కార్పొరేషన్‌

Updated Date - 2021-08-12T05:01:49+05:30 IST