రైతుకిలా అన్యాయం

ABN , First Publish Date - 2020-04-09T11:04:45+05:30 IST

కరోనా వ్యాపించకుండా చేపట్టిన చర్యల్లో భాగంగా కర్నూలు యార్డులో నిర్వహిస్తున్న కూరగాయల హోల్‌సేల్‌

రైతుకిలా అన్యాయం

పెద్దపాడు వద్ద మార్కెట్‌ కిలో టమోటాకు రూ.2

కిలో వంకాయలకు రూ.4

వ్యాపారుల ఇష్టారాజ్యం

చోద్యం చూస్తున్న అధికారులు


కర్నూలు(అగ్రికల్చర్‌), ఏప్రిల్‌ 8: కరోనా వ్యాపించకుండా చేపట్టిన చర్యల్లో భాగంగా కర్నూలు యార్డులో నిర్వహిస్తున్న కూరగాయల హోల్‌సేల్‌ మార్కెట్‌ను నగర సమీపంలోని పెద్దపాడు వద్దకు తాత్కాలికంగా తరలించారు. మార్కెటింగ్‌ శాఖ అధికారులు, పోలీసులు హోల్‌సేల్‌ మార్కెట్‌ను పర్యవేక్షిస్తున్నారు. అయినా వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారని రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు. 


కోడుమూరు మండలం ప్యాలకుర్తికి చెందిన అయ్యన్న, రంగస్వామి, గోపాల్‌ తదితర రైతులు టమోటాలను ఆదివారం ఓ వాహనంలో పెద్దపాడు హోల్‌సేల్‌ మార్కెట్‌కు తెచ్చారు. ఇక్కడి వ్యాపారులు కిలో రూ.2 ప్రకారం కొనుగోలు చేస్తామని, అంతకు మించి ఒక్క పైసా కూడా ఇవ్వలేమని తేల్చి చెప్పారు. వినియోగదారులకు వ్యాపారులు కిలో రూ.10 నుంచి రూ.20 దాకా అమ్ముకుంటున్నారు. రైతులకు మాత్రం ఇలా తక్కువ ధర ఇస్తున్నారు. ఇంత దారుణంగా వ్యవహరించడం సరికాదని, ధర పెంచాలని రైతులు ప్రాధేయపడినా వ్యాపారులు కరుణించలేదు. మరోదారి లేక రైతులు తెచ్చిన టమోటాలను స్వగ్రామానికి తీసుకెళ్లారు. 


కర్నూలుకు సమీపంలో ఉన్న మానోపాడు(తెలంగాణ)కు చెందిన మద్దమ్మ అనే రైతు వంకాయలను పెద్దపాడు హోల్‌సేల్‌ మార్కెట్‌కు తెచ్చారు. కనీసం కిలో రూ.10 వస్తుందని ఆమె ఆశించారు. కానీ వ్యాపారులు కిలో రూ.4 బేరం పెట్టారు. దీంతో ఆమె కన్నీరు పెట్టారు. తెచ్చిన సరుకును ప్రజలకు అమ్ముకుందామని చూసినా వ్యాపారులు అడ్డుకున్నారు. దీంతో  దిక్కుతోచని మద్దమ్మ వ్యాపారులు చెప్పిన ధరకు వంకాయలను ఇచ్చేసి వెళ్లిపోయారు. 


మార్కెటింగ్‌ అధికారుల నిర్లక్ష్యం

పెద్దపాడు హోల్‌సేల్‌ మార్కెట్‌లో వ్యాపారులు చెప్పిందే ధర అన్నట్లు పరిస్థితి తయారైంది. రైతులకు మద్దతు ధర దక్కుతుందో లేదో కూడా మార్కెటింగ్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. రద్దీ నియంత్రణ తప్ప మరో విషయం తమకు సంబంధం లేదని మార్కెటింగ్‌ శాఖ సూపర్‌వైజర్లు మోహన్‌రెడ్డి, శ్రీనివాసమూర్తి సమాధానం ఇచ్చారు.


రైతులకు ప్రత్యేకంగా దుకాణాలను కూడా ఏర్పాటు చేయలేదు. స్థలాలను కూడా కేటాయించలేదు. దీంతో వారు హోల్‌సేల్‌ మార్కెట్‌కు దూరంగా వాహనాలను నిలిపేసి.. కొనుగోలుదారుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించింది. ధరల పట్టిక కూడా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయలేదు. రైతులకు తక్కువ ధర, వినియోగదారులకు ఎక్కువ ధర ఇస్తుండటంపై కొందరు ప్రశ్నించారు. దీంతో హోల్‌సేల్‌ మార్కెట్‌లో ధరల పట్టిక ఎలా ఏర్పాటు చేస్తామని మార్కెటింగ్‌ శాఖ అధికారులు కసురుకుంటున్నారు. 


అధికారులు చోద్యం చూస్తున్నారు 

హోల్‌సేల్‌ మార్కెట్‌లో వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. మార్కెటింగ్‌ శాఖ అధికారులు అటూ ఇటూ తిరగడం తప్ప మాకు న్యాయం చేయడం లేదు. ప్యాలకుర్తి నుంచి మేము వాహనంలో టమోటాలను తీసుకువస్తే ఒక బాక్సుకు (25 కిలోలు) కేవలం రూ.50 ఇస్తామని వ్యాపారులు అంటున్నారు. వారి లెక్క ప్రకారం కిలో టమోటా కేవలం రూ.2కే ఇవ్వాలి. రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కావు. అందుకే టమోటాలను ఇంటికి తీసుకుపోతున్నాం. 

- అయ్యన్న, రైతు, ప్యాలకుర్తి


డ్యామేజీ ఎక్కువగా ఉంది

రైతులు తెస్తున్న కూరగాయల్లో డ్యామేజీ ఎక్కువగా ఉంది. వీటిని కొనుగోలుదారులకు ఏ విధంగా విక్రయించాలో అధికారులే చెప్పాలి. చెడిపోయిన కూరగాయలను పక్కన పడేయాల్సి  వస్తుంది. అందుకే రైతులకు తక్కువ ధర ఇస్తామని అన్నాం. మేమేమీ చేయలేము. పెద్దపాడు వద్ద హోల్‌సేల్‌ మార్కెట్‌ ఏర్పాటు చేయడం వల్ల మాకు ఖర్చులు పెరిగాయి. అందుకే ధర కాస్త పెంచి అమ్ముతున్నాము. 

 - అక్బర్‌, వ్యాపారి


Updated Date - 2020-04-09T11:04:45+05:30 IST