అర్హులకు అన్యాయం

ABN , First Publish Date - 2020-06-04T10:20:51+05:30 IST

పంట నష్ట పరిహారం పంపిణీలో అర్హులకు అన్యాయం జరిగిందని రైతులు బుధవారం ఆందోళనకు దిగారు.

అర్హులకు అన్యాయం

పంట నష్ట పరిహారంలో వలంటీరు చేతివాటం

భీమునిపాడు రైతుల ధర్నా

దిద్దుబాటు చర్యలు చేపట్టిన వ్యవసాయాధికారులు 


కోవెలకుంట్ల, జూన్‌ 3: పంట నష్ట పరిహారం పంపిణీలో అర్హులకు అన్యాయం జరిగిందని రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. అనర్హుల పేర్లు రాసి అర్హులకు అందాల్సిన నష్ట పరిహారాన్ని ఓ వలంటీరు స్వాహా చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బుధవారం వ్యవసాయ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. టీడీపీ నాయకులు, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్‌ ఆరికట్ల సుంకిరరెడ్డితో, సురేశ్‌రెడ్డి, ఓబుళరెడ్డి, దస్తగిరి, జోగిహరికృష్ణ, గోరుకంటిరాజా, వెంకటసుబ్బయ్య, నాగయ్య రాముడుతో పాటు 40 మంది రైతులు కోవెలకుంట్ల వ్యవసాయ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. పంట నష్ట పరిహారం మంజూరులో జరిగిన అవకతవకలపై వ్యవసాయాధికారులను నిలదీశారు. గత ఏడాది అక్టోబరు నెలలో  కురిసిన భారీ వర్షానికి పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. కుందూనదికి పెద్ద ఎత్తున వరద రావడంతో కుందూ వెంట సాగు చేసిన పంట పొలాలు వందలాది హెక్టార్లలో నీట మునిగాయని తెలిపారు.


మండలంలో 2200 ఎకరాలకు పైగా సాగు చేసిన వరి, కంది, మిరప, జొన్న తదితర పంటలు వరదనీటిలో మునగడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు.  భీమునిపాడు గ్రామంలో 290 ఎకరాల్లో పంటనష్టం జరుగగా 112 మంది రైతులకు రూ. 13.78లక్షలు పంట నష్ట పరిహారం మంజూరైందని తెలిపారు. అయితే వలంటీరు పంట నష్టపరిహారం జాబితా రూపొందించే సమయంలో నకిలీ రైతుల జాబితాను తయారు చేసి వ్యవసాయాధికారులకు అందించారని అన్నారు. వారితో కుమ్మక్కై నష్టపరిహారం నిధులు స్వాహా చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై రైతులు వ్యవసాయాధికారులను నిలదీయడంతో జరిగినపొరపాటును గుర్తించిన వ్యవసాయాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. స్వాహాచేసిన నష్టపరిహారం నిధులను వలంటీరు నుంచి రికవరీ చేయిస్తామని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-06-04T10:20:51+05:30 IST