ఎంఎస్ఎంఈలకు రూ.20 వేల కోట్ల ప్యాకేజీ: జవదేకర్

ABN , First Publish Date - 2020-06-01T23:22:44+05:30 IST

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ఆదుకునేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఎస్ఎంఈ రంగానికి 20 వేల కోట్ల ..

ఎంఎస్ఎంఈలకు రూ.20 వేల కోట్ల ప్యాకేజీ: జవదేకర్

న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ఆదుకునేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఎస్ఎంఈ రంగానికి 20 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సోమవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశానంతరం ఆ వివరాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియా ముందు వెల్లడించారు.


ఆత్మ నిర్భర భారత్‌ పథకానికి రోడ్ మ్యాప్ రూపొందించినట్టు ఈ సందర్భంగా మంత్రి జవదేకర్ తెలిపారు. కరోనాతో ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలని కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. ఈ రంగానికి రూ.20 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తున్నామని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఎంఎస్ఎంఈలకు కొత్త అర్ధాన్ని ఇచ్చామని, ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు మార్కెట్లో లిస్టింగ్ చేసే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు రూ.50వేలకోట్లు ఈక్విటీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.


'పీఎం సంవిధాన్ స్కీమ్' ద్వారా వీధి వ్యాపారులను ఆదుకునేందుకు తక్షణం రూ.10 వేల రుణం ఇవ్వాలని కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్టు జవదేకర్ చెప్పారు. ఇందువల్ల 50 లక్షల మంది వెండర్లకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డుల పథకం తెస్తున్నామని, 14 పంటలకు ఇప్పటికే మద్దతు ధర ప్రకటించామని మంత్రి తెలిపారు. మీడియా సమావేశంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, నరేంద్ర తోమర్ పాల్గొన్నారు.

Updated Date - 2020-06-01T23:22:44+05:30 IST