ఆ ఇద్దరివి పగటి కలలే!

ABN , First Publish Date - 2021-03-01T13:57:56+05:30 IST

రాహుల్‌ గాంధీని ప్రధాని పదవిలో కూర్చోబెట్టాలని ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉదయనిధి ముఖ్యమంత్రి కావాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ పగటి కలలు కంటున్నారని, వారి కలలు పగటి కలలేనని కేంద్ర హోంశాఖ

ఆ ఇద్దరివి పగటి కలలే!

విల్లుపురం ప్రచార సభలో సోనియా, స్టాలిన్‌లపై అమిత్‌షా ధ్వజం


చెన్నై(ఆంధ్రజ్యోతి): రాహుల్‌ గాంధీని ప్రధాని పదవిలో కూర్చోబెట్టాలని ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉదయనిధి ముఖ్యమంత్రి కావాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ పగటి కలలు కంటున్నారని, వారి కలలు పగటి కలలేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ధ్వజమెత్తారు. విల్లుపురం సమీపంలోని జానకిపురం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన బీజేపీ ఎన్నికల శంఖారావ సభలో ఆయన ప్రసంగిస్తూ తమిళ సంస్కృతిని, తమిళ సంప్రదాయాలను దేశ ప్రజలంతా గౌరవిస్తున్నారని, తమిళ సంస్కృతి లేకుండా దేశ సంస్కృతి లేదని అన్నారు. తాను తమిళంలో ప్రసంగించలేకపోతున్నందుకు బాధపడుతున్నానని చెప్పారు. తిరువళ్లువర్‌ గురించి తెలుసుకోవడానికి, తమిళంలో మాట్లాడేందుకు ఆసక్తిగా వున్నానంటూ ప్రధాని మోదీ తనతో చెప్పారని పేర్కొన్నారు. తమిళ భూమిలో జన్మించిన మహాకవులు, మహానుభావులు తమిళ భాష ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు ఎలుగెత్తి చాటారని అన్నారు. రాష్ట్రంలో డీఎంకే- కాంగ్రెస్‌ కూటమికి ప్రజల సంక్షేమంపై ఏ మాత్రం ఆసక్తి లేదని, అన్నాడీఎంకే- బీజేపీ కూటమి ప్రజల సంక్షేమం కోసం పాటుపడే కూటమి అని ఆయన పేర్కొన్నారు. దేశానికే తలవంపులు తెచ్చే విధంగా 2జీ అవినీతికి పాల్పడింది ఎవరో ప్రజలందరికీ తెలుసునని, దేశంలోనే సుపరిపాలనకు అవార్డులు అందుకున్న ప్రభుత్వం అన్నాడీఎంకే ప్రభుత్వమేనని చెప్పారు. ఎంజీఆర్‌, జయలలిత పెంచి పోషించిన అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకోవడాన్ని బీజేపీ తనకు  దక్కిన అపూర్వ గౌరవంగా భావిస్తోందని అన్నారు. 


పుదుచ్చేరిలో బీజేపీ కూటమిని గెలిపించండి

అసెంబ్లీ ఎన్నికల్లో పుదుచ్చేరిలో బీజేపీ కూటమిని గెలిపించాలని అమిత్‌షా పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం పుదుచ్చేరిలోని కారైక్కాల్‌లో ఏర్పాటైన బీజేపీ ప్రచార బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగిస్తూ కారైక్కాల్‌ అమ్మయార్‌ జన్మించిన పుణ్యభూమిలో ఆమెను స్మరిస్తూ, తిరునళ్లార్‌ శనీశ్వరుడికి మనఃపూర్వకంగా మొక్కుతూ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నానని పేర్కొన్నారు. పుదుచ్చేరి తమిళ మహాకవి భారతియార్‌ నడయాడిన భూమి అని, అరవిందుడు జీవించిన పవ్రిత భూమి అని కొనియాడారు. గత కొంతకాలంగా పుదుచ్చేరిలో జరుగుతున్న సంఘటనలన్నింటినీ తాను పరిశీలిస్తూ వచ్చానని, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం చెందిన ఆ రాష్ట్ర ప్రజలంతా బీజేపీ కూటమికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుసుకున్నానని చెప్పారు. గత ఐదేళ్లలో పుదుచ్చేరి ఏ రంగంలోనూ అభివృద్ధి చెందలేని అన్నారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తనకు తానుగానే కుప్పకూలి పతనమైందని, ఆ కూటమిలోని శాసనసభ్యులంతా వరుసగా రాజీనామాలు చేయడం వల్లే మెజారిటీ లేక నారాయణస్వామి ప్రభుత్వం రాజీనామా చేసిందని అన్నారు. పుదుచ్చేరిలోనే కాదు దేశమంతటా కాంగ్రెస్‌ పార్టీ త్వరలో కనుమరుగైపోతుందని అన్నారు.

పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. పుదుచ్చేరిలో నిరుద్యోగులుగా ఉన్న 75 శాతం మంది యువకులు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే)కి మద్దతునిచ్చి గెలిపిస్తే ఉద్యోగవకాశాలు కల్పిస్తామని తెలిపారు. బీజేపీ కూటమికి ఓటేస్తే పుదుచ్చేరిని అన్ని రంగాల్లో అభివృద్ధిపరుస్తానని ప్రజలకు భరోసా ఇస్తున్నానని చెప్పారు. ఈ సభలో కేంద్ర మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌, బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి నిర్మల్‌కుమార్‌ సురానా, డిప్యూటీ ఇన్‌ఛార్జి రాజీవ్‌ చంద్రశేఖర్‌, బీజేపీ రాష్ట్ర  శాఖ అధ్యక్షుడు వీ స్వామినాథన్‌, మాజీ మంత్రి ఎ. నమశ్శివాయం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T13:57:56+05:30 IST