నెల్లూరులో ట్రేడ్‌ లైసెన్సుల్లో మతలబు

ABN , First Publish Date - 2021-04-15T05:30:00+05:30 IST

నెల్లూరు కార్పొరేషన్‌ లెక్కల ప్రకారం నగరంలో 40 వేల పైచిలుకు దుకాణాలు, వ్యాపార భవనాలు ఉన్నాయి. అయితే వాటిలో 8 వేల కట్టడాలకు మాత్రమే ఆరోగ్య విభాగం నుంచి ట్రేడ్‌ లైసెన్సు మంజూరైనట్లు సమాచారం. ఆ ఎనిమిది వేలల్లో కూడా 3 వేల భవనాలకే లైసెన్సు రెన్యూవల్‌ అయినట్లు తెలిసింది. ఎందుకింత వ్యత్యాసం అంటే ఎవరూ చెప్పలేకపోతున్నారు.

నెల్లూరులో ట్రేడ్‌ లైసెన్సుల్లో మతలబు


వాణిజ్య భవనాలు 40వేలు

లైసెన్సులు 8వేలు.. రెన్యువల్‌ 3వేలే!

ఎందుకింత వ్యత్యాసం?

మిగతాదంతా ఎమవుతోంది?

ఆరోగ్య విభాగానికి అవినీతి జబ్బు

కార్పొరేషన్‌ ఖజానాకు గండి


స్థానిక సంస్థలకు ఆదాయాన్ని సమకూర్చే వనరుల్లో పన్నుల తర్వాతి స్థానం ట్రేడ్‌ లైసెన్సులది. నగరాల్లో వీటి రూపంలో భారీగానే పాలక సంస్థలకు ఆదాయం చేకూరుతుంటుంది. అయితే శరవేగంగా విస్తరిస్తున్న నెల్లూరు నగరంలో మాత్రం ట్రేడ్‌ లైసెన్సుల తంతు ఎంతటి వారికైనా ఆశ్చర్యం కలిగించక మానదు. పెద్ద సంఖ్యలో మాల్స్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, దుకాణాలు ఉన్నప్పటికీ కార్పొరేషన్‌ ఖజానాకు మాత్రం అంతంత మాత్రంగానే నిధులు చేరుతున్నాయి. మొత్తం షాపుల సంఖ్యకు, లైసెన్సు పొందిన వాటికి, రెన్యువల్‌ చేసుకున్న వాటికి గణాంకాల్లో అసలు పొంతనే ఉండటం లేదు. ఏమిటీ మతలబు?, అసలు ఆదాయం మొత్తం ఎటుపోతోంది?... అంతా సస్పెన్స్‌.! 


నెల్లూరు (సిటీ), ఏప్రిల్‌ 15 :

నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో వాణిజ్య భవనాలు, సముదాయాలు, దుకాణాలు కలిగిన వారు కార్పొరేషన్‌ నుంచి ట్రేడ్‌ లైసెన్సుతోపాటు పారిశుధ్య ధ్రువీకరణ, నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తప్పనిసరిగా తీసుకోవాలి. కార్పొరేషన్‌ లెక్కల ప్రకారం నగరంలో 40 వేల పైచిలుకు దుకాణాలు, వ్యాపార భవనాలు ఉన్నాయి. అయితే వాటిలో 8 వేల కట్టడాలకు మాత్రమే ఆరోగ్య విభాగం నుంచి ట్రేడ్‌ లైసెన్సు మంజూరైనట్లు సమాచారం. ఆ ఎనిమిది వేలల్లో కూడా 3 వేల భవనాలకే లైసెన్సు రెన్యూవల్‌ అయినట్లు తెలిసింది. ఎందుకింత వ్యత్యాసం అంటే ఎవరూ చెప్పలేకపోతున్నారు. మిగతావి ఎందుకు లైసెన్సు తీసుకోలేదు, అధికారులు ఎందుకు పట్టించుకోలేదు, వాటికి సంబంధించిన నగదు ఎవరు తీసుకుంటున్నార న్నవి జవాబులేని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మేస్త్రీలు, సూపర్‌వైజర్ల అవినీతి వల్లే కార్పొరేషన్‌ ఆదాయానికి గండి పడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  


పెండింగ్‌లో భారీ పద్దులు 

నగరంలో వాణిజ్య సముదాయాలకు సంబంధించిన ట్రేడ్‌ లైసెన్సు పద్దులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాలో సినిమా హాళ్లు, పెద్దపెద్ద ప్రైవేటు ఆసుపత్రులు, హోటళ్లు, లాడ్జీలు, షోరూంలు, విద్యా సంస్థలు ఉన్నాయి. వాటి నుంచి రావాల్సిన ట్రేడ్‌ లైసెన్సు తాలూకు ఫీజును వసూలు చేయడంలో కార్పొరేషన్‌ ఆరోగ్య విభాగం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. ఈ లైసెన్సుల వసూలు విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నెల వారీ మామూళ్లు తీసుకుని కార్పొరేషన్‌ ఆదాయానికి గండికొడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.


ఒకరు ఇమ్మంటే.. మరొకరు వద్దంటూ

డివిజన్లలో పాలన సచివాలయాల ద్వారా జరుగుతుండగా అక్కడి ఉద్యోగులతో కార్పొరేషన్‌ ఆరోగ్య విభాగం అధికారుల సమన్వయం సరిగా లేదన్న ఆరోపణలు న్నాయి. ట్రేడ్‌ లైసెన్సు ఫీజులు చెల్లించాలని సచివాలయాల శానిటరీ సెక్రటరీలు వ్యాపారులపై ఒత్తిడి చేస్తుండగా వారికి శానిటరీ ఇన్‌స్పెక్టర్లు అడ్డుతగులుతున్నట్లు సమాచారం. ట్రేడ్‌ లైసెన్సుల్లో జోక్యం చేసుకోవద్దని కొందరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సెక్రటరీలను హెచ్చరిస్తున్నట్లు తెలిసింది.  బకాయిల వసూళ్లు, కొత్తవి కట్టించడం, పాతవి రెన్యువల్‌ చేయించడంలో మీ ప్రమేయం అవసరం లేదని వారు తెగేసి చెప్తునట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ల వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


రోడ్డు మార్జిన్‌ వ్యాపారుల సొమ్ము ఏమవుతోంది..? 

నెల్లూరులోని ప్రధాన రహదారులు, కూడళ్లలో పెద్ద సంఖ్యలో రోడ్డు మార్జిన్‌ వ్యాపారులున్నారు. తోపుడు బండ్లు, మొబైల్‌ ఫుడ్‌ వాహనాలతోపాటు, రోడ్డు పక్కన విక్రయాలు జరిపే వారి నుంచి ట్రేడ్‌ లైసెన్సు, శానిటేషన్‌ ఫీజు పేరుతో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు భారీగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. రోజు, వారం, నెల వారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిసింది. మరి ఆ సొమ్మంతా ఎక్కడికి వెళ్తోంది?, ఎవరెవరికి ఎంతెంతిస్తున్నారు...? అనేది శేష ప్రశ్న. ఆస్తి పన్నుల వసూలులో రాష్ట్రంలోనే నెల్లూరును ప్రథమ స్థానంలో నిలిపిన కమిషనర్‌ దినేష్‌కుమార్‌ ట్రేడ్‌ లైసెన్సుల విషయంలో మాత్రం ఎందుకింత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతి జబ్బునపడ్డ ఆరోగ్య విభాగాన్ని ఎందుకు ప్రక్షాళన చేయలేకపోతున్నారన్న ప్రశ్న ఉదయిస్తోంది. ట్రేడ్‌ లైసెన్సుల వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరిపితే భారీ కుంభ కోణం వెలుగుచూసే అవకాశం ఉందని కొందరు వ్యాపారులు అంటున్నారు.

Updated Date - 2021-04-15T05:30:00+05:30 IST