రెవెన్యూలో అలజడి

ABN , First Publish Date - 2021-08-01T05:51:57+05:30 IST

జిల్లాలోని రెవెన్యూ యంత్రాంగంలో అలజడి నెలకొంది. గత వారం రోజుల్లోనే ముగ్గురు తహసీల్దార్లు, ఇద్దరు ఆర్‌ఐలు, వీఆర్వోను కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ సస్పెండ్‌ చేశారు.

రెవెన్యూలో అలజడి

వారంలో ముగ్గురు తహసీల్దార్ల సస్పెన్షన్‌

ఇద్దరు ఆర్‌ఐలు, వీఆర్వోలపైనా వేటు

ఇష్టారీతిన ప్రభుత్వ భూములు ధారాదత్తమే కారణం

అధికారపార్టీ నేతల కన్నుసన్నల్లోనే పనిచేస్తున్న యంత్రాంగం

వరుస చర్యలతో ఆందోళనలో ఆశాఖ అధికారులు

ఒంగోలు (కలెక్టరేట్‌), జూలై 31 : జిల్లాలోని రెవెన్యూ యంత్రాంగంలో అలజడి నెలకొంది. గత వారం రోజుల్లోనే ముగ్గురు తహసీల్దార్లు, ఇద్దరు ఆర్‌ఐలు, వీఆర్వోను కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ సస్పెండ్‌ చేశారు. వారి అవినీతి వ్యవహారాలపై కొరడా ఝుళిపించడంతో ఆశాఖ అధికారుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలోని పలు మండలాల్లో గత కొంతకాలం నుంచి ప్రభుత్వ భూములను ఇష్టారీతిన ఆన్‌లైన్‌ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధగా సర్కారు భూముల్లో క్వారీయింగ్‌కు అనుమతిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో జరిగిన అక్రమాలపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. వీటిపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు.  అనేక అక్రమాలు బయటపడటంతో బాధ్యులైన సంబంధిత రెవెన్యూ అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. ఈనెల మార్కాపురం మండలం రాయవరంలో ఒకరి భూములను మరొకరి పేరుతో ఆన్‌లైన్‌ చేయడంతో పెద్దఎత్తున  ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పటి తహసీల్దార్‌ ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఆ అక్రమాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. నాలుగు రోజుల క్రితం భూ అక్రమాలకు పాల్పడ్డ చినగంజాం తహసీల్దార్‌ విజయకుమారి, పొదిలి తహసీల్దార్‌ హనుమంతరావులను సస్పెండ్‌ చేశారు. చినగంజాం తహసీల్దార్‌ సిలికా శాండ్‌ క్వారీ లీజులను నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించిన కలెక్టర్‌ నివేదిక అందిన అనంతరం ఆమెను సస్పెండ్‌ చేశారు. అదేరోజు పొదిలి తహసీల్దార్‌ హనుమంతరావు, ఏఆర్‌ఐ శివరామప్రసన్న, కంభాలపాడు వీఆర్వో కమలకుమార్‌లపైనా సస్పెన్షన్‌ వేటు వేశారు. కంభాలపాడులో ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. తాజాగా శనివారం హనుమంతునిపాడు తహసీల్దార్‌ సుధాకర్‌రావుతోపాటు, ఆర్‌ఐని సస్పెండ్‌ చేశారు. జిల్లాలోని అనేక మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా ప్రాంతాల్లో అధికారపార్టీ నేతల ఒత్తిడితో రెవెన్యూ యంత్రాంగం నిబంధనలను అతిక్రమించి ఇష్టారీతిన ప్రభుత్వ భూములను ఇతరుల పేర్లతో ఆన్‌లైన్‌ చేయడంతోపాటు పేదల భూములను కూడా ఇష్టారీతిన మార్చారు. దీంతో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో అయితే ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వారం వ్యవధిలోనే ముగ్గురు తహసీల్దార్లు, పలువురు రెవెన్యూ యంత్రాంగంపై వేటు పడటంతో ఆ శాఖ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. 


Updated Date - 2021-08-01T05:51:57+05:30 IST