సెలవుల్లో విషాదాంతం

ABN , First Publish Date - 2022-01-28T05:06:52+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గురువారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. కరోనాతో విద్యాసంస్థలకు సెలవులు రావడంతో ఇంటి వద్ద ఉంటున్న ఇద్దరు వేర్వేరు ఘటనల్లో మృత్యువాత పడ్డారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు.

సెలవుల్లో విషాదాంతం
ఏడుకొండలు(ఫైల్‌ ఫొటో)

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు విద్యార్థుల మృతి

విద్యుదాఘాతంతో ఒకరు..

చెరువులో మునిగి మరొకరు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విషాదాలు

మఠంపల్లి/సంస్థాన్‌ నారాయణపురం, జనవరి 27: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గురువారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. కరోనాతో విద్యాసంస్థలకు సెలవులు రావడంతో ఇంటి వద్ద ఉంటున్న ఇద్దరు వేర్వేరు ఘటనల్లో మృత్యువాత పడ్డారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. సూర్యాపేట జిల్లాలో పొలం వద్ద విద్యుదాఘాతంతో ఒకరు;  యాదాద్రిభువనగిరి జిల్లాలో చెరువులో మునిగి మరో విద్యార్థి మృతి చెందారు. 

తల్లిదండ్రులకు సాయం చేస్తూనే..

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన బానోతు బాలు, చావళిలకు ఇద్దరు కుమారులున్నారు. ఉన్న కొద్దిపాటి భూమిని సాగు చేస్తూ కుమారులిద్దరినీ ఉన్నత చదువులు చదవిస్తున్నారు. కరోనాతో విద్యాసంస్థలకు సెలవులు రావడంతో వారు ఇంటి వద్దే ఉంటూ తండ్రికి పొలం పనుల్లో చేదోడువాదోడుగా ఉంటున్నారు. వరంగల్‌లోని డిఫెన్స్‌ అకాడమీ సైనిక్‌ కళాశాలలో బీకాం చదువుతున్న చిన్నకుమారుడు ఏడుకొండలు(19) పొలం వద్ద మోటార్‌ వేసేందుకు వెళ్లి; విద్యుదాఘాతానికి గురయ్యాడు. చుట్టుపక్కల రైతులు చూసి కాపాడేలోగానే ఏడుకొండలు మృతి చెందాడు. ఈ ఘటన తల్లిదండ్రులను షాక్‌కు గురిచేసింది. చదువుతో పాటు క్రీడల్లోనూ ఏడుకొండలు ప్రతిభ కనబరిచేవాడు. వాలీబాల్‌ పోటీల్లో రాష్ట్ర, జిల్లాస్థాయిలో పాల్గొన్నాడు. ఏడుకొండలు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

మొక్కులు తీరకుండానే...  

మంచి మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణుడిని కావాలన్న ఆ విద్యార్థి ఆశ అడియాస అయింది. అమ్మవారికి మొక్కుకుని ఇంటికి చేరకుండానే చెరువులో మునిగి మృతి చెందాడు. యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలో ఈ ఘటన జరిగింది. చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన బోగి సంగయ్య కుమారుడు ఉపేందర్‌(16) కొయ్యలగూడెం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గురువారం ఉపేందర్‌ పాఠశాల మిత్రులతో కలిసి రాచకొండగుట్టల్లోని సరళమైసమ్మ దేవాలయానికి వెళ్లాడు. పదో తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించాలని అమ్మవారికి పూజలు చేశారు. సాయంత్రం ఇంటి వచ్చే క్రమంలో నారాయణపురం మండలంలోని తుంబాయితండా శివారులోని నార్లకుంట చెరువు వద్ద ఆగారు. చెరువు దగ్గర మిత్రులంతా కలిసి ఫోటోలు దిగారు. ఈ క్రమంలో చెరువులో స్నానం చేసేందుకు వెళ్లారు. ఇద్దరు మిత్రులు చెరువు అంచు వరకు దిగగా ఉపేందర్‌ చెరువులోకి మరికొంత ముందుకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. ప్రమాదంలో చిక్కుకున్న మిత్రుడు ఉపేందర్‌ను కాపాడేందుకు స్నేహితులు బెల్టు అందించేందుకు ప్రయత్నించినా అప్పటికే నీటిలో మునిగిపోయాడు. ప్రమాద విషయాన్ని మిత్రులు గ్రామానికి వచ్చి కుటుంబసభ్యులకు చెప్పడంతో కుటుంబసభ్యులు గ్రామస్థులు చెరువు వద్దకు వెళ్లారు. అప్పటికే ఉపేందర్‌ నీట మునిగి మృతిచెందాడు. విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఎస్‌ఐ యుగేందర్‌గౌడ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని ఉపేందర్‌ మృతదేహాన్ని గ్రామస్థుల సహకారంతో వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

======================================




Updated Date - 2022-01-28T05:06:52+05:30 IST