వ్యాక్సిన్‌.. రియాక్షన్‌

ABN , First Publish Date - 2021-01-26T06:59:56+05:30 IST

జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు.

వ్యాక్సిన్‌.. రియాక్షన్‌

ఏడుగురికి అస్వస్థత 

విజయవాడ జీజీహెచ్‌కి ముగ్గురి తరలింపు 

అత్యవసర చికిత్స అందిస్తున్న వైద్యులు

జిల్లావ్యాప్తంగా 856 మందికి కొవిడ్‌ టీకా 


విజయవాడ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురిని విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డుకు తరలించారు. అక్కడ నిపుణులైన వైద్యులు బాధితులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్న వైద్యురాలు, చిట్టినగర్‌ సచివాలయంలోని ఏఎన్‌ఎం, నందిగామకు చెందిన మరో ఆశా కార్యకర్త సోమవారం కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే అత్యవసర చికిత్స కోసం విజయవాడ జీజీహెచ్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యాధికారులు తెలిపారు. వీరితోపాటు మరో నలుగురిలో వ్యాక్సిన్‌ దుష్ప్రభావాలు కనిపించినప్పటికీ.. కొద్దిసేపటికే మామూలు స్థితికి చేరుకోవడంతో, ఇళ్లకు పంపించేశారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 77 కేంద్రాల్లో 856 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. 70 కేంద్రాల్లో 593 మందికి కోవిషీల్డ్‌ ఇవ్వగా.. మరో ఏడు కేంద్రాల్లో 263 మందికి కోవాగ్జిన్‌ టీకా ఇచ్చారు. ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకున్న హెల్త్‌కేర్‌ వర్కర్లు అందరూ ముందుకు రాకపోవడంతో జిల్లాలో రోజువారీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయలేకపోతున్నారు.

Updated Date - 2021-01-26T06:59:56+05:30 IST