954 మందికి వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-01-17T05:11:44+05:30 IST

మొదటిరోజు కరోనా వ్యాక్సినేషన్‌ విజయవంతమైంది. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. విజయనగరంలోని ఘోషాసుపత్రి వద్ద మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 15 కేంద్రాల ద్వారా వైద్య సిబ్బందికి మొదటి దశలో వాక్సిన్‌ వేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

954 మందికి వ్యాక్సిన్‌
వాక్సిన్‌ వేయడాన్ని పరిశీలిస్తున్న మంత్రి బొత్స

 మొదటి రోజు దాదాపు విజయవంతం

కురుపాం సీహెచ్‌సీలో ఎనిమిది మందికి టీకా

అలమండలో 90శాతం పైబడి నమోదు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)/ రింగు రోడ్డు/ చీపురుపల్లి, జనవరి 16:

మొదటిరోజు కరోనా వ్యాక్సినేషన్‌ విజయవంతమైంది. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు.  విజయనగరంలోని ఘోషాసుపత్రి వద్ద మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 15 కేంద్రాల ద్వారా వైద్య సిబ్బందికి మొదటి దశలో వాక్సిన్‌ వేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మొత్తంగా 1441 మంది వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ఆన్‌లైన్లో పేర్లు నమోదు చేయించుకున్నారు. ఇందులో 954 మందికి మాత్రమే మొదటి రోజు టీకా వేయడమైంది. మిగిలిన వారికి ఒకటి-రెండు రోజుల్లో పూర్తి చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రమణకుమారి వెళ్లడించారు. అత్యధికంగా జామి మండలం అలమండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 90శాతం పైబడి వైద్య సిబ్బంది టీకాలు వేయించుకున్నారు. కురుపాం సీహెచ్‌సీ పరిధిలో అత్యల్పంగా 8 మంది టీకాకు హాజరయ్యారు. కాగా టీకా ఇచ్చే ప్రాంతంలో అక్కడున్న సిబ్బందిలో ప్రధాన కేడర్‌కు చెందిన వారు ముందుకు రాని కారణంగానే కొన్నిచోట్ల వెనుకబడినట్లు సమాచారం. డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు వంటి వారు ముందుండి ఇటువంటి కార్యక్రమాలను నడిపించాలి. వారే వెనక్కు తగ్గటం, వేచి చూసి తరువాత వేయించుకుందామన్న భావనలో ఉన్నారు. దీనివల్లే తొలిరోజు శత శాతం పూర్తి కాలేదని తెలుస్తోంది. 

దశలవారీగా అందరికీ : బొత్స

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసే 26 వేల మంది వైద్య సిబ్బందికి తొలి విడతగా వ్యాక్సిన్‌ వేయనున్నట్టు మంత్రి బొత్స చెప్పారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. దశలవారీగా అన్ని వర్గాలకూ కరోనా టీకా వేస్తారని, ఎవరూ అత్రుతపడవద్దని సూచించారు. 28 రోజుల తరువాత రెండో డోస్‌ కూడా వేస్తామని స్పష్టతిచ్చారు. కరోనా వ్యాక్సిన్‌  మొదటి డోస్‌ను స్టాఫ్‌ నర్సును పి.జానకమ్మకు వైద్య సిబ్బంది ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఎస్‌వీ రమణకుమారి, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్‌ కె.సీతారామరాజు, ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ నారాయణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చీపురుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కరోనా వాక్సిన్‌ కేంద్రాన్ని కూడా శనివారం మంత్రి బొత్స ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రోజుకు వంద మంది వంతున ఐదు రోజుల్లో లక్ష్యంగా పెట్టుకున్న అందరికీ టీకాలు వేస్తారని, తర్వాత దశలో పోలీస్‌, ప్రెస్‌, 60 యేళ్లు వయసు పైబడిన వారికి ఇస్తారన్నారు. అంతకుముందు ఆయన వాక్సినేషన్‌ విభాగాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ ఉన్నారు. 




Updated Date - 2021-01-17T05:11:44+05:30 IST