వ్యాక్సినేషన్‌ 92.99 శాతం పూర్తి

ABN , First Publish Date - 2021-10-22T06:14:56+05:30 IST

మండలంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది.

వ్యాక్సినేషన్‌ 92.99 శాతం పూర్తి
కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న వృద్ధుడు (ఫైల్‌)

- గద్వాల మండలంలో తుది దశకు చేరిన ప్రక్రియ 

- మరో మూడు రోజుల్లో  100 శాతం పూర్తి

గద్వాల రూరల్‌, అక్టోబరు 21 : మండలంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. కలెక్టర్‌ నిర్దేశించిన మేరకు మండల అధికారులు, వైద్య సిబ్బం ది, అంగన్‌వాడీ కార్యకర్తలు శ్రమిస్తూ వంద శాతం వ్యాక్సినేషన్‌కు అడుగు దూరంలో నిలిచారు. మరో మూడు రోజుల్లో వంద శాతం పూర్తిచేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు. మండల పరిషత్‌ అధికారి జెమ్లా నాయక్‌, ఎంపీవో చెన్నయ్య, మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు ప్రతీ రోజు గ్రామాలలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ, వ్యాక్సిన్‌ తీసు కోవడానికి వెనకడుగు వేస్తున్న వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తల సహ కారంతో పాటు ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుం టున్నారు.


24,376 మందికి వ్యాక్సిన్‌

గద్వాల మండలంలో 18 ఏళ్లు నిండిన వారు 29,087 మంది ఉన్నారు. వారిలో 2,875 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. మిగిలిన వారు 26,212 మంది ఉన్నట్లు గుర్తించారు. వారిలో గురువారం నాటికి 24,376 మందికి వ్యాక్సిన్‌ను వేశారు. దాదాపు 92.99 శాతం వ్యాక్సిన్‌ను పూర్తి చేశారు. ఇంకా 1,369 మంది మాత్రమే మిగిలారు. మరో మూడు రోజుల్లో వారికీ టీకా వేయనున్నట్లు అధికారులు తెలిపారు. వలస వెళ్లిన వారు పనిచేసే ప్రదేశంలోనే వ్యాక్సిన్‌ వేయించుకునేలా వారి కుటుంబ సభ్యుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అక్కడ వీలు కాకపోతే గద్వాలకు వచ్చి వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచిస్తున్నారు. వీరు కాక ఇంకా 467 మంది దీర్ఘకాలిక వ్యాధు లతో పాటు ఇతర కారణాల వల్ల వ్యాక్సిన్‌ తీసుకోవడానికి నిరాకరిస్తున్న వారు ఉన్నారు. వైద్యుల సలహా మేరకు వారు కూడా వ్యాక్సిన్‌ తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.


వంద శాతం వ్యాక్సినేషన్‌కు కృషి

కలెక్టర్‌ ఆదేశాల మేరకు వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మండలంలో ఇంకా 1,369 మంది మిగిలి పోయారు. వారికి మూడు రోజుల్లో వ్యాక్సిన్‌ వేయిస్తాం. వలసలు వెళ్లిన వారు కూడా అక్కడే వ్యాక్సిన్‌ వేయించుకునేలా వారి కుటుంబ సభ్యుల ద్వారా కృషి చేస్తున్నాం. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధుల సహకారం చాలా ఉంది. అధికారుల కృషి అభినందనీయం.

- జెమ్లానాయక్‌, ఎంపీడీవో

Updated Date - 2021-10-22T06:14:56+05:30 IST