మంద‌కొడిగా వ్యాక్సినేష‌న్‌.. 10 శాతం జ‌నాభాకు 117 రోజులు!

ABN , First Publish Date - 2021-05-05T15:08:24+05:30 IST

భారతదేశంలో క‌రోనా టీకా మొదటి మోతాదును...

మంద‌కొడిగా వ్యాక్సినేష‌న్‌.. 10 శాతం జ‌నాభాకు 117 రోజులు!

న్యూఢిల్లీ: భారతదేశంలో క‌రోనా టీకా మొదటి మోతాదును దేశంలోని 10 శాతం జ‌నాభాకు ఇచ్చారు. దేశంలో వ్యాక్సినేష‌న్ మంద‌కొడిగా సాగుతోంది. జనాభాలో పది శాతం మందికి మొదటి మోతాదు టీకా అందించడానికి  117 రోజులు పట్టింది. మీడియాకు అందిన స‌మాచారం ప్రకారం గత వారం దేశంలో వ్యాక్సినేష‌న్‌ వేగం గణనీయంగా తగ్గింది. దేశంలోని జనాభాలో 9.3శాతం మందికి కోవిడ్ -19 వ్యాక్సిన్ మొదటి మోతాదు లభించింది. అదే సమయంలో రెండు మోతాదుల టీకా తీసుకున్న‌వారి సంఖ్య రెండు శాతం కూడా లేక‌పోవ‌డం విశేషం. గత వారం దేశంలో రోజుకు సగటున 23,37,141 టీకాలు వేశారు. ఇది అత్యంత వేగవంతంగా టీకాలు అందించిన వార‌పు టీకా రేటు కన్నా 35 శాతం తక్కువ. 


 ప్ర‌స్తుతం దేశంలో తగినంత వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దేశంలో టీకా సరఫరా సంక్షోభం జూలై వరకు కొనసాగుతుందని టీకా తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా  తెలిపింది. ఈ సంద‌ర్భంగా సంస్థ సీఈవో పూనావాలా మాట్లాడుతూ భారత ప్రభుత్వం నుంచి 26 కోట్ల మోతాదుల కోవీషీల్డ్ ఆర్డర్‌ను అందుకున్నామ‌ని తెలిపారు. దానిలో15 కోట్ల మోతాదును ఇచ్చేశామ‌ని, మిగిలిన 11 కోట్ల మోతాదులను కూడా మేలో కేంద్ర ప్రభుత్వానికి పంపుతామ‌న్నారు. అదనంగా, 11 కోట్ల మోతాదులను రాష్ట్రాలు, ప్రైవేట్ ఆసుపత్రుల‌కు అంద‌జేయాల్సివుంద‌న్నారు. మ‌రిన్ని మోతాదుల కోసం భారత ప్రభుత్వం నుండి ఎటువంటి విన‌తి రాలేద‌న్నారు. ఈ కారణంగానే వ్యాక్సిన్ల తయారీ సామర్థ్యాన్నిపెంచలేద‌న్నారు. 

Updated Date - 2021-05-05T15:08:24+05:30 IST