టీకా ముందు ఎవరికి?

ABN , First Publish Date - 2020-10-05T07:55:08+05:30 IST

వచ్చే ఏడాది జూలై నాటికి కరోనా టీకా అందుబాటులోకి వస్తుందన్న అంచనాతో ఉన్న కేంద్ర ప్రభుత్వం.. ఏయే వర్గాల వారికి ముందుగా పంపిణీ చేయాలో ప్రాధాన్య జాబితా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది...

టీకా ముందు ఎవరికి?

  • నెలాఖరులోగా ప్రాధాన్య జాబితా ఇవ్వండి
  • రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన కేంద్ర ప్రభుత్వం
  • జూలై నాటికి 50 కోట్ల డోసులు అందుబాటు
  • 25 కోట్ల మందికి పంపిణీ: డాక్టర్‌ హర్షవర్ధన్‌
  • నార్కోటిక్‌ బ్యూరో డీడీ మల్హోత్రాకు పాజిటివ్‌
  • సుశాంత్‌ కేసులో దీపికను విచారించినది ఈయనే
  • కరోనా బారిన సినీ హీరోయిన్‌ తమన్నా
  • మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ కన్నుమూత

న్యూఢిల్లీ, అక్టోబరు 4: వచ్చే ఏడాది జూలై నాటికి కరోనా టీకా అందుబాటులోకి వస్తుందన్న అంచనాతో ఉన్న కేంద్ర ప్రభుత్వం.. ఏయే వర్గాల వారికి ముందుగా పంపిణీ చేయాలో ప్రాధాన్య జాబితా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. నెలాఖరులోగా సంబంధిత జాబితాను సమర్పించాలని నిర్దేశించింది. కరోనాపై పోరులో ముందువరుసలో ఉన్న ఆరోగ్య సిబ్బందిని ముందుగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ట్విటర్‌ వేదికగా నిర్వహించే ‘సండే సంవాద్‌’లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఈ మేరకు వివరాలు పేర్కొన్నారు.


ఫాలోవర్లతో సంభాషించిన ఆయన.. టీకా పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు రూపొందిస్తోందని తెలిపారు. బ్లాక్‌ స్థాయి వరకు పంపిణీకి అవసరమైన మౌలిక సదుపాయాలపై రాష్ట్రాలకు మార్గదర్శనం చేస్తున్నామని వివరించారు. జూలై నాటికి 40 కోట్ల నుంచి 50 కోట్ల డోస్‌ల టీకాను దేశంలోని 20-25 కోట్ల జనాభాకు సరఫరా చేయగలమని భావిస్తున్నామని పేర్కొన్నారు. టీకాకు సంబంధించి అన్ని అంశాల పరిశీలనకు నీతీ ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ అధ్యక్షతన ఉన్నత స్థాయి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తుచేసిన హర్షవర్ధన్‌.. పంపిణీలో కొవిడ్‌-19 విధుల్లో ఉన్న ఆరోగ్య సిబ్బందికి ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ‘టీకా అందుబాటులోకి వచ్చాక సక్రమంగా అందరికీ చేరడం ఎలా అన్నదానిపై కేంద్రం నిరంతరం ఆలోచన చేస్తోంది. టీకా సేకరణలో కేంద్రం పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తూ.. నిశిత పరిశీలన చేస్తోంది. దేశంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ టీకా మా ప్రధాన లక్ష్యం. 


ముందుగా నిర్దేశించిన ప్రాఽధాన్యతల వారీగా, ప్రణాళికాయుతంగా పంపిణీ జరుగుతుంది. నల్ల బజారుకు మళ్లే అవకాశం ఇవ్వబోం’ అని హర్షవర్ధన్‌ వివరించారు. కాగా, భారత్‌లో రష్యా టీకా ‘స్పుత్నిక్‌-వి’ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రతిపాదనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఓ ఫాలోవర్‌కు సమాధానమిచ్చారు.  దేశంలో ఆదివారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 75,829 మందికి వైరస్‌ సోకిందని, 940 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.


మరణాలు వెయ్యిలోపు నమోదవడం నెల తర్వాత ఇదే తొలిసారి. ఇందులో మహారాష్ట్ర (278), కర్ణాటక (100), తమిళనాడు (65), పశ్చిమ బెంగాల్‌ (62), పంజాబ్‌ (61), ఉత్తరప్రదేశ్‌ (60)లోనే 60 శాతం మరణాలుండటం గమనార్హం.  కాగా,  దేశంలో యాక్టివ్‌ కేసులు పది లక్షలలోపు ఉండటం వరుసగా పదమూడో రోజని కేంద్రం పేర్కొంది. పది రోజులుగా సగటున 11.5 లక్షల పరీక్షలు చేసినట్లు వివరించింది. సినీ హీరోయిన్‌ తమన్నా కరోనా బారినపడ్డారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెకు పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చింది. మాజీ శాసనసభ్యుడు, వీఎంఆర్‌డీఏ మాజీ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఐదు వారాల క్రితం ఆయనకు కరోనా సోకింది. ఆస్పత్రిలో చికిత్స పొందడంతో కోలుకున్నారు. అయితే ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ తగ్గకపోవడంతో  ఆదివారం తుదిశ్వాస విడిచారు. 


2021లో భారతీయులందరికీ టీకా కష్టమే

కరోనా విలయంలో.. ప్రస్తుతం దేశమంతా టీకా ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తోంది. ఈ దిశగా సాగుతున్న ప్రయత్నాలను ఆసక్తిగా తెలుసుకుంటోంది. అయితే, 2021లో భారతీయులందరికీ టీకా కష్టమేనంటోంది ఓ అధ్యయనం. కారణం.. రూ.50 వేల కోట్ల వరకు ఖర్చును ఎక్కువ శాతం ప్రభుత్వమే భరించాల్సి రానుండటం. దీనికితోడు ఆర్థిక మందగమనాన్ని నివారించేందుకు పెద్దపెద్ద సంస్థలు తయారీ సంస్థల నుంచి భారీ సంఖ్యలో టీకా కొని పెట్టుకునే యత్నాల్లో ఉన్నాయి. 



ఎన్‌సీబీ డీడీ మల్హోత్రాకు పాజిటివ్‌

నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) డిప్యూటీ డైరెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్ర కరోనా బారినపడ్డారు. బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య కేసులో డ్రగ్స్‌ కోణంపై ఈయన దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ విషయమై మల్హోత్ర.. బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనేను విచారించారు. కొద్ది రోజులుగా ఎన్సీబీలో పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. ఇప్పటివరకు 25 మందికి వైరస్‌ సోకింది.


Updated Date - 2020-10-05T07:55:08+05:30 IST