7.86 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు

ABN , First Publish Date - 2021-01-21T06:18:43+05:30 IST

దేశంలో టీకాలు వేయించుకున్న ఆరోగ్య కార్యకర్తల సంఖ్య 7.86 లక్షలకు చేరింది. బుధవారం కొత్తగా 1,12,007 మందికి వ్యాక్సినేషన్‌ చేశారు.

7.86 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు

ముక్కు టీకాలతో పిల్లలకు సులభంగా వ్యాక్సినేషన్‌ : ఎయిమ్స్‌


న్యూఢిల్లీ, జనవరి 20: దేశంలో టీకాలు వేయించుకున్న ఆరోగ్య కార్యకర్తల సంఖ్య 7.86 లక్షలకు చేరింది. బుధవారం  కొత్తగా 1,12,007 మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. టీకా వేయించుకున్న తర్వాత దేశవ్యాప్తంగా మరో 10 మందిలో దుష్ప్రభావాలు తలెత్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్‌ అగ్నాని చెప్పారు. వారికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏ ఒక్కరిలోనూ తీవ్ర దుష్ప్రభావాలు కనిపించలేదని స్పష్టంచేశారు. ఇక దేశంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 207 రోజుల క్రితం (జూన్‌ 27న) 1,97,387 ఉండగా.. మళ్లీ ఇప్పుడవి (బుధవారం నాటికి) 1,97,201కి చేరాయి. మొత్తం కేసుల సంఖ్య 1.05 కోట్లకు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 16,988 మంది కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ నుంచి కోలుకోగా, ఇప్పటివరకు దేశంలో కోలుకున్న వారి సంఖ్య 1.02 కోట్లకు పెరిగింది. దీంతో రికవరీ రేటు 96.7 శాతానికి ఎగిసింది. కాగా, ముక్కు ద్వారా వేయగలిగే కరోనా టీకాలతో పిల్లలకు సులభంగా వ్యాక్సినేషన్‌ చేయొచ్చని న్యూఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు.


ముక్కు టీకా స్ర్పేలా పనిచేస్తుందని, కేవలం అరగంటలోనే తరగతి మొత్తానికి వ్యాక్సినేషన్‌ పూర్తవుతుందన్నారు. దీని అనుమతుల కోసం భారత్‌ బయోటెక్‌ ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని ఆయన ఈసందర్భంగా గుర్తుచేశారు. కరోనా సోకినవారు, ఇన్ఫెక్షన్‌ నుంచి కోలుకున్న నాలుగు నుంచి ఆరువారాల తర్వాత టీకా వేయించుకోవచ్చని సూచించారు. అమెరికాలో కరోనా మృత్యుఘోష ఆగడం లేదు. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ లెక్కల ప్రకారం మంగళవారం నాటికి దేశవ్యాప్తంగా 4,01,777 మరణాలు నమోదయ్యాయి. ఇది రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన అమెరికా సైనికులతో సమానం.  దేశంలో ఇప్పటివరకు 2.42 కోట్ల పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. మెక్సికోలో ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోవడంతో ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. దీంతో ఆక్సిజన్‌ ట్యాంకుల దొంగతనాలు పెరిగాయి. కరోనా వైరస్‌ పుట్టినిల్లు చైనాలో బుధవారం 103 కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకు 4,635 మంది చనిపోయారు. జింబాబ్వే విదేశాంగ శాఖ మంత్రి సిబుసిసో మోయో (61) కరోనాతో మృతిచెందారు. 

Updated Date - 2021-01-21T06:18:43+05:30 IST