వాహన్ రక్ష యాప్, పరికరం ఆవిష్కరణ
ABN , First Publish Date - 2021-05-11T09:39:07+05:30 IST
వాహనాల చోరీలను అరికట్టడానికి తిరుపతి అయాన్ టెక్నాలజీస్ సంస్థ తయారు చేసిన వాహన్ రక్ష పరికరం, యాప్‌ను అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు, ఏఎస్పీ సుప్రజ ఆవిష్కరించారు.
‘తిరుపతి అయాన్ టెక్నాలజీస్’కు ఎస్పీ అభినందన
తిరుపతి(నేరవిభాగం), మే 10: వాహనాల చోరీలను అరికట్టడానికి తిరుపతి అయాన్ టెక్నాలజీస్ సంస్థ తయారు చేసిన వాహన్ రక్ష పరికరం, యాప్‌ను అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు, ఏఎస్పీ సుప్రజ ఆవిష్కరించారు. ఈ పరికరం, యాప్ పనితీరును సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పరిశీలించారు. సంస్థ ప్రతినిధులు ద్విచక్రవాహనానికి ఈ పరికరాన్ని అమర్చి పనితీరును తెలియజేశారు. వాహనాన్ని ఎవరైనా చోరీ చేసేందుకు ప్రయత్నిస్తే గట్టిగా సైరన్ మోగడంతోపాటు స్టార్ట్ కాకుండా చేస్తుందని వివరించారు. అంతేకాకుండా యాప్ ద్వారా లోకల్ పోలీసు స్టేషన్‌కు సమాచారం వెళ్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వాహన్‌రక్ష యాప్, పరికరం ద్వారా వాహనాల చోరీలు అరికట్టవచ్చని తయారీ సంస్థ ప్రతినిధులను అభినందించారు. దొంగతనాలను, దోపిడీలను అరికట్టేందుకు అధునాతన టెక్నాలజీని రూపొందించేవారిని పోలీసు శాఖ ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ వెంకటరమణ, ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ నాగసుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.