బాంబే హైకోర్టులో వరవరరావుకు ఊరట

ABN , First Publish Date - 2021-12-04T01:32:17+05:30 IST

ఎల్గార్ పరిషత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావుకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది...

బాంబే హైకోర్టులో వరవరరావుకు ఊరట

ముంబై: ఎల్గార్ పరిషత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావుకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. తిరిగి జైలులో లొంగిపోవాల్సిన గడువును ఈ నెల 20 వరకు పొడిగించింది. వరవరరావుకు సమగ్ర పరీక్ష వైద్య పరీక్షలు చేయాల్సి ఉందని, అవి చేస్తే తప్ప ఆయనకు ఉన్న సమస్యలను గుర్తించడం సాధ్యం కాదని నానావతి ఆసుపత్రి కోర్టుకు తెలియజేసింది.


పరిశీలించిన న్యాయస్థానం వరవరరావు తిరిగి జైలు అధికారుల ఎదుట లొంగిపోయే గడువును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఆయనకు ఎప్పుడు ఏయే పరీక్షలు చేయబోతున్నారో చెప్పాలని, వచ్చే విచారణ నాటికి పరీక్షలు పూర్తి చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 


అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుకు ఈ ఏడాది ఫిబ్రవరి 22న కోర్టు ఆరు నెలల మెడికల్ బెయిలును మంజూరు చేసింది. ఆ తర్వాత దానిని పొడిగించుకుంటూ వస్తోంది. వరవరరావుకు బెయిలు మంజూరు చేసే సమయంలో కోర్టు కొన్ని ఆంక్షలు కూడా విధించింది.


ముంబైని విడిచిపెట్టి వెళ్లరాదన్నది అందులో ఒకటి. అయితే, ఈ నిబంధనను తొలగించి తెలంగాణ వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని వరవరరావు కోర్టును అభ్యర్థించారు. 

Updated Date - 2021-12-04T01:32:17+05:30 IST