వరుణుడు కరుణిస్తాడని..!

ABN , First Publish Date - 2020-08-12T10:13:50+05:30 IST

జిల్లాలోని వివిధ మండలాల్లో వరినాట్లు పూర్తవకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

వరుణుడు కరుణిస్తాడని..!

వర్షాల కోసం ఎదురుచూపులు

పూర్తి కాని వరి నాట్లు

పార్వతీపురం రెవెన్యూ డివిజన్లో కొంతమెరుగు 

విజయనగరం ప్రాంతంలో వెనుకబాటు


(విజయనగరం-ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ మండలాల్లో వరినాట్లు పూర్తవకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువగా వర్షాధారం కావడంతో వరుణుడి కరుణ కోసం ఆశగా చూస్తున్నారు. ఆగస్టు నెల సగం పూర్తయినా వరినాట్లు పూర్తి కాకపోవడంతో భవిష్యత్తుపై బెంగ పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా విజయనగరం డివిజన్‌లో ఎక్కువ శాతం వర్షాధారం కావటంతో ఇప్పటి వరకూ ఉభాలు పూర్తికాలేదు. 


అక్కడ అలా..ఇక్కడ ఇలా

విచిత్రం ఏమిటంటే ఒకే జిల్లాలో రెండు రకాల వాతావరణ పరిస్థితులు ఉంటున్నాయి. పార్వతీపురం డివిజన్‌లో సాగునీటి వనరులు అధికంగా ఉన్నాయి. వర్షాలు కూడా ఈ ఏడాది ఈ డి విజన్‌లోనే ఆశాజనకంగా ఉన్నాయి. ఇప్పటికే 35శాతం ఉభాలు పూర్తి కావచ్చాయి. కొమరాడ, పార్వతీపురం, కురుపాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, సీతానగరం, బలిజిపేట, మక్కువ, సాలూరు మండలాల్లో ఆశాజనంగా వరి నాట్లు పడ్డాయి. తెర్లాం, బాడంగి, రామభద్రపురం, పాచిపెంట మండలాలు కాస్త వెనుకబడ్డాయి. చెరువులు నిండడం...  సాగునీటి ప్రాజెక్టులు ఉండడంతో నాట్లు పడుతున్నాయి. వట్టిగెడ్డ, గుమ్మిడి గెడ్డ, జంఝావతి, కొత్తవలస, పెదంకలాం, వెంగళరాయసాగర్‌, పెద్ద గెడ్డ, ఆండ్ర, సురాపాడు, గొలుసుల మెట్ట, ఏడొంపులగెడ్డ తదితరమైనవి ఉండడంతో పరిస్థితి మెరుగ్గా ఉంది.


విజయనగరం డివిజన్‌లో నాట్లు పడటం లేదు. తాటిపూడి వంటి సాగునీటి వనరులున్నా అంతంత మాత్రంగానే ఉభాలు ఉన్నాయి. ఎక్కువశాతం వర్షాధారమే. దత్తిరాజేరు, గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, మెంటాడ, నెల్లిమర్ల, చీపురుపల్లి, గుర్ల, గరివిడి, భోగాపురం, పూసపాటిరేగ, జామి, ఎస్‌.కోట, వేపాడ, ఎల్‌.కోట, కొత్తవలస మండలాల్లో ఉభాలు ఆలస్యమవుతున్నాయి. గంట్యాడ మండలంలో తాటిపూడి సాగు, తాగునీటి ప్రాజెక్టు ఉంది. దీని పరిధిలోనే కాస్త మెరుగ్గా ఉంది. డెంకాడ మండలంలో పూర్తిగా వరి నాట్లు పడలేదని అధికారుల గణాంకాలు చెబుతన్నాయి. 


వర్షపాతంలోనూ తేడాలు    

 వర్షపాతం కూడా కొన్ని మండలాల్లో సాధారణం కంటే ఎక్కువగా ఉంది. మరికొన్ని మండలాల్లో లోటుగా నమోదైంది. ముఖ్యంగా విజయనగరం డివిజన్‌లోనే ఈ పరిస్థితి ఉంది. రామభద్రపురం, దత్తిరాజేరు, గంట్యాడ, మెంటాడ, నెల్లిమర్ల, గుర్ల, గరివిడి, డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో వర్షపాతం తక్కువగా ఉంది. చెరువులు నిండకపోవడంతో రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.


గతేడాది కంటే మెరుగు

గత ఏడాది ఆగస్టు నెలాఖరులో వర్షాలు కురిశాయి. ఇవి వరికి ఊపిరి పోశాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉందని చెప్పవచ్చు. జిల్లాలో సాధారణ వరి విస్తీర్ణం 1.22 లక్షల హెక్టార్లు. గత ఏడాది ఇదే సమయానికి 10,671 హెక్టార్లలో మాత్రమే వరి నాట్లు పడ్డాయి. ఈ ఏడాది 27,808 హెక్టార్లలో పూర్తయ్యాయి. గత సంవత్సరంతో పోల్చితే పరిస్థితి చాలావరకూ మెరుగ్గా ఉన్నట్టే. కానీ అధికశాతం మండలాల్లో నాట్లు పూర్తవకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.  


వరి సాధారణం -  గత ఏడాది పరిస్థితి -  ప్రస్తుతం

1.22 లక్షల హెక్టార్లు - 10,671 హెక్టార్లు  -  27,908 హెక్టార్లు

Updated Date - 2020-08-12T10:13:50+05:30 IST