వర్ష..బీభత్సం

ABN , First Publish Date - 2021-07-23T07:46:00+05:30 IST

గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీవర్షాల కారణంగా నిర్మల్‌ జిల్లా అతలాకుతలమవుతోంది.

వర్ష..బీభత్సం
భైంసాలో జలమయమైన భట్టిగల్లి హనుమాన్‌ మందిర ప్రాంతం

నీట మునిగిన జిల్లా

దిగ్బంధంలో లోతట్టు ప్రాంతాలు 

జిల్లా కేంద్రంలో వర్షభీభత్సం 

కాలనీలన్నీ జలమయం 

పొంగిన వాగులు, వంకలు 

నిండిన ప్రాజెక్ట్‌లు 

గేట్లు ఎత్తివేసి దిగువకు నీరు విడుదల 

రాష్ట్రంలోనే అత్యధికంగా నర్సాపూర్‌ (జి)లో 24.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు 

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి అల్లోల, కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీలు 

నిర్మల్‌, జూలై 22 (ఆంఽధ్రజ్యోతి) : గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీవర్షాల కారణంగా నిర్మల్‌ జిల్లా అతలాకుతలమవుతోంది. జిల్లా కేంద్రంలోని పలుకాలనీలన్నీ నీట మునిగిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ ముంపు బారినపడ్డాయి. జిల్లా కేంద్రంలోని సిద్ధాపూర్‌ సమీపంలో గల జీఎన్‌ఆర్‌ కాలనీ మొత్తం మునిగిపోయింది. తీవ్ర భయాందోళనకు గురైన కాలనీ వాసులను పోలీసులు, స్థానికులు థర్మకోల్‌ తెప్పలతో సురక్షిత ప్రాంతానికి తరలించారు. అలాగే మంచిర్యాల చౌరస్తా, గండిరామన్న, బోయివాడ ప్రాంతంతో పాటు మంజులాపూర్‌ ప్రధాన రహదారి వరదనీటితో దిగ్భంధానికి గురయ్యాయి. నిర్మల్‌, ఖానాపూర్‌ రోడ్డుమధ్యలో గల బాబాపూర్‌ వాగుబ్రిడ్జి తెగిపోవడంతో ఆ మార్గంపై రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్‌, ఖానాపూర్‌ మార్గాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే నిర్మల్‌ - భైంసా రహదారిపై కూడా రాకపోకలు స్తంభించిపోయాయి. నిర్మల్‌ పట్టణంలోని రోడ్లన్నీ వర్షం నీటితో నిండిపోయి చెరువులను తలపించాయి. మంజులాపూర్‌ చెరువు నీరంతా రోడ్లపైకి చేరుకోవడంతో ఆ చెరువులోని చేపలన్ని నీటి ప్రవాహానికి కొట్టుకువచ్చాయి. దీంతో స్థానికులు రోడ్లపైనే వలలు వేసి చేపలను పట్టుకున్నారు. జిల్లా కేంద్రంతో పాటు భైంసా, ఖానాపూర్‌ పట్టణాలు అలాగే గ్రామాలన్ని వర్షం కారణంగా ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. పలు గ్రామాల్లో చెరువులు తెగిపోవడంతో ఆ గ్రామాలన్నీ ప్రమాదపుటంచులో చిక్కుకున్నాయి. అలాగే ఎస్సారెస్పీ, కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌ల్లోకి స్థానికంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా నిండిపోయాయి. దీంతో ప్రాజెక్ట్‌ల గేట్లను ఎత్తివేసి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి కురిసిన వర్షాల కారణంగా జిల్లా కేంద్రమంతా జలదిగ్భందంలో చిక్కుకున్న సమాచారాన్ని తెలుసుకుని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్‌ ముషారప్‌ ఆలీతో పాటు ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌లు ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా గోదావరినది ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా ఆ నది పరివాహక ప్రాంతాల గ్రామాలన్నింటినీ అప్రమత్తం చేశారు. సోన్‌, మామడ, లక్ష్మణచాంద, ఖానాపూర్‌ మండలాల ప్రజలందరికీ అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దం టూ హెచ్చరించారు. జిల్లాలోనే అతిపెద్దదైన కడెం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్ట్‌లోకి 1.96.455 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్ట్‌ నీటిమట్టం చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్‌ 16 వరద గేట్లను ఎత్తి దిగువ గోదావరిలోకి 1.49.383 లక్షల క్యూసెక్కుల వరద నీటి ని గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడు గులు కాగా ప్రస్తుతం 696.300 అడుగులకు చేరుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రాజెక్ట్‌ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అలాగే గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌ ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్ట్‌లోకి 29.100 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా అధికారులు ఐదు వరదగేట్లను ఎత్తి దిగువన ఉన్న సుద్దవాగులో 69.656 క్యూసెక్కుల వరదనీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 358.7 మీటర్లు కాగా ప్రస్తుతం 358.1 మీటర్లుగా ఉంది. అలాగే స్వర్ణప్రాజెక్ట్‌ ఎగువప్రాంతం నుంచి 50.100 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా అధికారులు ఆరు వరదగేట్లను ఎత్తి దిగువన ఉన్న స్వర్ణవాగులోకి 60,250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుతం 1180.5 అడుగులుగా ఉంది. 

జలదిగ్భంధంలో జీఎన్‌ఆర్‌తో పాటు ఇతర కాలనీలు

ఏకధాటిగా కురిసిన వర్షాలు, అలాగే చిట్యాల్‌ వాగు పొంగి ప్రవహించడంతో సిద్దాపూర్‌కు ఆనుకొని ఉన్న జీఎన్‌ఆర్‌ కాలనీ మొత్తం నీటమునిగిపోయింది. కాలనీ వాసులంతా ఇళ్లపైకి చేరుకుని సహాయం కోసం అర్థించారు. అయితే నీటిఉదృతి తీవ్రంగా ఉన్న కారణంగా స్థానికులు వారిని అక్కడి నుంచి బయటకు తీసుకురాలేకపోయారు. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి థర్మకోల్‌ తెప్పల ద్వారా వారిని బయటకు రప్పించారు. పోలీసులు అలాగే స్థానిక మత్స్యకారులు తెప్పలద్వారా వీరందరిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇది లా ఉండగా ఆర్టీసీ డిపో వెనక గల బోయివాడ ప్రాంతమంతా జలమయమైంది. మంజులాపూర్‌, మంచిర్యాల చౌరస్తా, శాస్ర్తీనగర్‌, విజయనగర్‌, దివ్యనగర్‌ కాలనీ, ఇంద్రానగర్‌, ప్రియదర్శిని నగర్‌, వైఎస్‌ఆర్‌ కాలనీ తదితర కాలనీలు వర్షంతో జలమయమైపోయాయి. సాయంత్రం వరకు కూడా వర్షం ఏకధాటిగా కురుస్తుండడంతో నిర్మల్‌ నుంచే ఆదిలాబాద్‌ వెళ్లే మార్గం అలాగే భైంసా, ఖానాపూర్‌ల వైపువెళ్లే మార్గాలన్నీ మోకాళ్ల లోతుకు పైగా నీటితో మునిగిపోయాయి. ఈ నీటిఉధృతి కారణంగా వాహనాల రాకపోకలు సైతం స్తంభించిపోయాయి. స్థానిక ప్రజలంతా నీటిఉదృతిని చూసి తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భైంసాలోని గుండెగావ్‌ ప్రాజెక్ట్‌ పరిధిలోని పలుగ్రామాలు సైతం వరద ఉదృతితో తల్లడిల్లుతున్నాయి. అన్నిచోట్లవర్షాలు ఒకే రీతిన కురుస్తుండడంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనన్న భయాందోళనకు జనం గురవుతున్నారు. 

పొంగిన వాగులు, వంకలు, నిండిన ప్రాజెక్ట్‌లు 

గత రెండురోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలన్నీ నిండిపోయాయి. చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఎస్సారెస్పీతో పాటు జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌లన్నీ నిండిపోయాయి. ఈ ప్రాజెక్ట్‌ల రిజర్వాయర్‌లోకి వరద ఉధృతి తీవ్రంగా పెరుగుతుండడంతో ప్రాజెక్ట్‌గేట్లను ఎత్తిదిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఎస్సారెస్పీకి చెందిన 32 గేట్లను ఎత్తి దిగువ గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. దీని కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. అలాగే కడెం ప్రాజెక్ట్‌కు సంబంధించి వరద ఉధృతి పెరగడంతో 16 గేట్లను ఎత్తిదిగువకు నీటిని వదిలారు. గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఐదుగేట్లను ఎత్తి నీటిని వదలగా స్వర్ణప్రాజెక్ట్‌కు చెందిన ఆరుగేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. కాగా సారంగాపూర్‌ మండలంలోని వంజర్‌, సోన్‌ మండలంలోని మాధాపూర్‌, పాక్‌పట్ల, పెంబి మండలంలోని మరికొన్ని మారుమూల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 

నర్సాపూర్‌(జి)లో అత్యధిక వర్షం 

నర్సాపూర్‌(జి) మండల కేంద్రంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. జిల్లాలో సగటు వర్షపాతం 15 సెంటీమీటర్లుగా నమోదు కాగా నర్సాపూర్‌ (జి)లో 24.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతంగా అధికారులు వెల్లడించారు. కాగా అత్యల్పంగా ఖానాపూర్‌లో 115.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా కుంటాలలో 227.6 మిల్లీమీటర్లు, దిలావర్‌పూర్‌లో 234.4 మిల్లీమీటర్లు, సారంగాపూర్‌లో 218.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఈ వర్షపాతమంతా సాధారణ వర్షపాతం కన్నా రెట్టింపుగా రికార్డు కావడం గమనార్హం. 

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి, కలెక్టర్‌లు

ఓ వైపు ఏకధాటిగా కురుస్తున్న వర్షంలోనే ముంపు సమాచారం తెలుసుకున్న రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి , జిల్లా కలెక్టర్‌ ముషారప్‌ ఆలీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌లు నీటి మునిగిన ప్రాంతాల్లో పర్యటించారు. పట్టణంలోని మంజులాపూర్‌, మంచిర్యాల చౌరస్తా, సిద్దాపూర్‌, సోఫీనగర్‌లలో  పర్యటించిన మంత్రి ఆ తరువాత జౌళినాళను పరిశీలించారు. ఇక్కడ సహయక చర్యలను వెంటనే చేపట్టాల్సిందిగా మంత్రి ఆదేశించారు. ప్రజలు భయాందోళనలకు గురి కావద్దని తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. విద్యుత్‌, సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి సంబందిత అధికారులను ఆదేశించారు. తరువాత కలెక్టరేట్‌లో సంబందిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలకు ఆస్థులకు నష్టం జరగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా, వర్షంతో నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు సమీక్షించి యుద్ద ప్రతిపాదికన చర్యలు చేపట్టాలన్నారు. 

నిర్మల్‌ పరిస్థితిని సీఎంకు వివరించిన మంత్రి

నిర్మల్‌లో వర్షాల కారణంగా జరిగిన నష్టం, ముంపు తీవ్రతపై సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఫోన్‌లో  వివరించారు. సీఎం కేసీఆర్‌ నిర్మల్‌ పరిస్థితిని తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలని, అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడాలని ఎప్పటికప్పుడు అధికారులు సహాయక చర్యలను చేపట్టాలంటూ సీఎం ఆదేశించారు. 


Updated Date - 2021-07-23T07:46:00+05:30 IST