చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈదురుగాలుల బీభత్సం

ABN , First Publish Date - 2021-05-14T05:51:09+05:30 IST

నియోజకవర్గంలో గురువారం ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈదురుగాలుల బీభత్సం
చిలకలూరిపేట-నరసరావుపేట మార్గంలో అమీన్‌సాహెబ్‌పాలెం వద్ద రహదారిపై కూలిన భారీ చింత చెట్టు

ప్రధాన రహదారులలో కూలిన చెట్లు

చిలకలూరిపేట, నాదెండ్ల, మే 13 : నియోజకవర్గంలో గురువారం ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి నియోజకవర్గంలోని ప్రధాన రహదారులలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో పొలంలో గేదెలు కాస్తున్న రైతు కందుల శ్రీనివాసరావు(53)పై పిడుగుపడటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కర్నూలు-గుంటూరు రాష్ట్రీయ రహదారిపై నరసరావుపేట నుంచి గుంటూరు వెళుతున్న కారుపై చెట్టు కూలి పడింది. కారు దెబ్బతింది. కారులోని వారు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. చిలకలూరిపేట మండలంలోని మద్దిరాలలో, పట్టణంలోని పోలిరెడ్డిపాలెంలో విద్యుత్‌ స్తంభాలు, చెట్లు కూలిపోయాయి. చిలకలూరిపేట-కోటప్పకొండ మార్గంలో చెట్లు విరిగి పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చిలకలూరిపేట-నరసరావుపేట మార్గంలో నాదెండ్ల మండలం అమీన్‌సాహెబ్‌పాలెం వద్ద భారీ చింత చెట్టు రహదారిపై కూలిపోయింది. పెద్దఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో అధికారులు అక్కడకు చేరుకుని చెట్టును తొలగించారు. నాదెండ్ల ఎస్‌ఐ కె.సతీష్‌, చిలకలూరిపేట రూరల్‌ ఎస్‌ఐ భాస్కర్‌ సంఘటనా స్థలాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. నాదెండ్ల మండలం తూబాడులో విద్యుత్‌ స్తంభాల వైర్లు తెగిపడ్డాయి. తూబాడు, చందవరం గ్రామాలలో సుమారు రెండు గంటలపాటు కుండపోతలా వర్షం పడింది. సాతులూరుతోపాటు పలు గ్రామాలలో గాలులకు విద్యుత్‌ తీగలు తెగిపోయి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ అధికారులు నూతన స్తంభాలు ఏర్పాటు చేసి క్రమబద్దీకరించారు.

Updated Date - 2021-05-14T05:51:09+05:30 IST