భయంతోనేనా.. అడ్డుచక్రం!?

ABN , First Publish Date - 2021-02-27T06:02:09+05:30 IST

దుర్గగుడి ఈవో ఎం.వి.సురేశ్‌బాబుపై ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోకుండా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చక్రం తిప్పుతున్నారా? ..

భయంతోనేనా.. అడ్డుచక్రం!?

  • దుర్గగుడి ఈవోపై చర్యలకు అడ్డుపడుతున్న వెలంపల్లి 
  • తన బండారం బయటపడుతుందన్న భయంతోనేనా?
  • కమిషనర్‌ నివేదిక వెళ్లినా చర్యలు శూన్యం


దుర్గగుడి ఈవో ఎం.వి.సురేశ్‌బాబుపై ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోకుండా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చక్రం తిప్పుతున్నారా? తనకు విశ్వాసపాత్రుడైన ఈవోను కాపాడుకునేందుకు మంత్రి తన పలుకుబడినంతా ఉపయోగిస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. ఏసీబీ బృందాలు దుర్గగుడిలో విస్తృతంగా సోదాలు నిర్వహించి, ఏడు విభాగాల్లో పెద్దఎత్తున అవినీతి అక్రమాలను గుర్తించిన సంగతి తెలిసిందే. ఏసీబీ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా 15 మందిపై వేటు కూడా వేశారు. ఈ క్రమంలోనే ఈవో సురేశ్‌బాబుపై వచ్చిన అభియోగాలన్నింటినీ నమోదు చేసి, ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) 

దేవదాయశాఖలో రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ హోదాలో ఉన్న దుర్గగుడి ఈవోపై చర్యలు తీసుకునే అంశం తన పరిధిలో లేకపోవడంతో కమిషనర్‌ ప్రభుత్వానికి నివేదించారు. దుర్గగుడిలో వివిధ కాంట్రాక్టుల టెండర్లు మొదలుకొని టికెట్‌ కౌంటర్లలో అమ్మకాల వరకు ఏసీబీ గుర్తించిన అవినీతి, అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఈవో పనితీరును కమిషనర్‌ తన నివేదికలో వివరించినట్లు తెలిసింది. ఏసీబీ, దేవదాయశాఖ కమిషనర్‌ల నివేదికల ఆధారంగా ఈవోపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు గురువారం ఉదయం నుంచే జోరుగా ప్రచారం సాగింది. అయితే శుక్రవారం కూడా ఎలాంటి ఉత్తర్వులు విడుదల కాకపోవడం విశేషం. సాక్షాత్తూ మంత్రి వెలంపల్లి రంగంలోకి దిగి, ఈవోపై చర్యలు తీసుకోకుండా తనదైన శైలిలో చక్రం తిప్పినట్లు ఇంద్రకీలాద్రిపై చర్చ నడుస్తోంది.  


మంత్రి టార్గెట్‌ అయినందుకేనా? 

దుర్గగుడిలో వెలుగు చూసిన కోట్లాది రూపాయల అవినీతి, అక్రమాల్లో దుర్గగుడి అధికారులు పాత్రధారులైతే.. మంత్రి వెలంపల్లి ప్రధాన సూత్రధారి అని, అంతా ఆయనే చేశారంటూ ప్రతిపక్షాల నేతలు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. దుర్గగుడికి ఈవో సురేశ్‌బాబు అయినా.. మంత్రి ప్రధాన అనుచరులైన కొండపల్లి బుజ్జి, కొనకళ్ల నారాయణరావులే ఇంద్రకీలాద్రిపై అన్ని వ్యవహారాలను నడిపిస్తున్నారంటూ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ బాహాటంగానే ఆరోపించారు. అర్హతలు లేని సురేశ్‌బాబును ఈవోగా తీసుకువచ్చిన మంత్రి వెలంపల్లి ఆయనను రబ్బరుస్టాంపుగా వాడుకుంటున్నారని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్‌ ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లోనూ వెలుగుచూస్తున్న అవినీతి, అక్రమాలకు మంత్రి వెలంపల్లే బాధ్యుడని, సీఎం జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే వెలంపల్లిని మంత్రి పదవి నుంచి బర్త్‌రఫ్‌ చేయాలని, దుర్గగుడి ఈవోను సస్పెండ్‌ చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని డిమాండ్‌ చేస్తున్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో దుర్గగుడిలో అవినీతి, అక్రమాలపై విపక్ష నేతలు తనను టార్గెట్‌ చేసుకున్నారని భావించిన మంత్రి దుర్గగుడి ఈవోను కాపాడేందుకు నేరుగా రంగంలోకి దిగినట్లు ఇంద్రకీలాద్రిపై చర్చ జరుగుతోంది. ఈవోపై ఇప్పుడు చర్యలు తీసుకుంటే, ఏడాదిన్నర కాలంగా ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అవినీతి, అక్రమాలు మరిన్ని బహిర్గతమయ్యే ప్రమాదముందని, తీగలాగితే డొంక కదిలినట్లుగా మొత్తం బండారం బయటపడిపోతుందన్న భయంతోనే మంత్రి వెలంపల్లి ప్రభుత్వ పెద్దల వద్ద సాగిలపడి మరీ ఈవోపై చర్యలు లేకుండా అడ్డుపడుతున్నారని చెబుతున్నారు. 

Updated Date - 2021-02-27T06:02:09+05:30 IST