సదుంలో పశు సంవర్ధక పాలిటెక్నిక్‌

ABN , First Publish Date - 2021-05-14T04:55:30+05:30 IST

మంత్రి పెద్దిరెడ్డి సొంత మండలమైన సదుంలో పశు సంవర్ధక పాలిటెక్నిక్‌ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సదుంలో పశు సంవర్ధక పాలిటెక్నిక్‌

కలికిరి, మే 13: మంత్రి పెద్దిరెడ్డి సొంత మండలమైన సదుంలో పశు సంవర్ధక పాలిటెక్నిక్‌ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సదుం పరిసర ప్రాంతాలు గొర్రెలు, కోళ్ళు, పశు పెంపకం పైన ప్రధానంగా ఆధారపడినందున ఈ పాలిటెక్నిక్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు తిరుపతి పశువైద్య విశ్వ విద్యాలయం రిజిస్ట్రారు పంపిన ప్రతిపాదనలను ఆమోదించింది. దీనికోసం అవసరమైన భూమిని సదుం గ్రామంలోని సర్వే నెంబరు 136/6లో 3.51 ఎకరాలు, ఎర్రాతివారిపల్లె గ్రామంలో 1/3లో 1.64 ఎకరాలు మొత్తం 5.15 ఎకరాలను గుర్తించారు. ఈ భూమి పశు సంవర్ధక పాలిటెక్నిక్‌ ఏర్పాటు కోసం వెంటనే తిరుపతి ఎస్వీ వెటరినరీ వర్శిటీకి స్వాఽధీనం చేయాల్సిందిగా కలెక్టరును ఆదేశించింది. పాలిటెక్నిక్‌ ఏర్పాటు కోసం రూ.9 కోట్ల, 55 లక్షల 30 వేలు మంజూరు చేసింది. ఇందులోనే భవనాల నిర్మాణం, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం, ల్యాబొరేటరీ, రెండేళ్లకు అవసరమయ్యే జీతభత్యాలు తదితర వాటికి కేటాయించారు. వీటితోపాటు మూడు టీచింగ్‌, 8 నాన్‌ టీచింగ్‌ పోస్టులను మంజూరు చేశారు. బాలురు, బాలికలకు కలిపి 30 మంది విద్యార్థులతో 2021-22 విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించనున్నారు. వీరికి వేర్వేరుగా హాస్టల్‌ సదుపాయాలు కల్పించనున్నారు. సొంత భవనాలు అందుబాటులోకి వచ్చే వరకూ అద్దె భవనాల్లో తరగతులు ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతించింది. అద్దె చెల్లింపుల కోసం  సైతం నిధులు కేటాయించారు. ఈ మేరకు ఎస్వీ పశు వైద్య విశ్వ విద్యాలయం తగు చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశిస్తూ వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం ఆదేశాలు జారీ చేశారు.     

 

Updated Date - 2021-05-14T04:55:30+05:30 IST