అర్హులైన నిరుపేద కుటుంబాలకు రూ.6వేలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-04-20T05:51:02+05:30 IST

కరోనా నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికీ రూ.ఆరు వేల వరకు ఆర్థిక సహాయాన్ని అందించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అర్హులైన నిరుపేద కుటుంబాలకు రూ.6వేలు ఇవ్వాలి
మాట్లాడుతున్న మాజీ రాజ్యసభ సభ్యుడు హన్మంతరావు, పక్కన డీసీసీ ప్రెసిడెంట్‌ తూంకుంట నర్సారెడ్డి

ప్రభుత్వాలకు ఎన్నికల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదు

ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రలోభాలకు లోను కావద్దు 

మాజీ రాజ్యసభ సభ్యుడు హన్మంతరావు 


సిద్దిపేట అర్బన్‌, ఏప్రిల్‌ 19 : కరోనా నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికీ రూ.ఆరు వేల వరకు ఆర్థిక సహాయాన్ని అందించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ఆటవిక రాజ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కష్టకాలంలో ఉందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను టీఆర్‌ఎస్‌ పార్టీ గుండాలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దన్నారు. గెలుపోటములు సహజమని దేశ ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఓటమి పాలైన సంగతి గుర్తుంచుకోవాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు కృంగిపోకుండా గట్టిగా నిలబడి ప్రజల వద్దకు వెళ్లాలని, ఓటు రూపంలో ప్రజలు న్యాయం చేస్తారని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లోబడి అభ్యర్థులు పోటీలో నుంచి విత్‌ డ్రా చేసుకోవద్దని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం అభ్యర్థులకు ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో, దేశంలో ప్రభుత్వాలు ఎన్నికలకు ఇచ్చిన ప్రాధాన్యం కరోనాకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వాలకు ఎన్నికలు, పదవులు ముఖ్యం కాకూడదని, ప్రజలు ముఖ్యం కావాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్‌ బాగా ఉంది కాబట్టి 25 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి టీకా వేయాలని కోరారు. అర్హులైన పేదలను గుర్తించి ఆరువేల రూపాయలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు గంప మహేందర్‌, ప్రభాకర్‌ వర్మ, బొమ్మల యాదగిరి, అత్తు ఇమామ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-04-20T05:51:02+05:30 IST