వీఎల్‌ దత్‌ జీవితం యువతరానికి ఆచరణీయం : వెంకయ్యనాయుడు

ABN , First Publish Date - 2021-12-28T14:32:43+05:30 IST

ఉన్నతమైన, ధనవంతుల కుటుంబంలో జన్మించిన దివంగత పారిశ్రామికవేత్త వీఎల్‌ దత్‌ నిరాడంబర మనస్తత్వాన్ని కలిగివుండేవారని, కార్పొరేట్‌ లీడర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నా పెద్దవారిని గౌరవించే విషయంలో

వీఎల్‌ దత్‌ జీవితం యువతరానికి ఆచరణీయం : వెంకయ్యనాయుడు

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

చెన్నై: ఉన్నతమైన, ధనవంతుల కుటుంబంలో జన్మించిన దివంగత పారిశ్రామికవేత్త వీఎల్‌ దత్‌ నిరాడంబర మనస్తత్వాన్ని కలిగివుండేవారని, కార్పొరేట్‌ లీడర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నా పెద్దవారిని గౌరవించే విషయంలో సంకోచించేవారు కారని, ఆయన జీవితం నేటి యువతరానికి ఆచరణీయమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు.  నగరంలో సోమవారం ఉదయం స్టార్‌హోటల్‌లో ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో ‘డాక్టర్‌ వీఎల్‌ దత్‌ - గ్లింప్సెస్‌ ఆఫ్‌ ఎ పయనీర్స్‌ లైఫ్‌ జర్నీ’ అనే ఆంగ్ల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సభకు విచ్చేసిన పారిశ్రామికవేత్తలు, యువకులు, వివిధరంగాల ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పారిశ్రామికవేత్తలు తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబ జీవన విధానాలను, వారి విధుల నిర్వహణను తెలుసుకుని వారిని ప్రోత్సహించే విధానాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.


వీఎల్‌ దత్‌ ప్రజల మనిషి అని, పనిచేసే చోట ప్రతి ఒక్కరికీ సమానమైన ప్రాధాన్యత ఇచ్చేవారని, కుటుంబ సభ్యులతోనూ అదే తీరులో వ్యవహరించేవారని ఆయన కొనియాడారు. దత్‌ జీవితాన్ని పుస్తకంగా తీసుకురావటం అభినందనీయమని చెప్పారు. ఈ పుస్తకం ఓ మంచి వాణిజ్యవేత్త జీవితంలోని మానవత్వపు కోణాన్ని ఆవిష్కరిస్తుందన్నారు.  వీఎల్‌ దత్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, తమ ఇరువురి మధ్య క్రీడలు మొదలుకుని ఎన్నో విషయాల్లో సారూప్యత వుండేదన్నారు. వివిధ స్వచ్చంద సంస్థల ద్వారా సామాజికాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, విద్యాసంస్థల నిర్మాణానికి, వైద్యవసతుల కల్పనకు తన వంతు సహాయాన్ని అందించారని పేర్కొన్నారు. దత్‌ జీవిత విశేషాలను పుస్తకరూపంలో అందుబాటలోకి తీసుకు వచ్చిన ఆయన సతీమణి ఇందిరాదత్‌, ఆమె ఆలోచలనకు అక్షరూపం కల్పించిన యు  ఆత్రేయ శర్మ, కుమారి అంబికా అనంత్‌ను ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి వీ మెయ్యనాఽథన్‌, వీఎల్‌ ఇందిరాదత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-28T14:32:43+05:30 IST