Viral Video: నీటి ప్రాముఖ్యతపై ఈ కుక్కను చూసి చాలా నేర్చుకోవాలి.. కావాలంటే ఒకసారి మీరే చూడండి...
ABN , First Publish Date - 2022-07-08T02:33:38+05:30 IST
ప్రతి నీటి చుక్క అమూల్యమైనది.. నీటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.. అని రోజూ చదువుతుంటాం. సభలు, సమావేశాల్లో సందేశాలు ఇస్తూ ఉంటాం. కానీ నీటిని పొదుపు చేయడంలో..
ప్రతి నీటి చుక్క అమూల్యమైనది.. నీటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.. అని రోజూ చదువుతుంటాం. సభలు, సమావేశాల్లో సందేశాలు ఇస్తూ ఉంటాం. కానీ నీటిని పొదుపు చేయడంలో మాత్రం చాలా మంది నిర్లక్ష్యం వహిస్తుంటారు. కొందరైతే మరీ నిర్లక్ష్యంగా నీటిని వృథా చేస్తుంటారు. ఇలాంటి వారికి ఓ కుక్క సందేశం ఇస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుక్క.. నీటిని పొదుపు చేసే విధానం.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. దాహం వేసిన కుక్క నీటి కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో దానికి ఓ కొళాయి కనిపిస్తుంది. చకచకా దాని వద్దకు వెళ్లి.. ముందుగా మూతితో ట్యాప్ ఆన్ చేస్తుంది. కొన్ని నీళ్లు తాగి మళ్లీ ట్యాప్‌ని కట్టేస్తుంది. కొద్ది సేపు ఉండి మళ్లీ ట్యాప్ ఆన్ చేసి, తనకు అవసరమైన నీరు తాగి.. మళ్లీ ట్యాప్‌ని కట్టేస్తుంది. జంతువైనా కూడా నీటిని వృథా చేయకూడదనే విషయం తెలిసినట్లుగా, అది వ్యవహరించిన తీరు.. అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా.. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ప్రతి చుక్క విలువైనదే... డాగీకి అర్థమైంది, మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాము?’’.. అని వ్యాఖ్యానిస్తూ పోస్టు చేసిన ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. నిజంగా ఈ కుక్క చాలా తెలివైంది.. అంటూ కొందరు, ఈ కుక్కను చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.