జోరుగా వరి నాట్లు

ABN , First Publish Date - 2022-08-01T07:12:47+05:30 IST

జిల్లాలో వర్షాలు తగ్గడంతో పంటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు 15 రోజుల పాటు పడడంతో పంటలు వేసేందుకు ఇబ్బందులు ఎదురైనా ప్రస్తుతం తగ్గడంతో రైతులు జోరుగా వరినాట్లను వేస్తున్నారు.

జోరుగా వరి నాట్లు

జిల్లాలో వర్షాలు తగ్గడంతో ఊపందుకున్న నాట్లు

ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకువస్తున్న రైతులు

సన్న రకాల సాగుకే మొగ్గుచూపుతున్న అన్నదాతలు

నిజామాబాద్‌, జూలై 31(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో వర్షాలు తగ్గడంతో పంటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు 15 రోజుల పాటు పడడంతో పంటలు వేసేందుకు ఇబ్బందులు ఎదురైనా ప్రస్తుతం తగ్గడంతో రైతులు జోరుగా వరినాట్లను వేస్తున్నారు. కూలీలు దొరకకున్నా ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి నాట్లను కొనసాగిస్తున్నారు. ఎరువులు కొనుగోలు చేస్తూ అదునుదాటుతుండడంతో త్వరగా వరినాట్లను పూర్తిచేస్తున్నారు. ప్రతి వానకాలంలో జూలై చివరి నాటికే 80 శాతానికి పైగా పంటలు పూర్తవుతుండగా ఈ సంవత్సరం కొంతమేర విస్తీర్ణం తగ్గింది. వరినాట్లకు ఆగస్టు 4వ వారం వరకు సమయం ఉండడంతో ఆలోపు ఎక్కువ మొత్తంలో సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

బోధన్‌ డివిజన్‌లో అధికం

జిల్లాలో వరినాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. జూన్‌ నెలలో వర్షాలు ఆరంభమైన బోధన్‌ డివిజన్‌లోని ఎక్కువగా పంటలు వేశారు. ఆర్మూర్‌, నిజామాబాద్‌ అర్బన్‌ పరిదిలో ఆరుతడి పంటలు వేశారు. జూలై ఆరంభం నుంచి భారీ వర్షాలు పడుతుండడంతో ఆరుతడి పంటలతో పాటు వరినాట్లకు బ్రేక్‌పడింది. వేసిన పంటలు కూడా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగడంతో పంటలు నీట మునిగాయి. గోదావరి, మంజీర వెంట కూడా బ్యాక్‌ వాటర్‌ రావడంతో వేలాది ఎకరాల్లో  నష్టం జరిగింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 59వేల ఎకరాల్లో పంటలు ఈ వర్షాలకు దెబ్బతిన్నాయి.

5లక్షల 4వేల ఎకరాల్లో సాగు

జిల్లాలో వర్షాలు తగ్గడంతో వరినాట్లు కొనసాగుతున్నాయి. జిల్లాలో ఈ వానాకాలంలో 5లక్షల 4వేల ఎకరాల వరకు సాగవుతుందని అంచనా వేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 3లక్షల 70వేల 727 ఎకరాల్లో పంటలు వేశారు. గత సంవత్సరం వానాకాలంలో 4లక్షల 1530 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ సంవత్సరం భారీ వర్షాల వల్ల ఆరుతడి పంటలు దెబ్బతినడంతో వరిసాగు ఎక్కువవుతుందని అంచ నా వేస్తున్నారు. గత సంవత్సరం కంటే మించి 5లక్షల ఎకరాల వరకు సాగవుతుందని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో ఈ సంవత్సరం 4లక్షల 5వేల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేయగా ప్రస్తుతం 2లక్షల 81వేల 646 ఎకరాల్లో ఈ పంటను వేశారు.

ఇతర ప్రాంతాల నుంచి కూలీలు

రైతులు వర్షాలు తగ్గడంతో వరినాట్లను పెంచారు. తమ గ్రామాల పరిధిలో కూలీలు దొరకకున్న నల్గొండ, బిహార్‌, యూపీ నుంచి వచ్చిన కూలీలతో వరినాట్లను వేస్తున్నారు. అవసరానికి కొంత ఎక్కువకూలీ అయిన చెల్లించి సమయం మించిపోకుండ సాగును కొనసాగిస్తున్నారు. వర్షాలు పడితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ముందస్తుగా వరినాట్లను కొనసాగిస్తున్నారు. గత సంవత్సరం జూలై చివరినాటికి 3లక్షల 20వేల ఎకరాల వరకు సాగుకాగా ఈ దఫా కొంతమేర వర్షాలతో తగ్గినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. గత సంవత్సరం కూడా ఆగస్టు 4వ వారం వరకు వరినాట్లు వేయడం వల్ల ఈ దఫా అదే రీతిలో పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న భూగర్భ జలాల వల్ల 4లక్షల ఎకరాల వరకు వరిసాగువుతుందని అంచ నాకు వస్తున్నారు. కొన్నిచోట్ల వరినారు దెబ్బతిన్న రైతులు వెంటనే మళ్లి నారుమడులు సిద్దంచేసినందున ఆగస్టు 2వ వారంలోపు నారుపెరిగే అవకాశం ఉన్నందున వరి విస్తీర్ణం పెరుగుతుందని అంచనాకు వస్తున్నారు. 

సన్న రకాల సాగు అధికం

జిల్లాలో ఈ వానాకాలంలో వరిలో సన్న రకాలను ఎక్కువగా రైతులు సాగుచేస్తున్నారు. గడిచిన రెండేళ్లుగా జిల్లాలో వానకాలంలో సన్నాల సాగు పెరుగుతుంది. గతంలో కన్న భూగర్భజలాలు అధి కంగా ఉండడం వల్ల రైతలు ఎక్కువగా సన్నరకాలకు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్‌లో సన్నాలకు డిమాండ్‌ ఉండడం, ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేస్తున్నందున ఎక్కువమంది రైతులు సన్నరకాల సాగుకు మొగ్గుచూపుతున్నారు. వ్యాపారులు కొనకున్న కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకునేందుకు అవకాశం ఉండడంతో రైతులు ఈ సన్న రకాలను సాగుచేస్తున్నారు. జిల్లాలో 70శాతం వరకు వరిలో ఈ సన్న రకాలే సాగవుతున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనాకు వస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా దిగుబడి సన్నరకాల్లో పెరగడం, రోగాలను తట్టుకుంటు ఉండడంతో ఎక్కువమంది రైతులు ఈ రకాలను సాగుచేస్తున్నారు. దొడ్డు రకాలను కూడావేస్తున్నారు. త్వరగా పంట చేతికి వచ్చే అవకాశం ఉండడంతో దొడ్డు రకాలను రైతులు వేస్తున్నారు. వరితో పాటు మొక్కజొన్న 27857 ఎకరాలు, సోయా 58200ల ఎకరాల్లో సాగుచేశారు. వీటితో పాటు పత్తి, పెసర, మినుములు, కందులను కూడా రైతులు వేశారు. జిల్లాలో వర్షాలు తగ్గడం వల్ల వరిసాగు భారీగా పెరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్‌ తెలిపారు. వర్షాలతో కొంత విస్తీర్ణం తగ్గిన ఆగస్టు 4వ వారం వరకు సమయం ఉండడంతో ఎక్కువమంది రైతులు వరిసాగుపై మొగ్గుచూపుతున్నారని ఆయన తెలిపారు. వర్షాలు జోరుగా పడడం వల్ల ఆరుతడి పంటల సాగు తగ్గిందని ఆయన తెలిపారు.

Updated Date - 2022-08-01T07:12:47+05:30 IST