వైరస్‌ విజృంభణ

ABN , First Publish Date - 2020-08-13T07:46:08+05:30 IST

జిల్లాలో మంగళవారం రాత్రి 9 గంటల నుంచీ బుధవారం రాత్రి 9 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 1301 కరోనా పాజిటివ్‌ కేసులు న

వైరస్‌ విజృంభణ

 21 వేలు దాటేసిన కొవిడ్‌ కేసులు

 24 గంటల్లో 1301 పాజిటివ్‌ల నమోదు బాధితుల్లో 46మంది   ప్రభుత్వోద్యోగులు

 ఇద్దరి జీవిత భాగస్వాములు సైతం


తిరుపతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళవారం రాత్రి 9 గంటల నుంచీ బుధవారం రాత్రి 9 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 1301 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకరోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. ఒకే రోజు వెయ్యికి పైగా పాజిటివ్‌ కేసులను గుర్తించడం జిల్లాలో ఇది మూడోసారి. తాజా కేసులతో జిల్లాలో మొత్తం కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 21 వేలు దాటగా కొవిడ్‌ మరణాల సంఖ్య 206కు చేరింది. 


21051 కేసులు... 206 మరణాలు

జిల్లాలో బుధవారం ఉదయం 9 గంటల నుంచీ రాత్రి 9 గంటల వరకూ 12 గంటల వ్యవధిలో నమోదైన కేసులు 364. అవి తిరుపతిలో 146, శ్రీకాళహస్తిలో 57, చిత్తూరులో 30, తిరుపతి రూరల్‌లో 24, రామచంద్రాపురంలో 13, ఏర్పేడు, పుత్తూరులో 9, కలికిరిలో 8, ఐరాల, కలకడ, కార్వేటినగరం మండలాల్లో 7 చొప్పున, పాకాలలో 5, తొట్టంబేడు, యాదమరి మండలాల్లో 4 చొప్పున, పీలేరు, పీటీఎం, పూతలపట్టు మండలాల్లో 3 చొప్పున, పాలసముద్రం, పులిచెర్ల, రేణిగుంట, మదనపల్లె, చంద్రగిరి మండలాల్లో 2 చొప్పున, పెనుమూరు, బి.కొత్తకోట, నగరి, గుడిపాల, ములకలచెరువు, పిచ్చాటూరు, సదుం, తంబళ్ళపల్లె, వరదయ్యపాలెం, వి.కోట మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున వుండగా ఇతర జిల్లాలకు చెందిన కేసులు రెండున్నాయి. కొత్తగా గుర్తించిన ఈ కేసులతో కలిపి జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 21051కి చేరుకోగా ఈ వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య 206కు చేరింది. 


బాధితుల్లో  34మంది పారిశుధ్య కార్మికులు

 మంగళ, బుధవారాల్లో గుర్తించిన కరోనా పాజిటివ్‌ వ్యక్తుల్లో 46మంది  ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీరిలో ఒక్క పుత్తూరు పట్టణానికి చెందిన వారే 38మంది వుండగా అందులో 34 మంది పుత్తూరు మున్సిపాలిటీలో శానిటేషన్‌ వర్కర్లుగా పనిచేస్తున్నవారే కావడం గమనార్హం. మిగిలిన నలుగురిలో ముగ్గురు పట్టణంలోని ప్రధాన బ్యాంకులో పనిచేసే ముగ్గురు ఉద్యోగులు కాగా మిగిలిన ఒకరూ వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి.


అలాగే పాలసముద్రం మండలంలో ఓ వైద్య శాఖ ఉద్యోగి దంపతులు, సోమలలో మహిళా కానిస్టేబుల్‌ సహా ముగ్గురు పోలీసులు కరోనా బాధితులుగా మారారు. సత్యవేడులో ఓ బ్యాంకు మేనేజర్‌, పీలేరులో ఆర్టీసీ ఉద్యోగి ఒకరు, శాంతిపురం మండలం గుంజార్లపల్లె సచివాలంలో ఓ ఉద్యోగి... ఇలా పలువురికి కరోనా సోకింది. పీలేరు పట్టణంలో బీజేపీ సీనియర్‌ నాయకుడొకరు వైరస్‌ బారినపడ్డారు.


కరోనా సోకిన ఖైదీ ఆస్పత్రి నుంచీ పరారీ

కరోనా సోకిన ఓ ఽఖైదీ కొవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అటునుంచి అటే పరారైన ఘటన  చోటుచేసుకుంది. పలమనేరు పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా వున్న వ్యక్తిని గత నెలలో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్‌ రిమాండుకు ఆదేశించారు. సబ్‌జైలులో వుండగా కరోనా సోకడంతో చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిందితుడు బుధవారం కాపలా వున్న పోలీసుల కళ్ళు కప్పి పరారయ్యాడు.

Updated Date - 2020-08-13T07:46:08+05:30 IST