వైరస్‌ కాకలో.. విమానం రాక

ABN , First Publish Date - 2021-01-09T07:38:00+05:30 IST

ఓవైపు కొత్త స్ట్రెయిన్‌ కలకలం కొనసాగుతుండగా.. పదహారు రోజుల నిషేధం తర్వాత.. యూకే నుంచి విమానం శుక్రవారం భారత్‌కు చేరింది. 256

వైరస్‌ కాకలో.. విమానం రాక

  • యూకే నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిరిండియా సర్వీసు
  • మొత్తం 256 మందితో భారత్‌కు చేరిక
  • ఢిల్లీలో క్వారంటైన్‌ నిబంధనలు కఠినం 
  • కరోనా నెగెటివ్‌ వచ్చినా వారం రోజులు సంస్థాగత క్వారంటైన్‌

       ‘క్వారంటైన్‌ను’ కఠినం చేసిన కేజ్రీ సర్కారు


న్యూఢిల్లీ/ముంబై, జనవరి 8: ఓవైపు కొత్త స్ట్రెయిన్‌ కలకలం కొనసాగుతుండగా.. పదహారు రోజుల నిషేధం తర్వాత.. యూకే నుంచి విమానం శుక్రవారం భారత్‌కు చేరింది. 256 మందితో లండన్‌లో బయల్దేరిన ఎయిరిండియా విమానం ఢిల్లీలో ల్యాండ్‌ అయింది. శని, ఆదివారాల్లో మరో మూడు విమానాల్లో 780 మంది వరకు దేశ రాజధానికి రానున్నారు. మరోవైపు యూకేలో  పరిస్థితులు తీవ్రంగా ఉండగా విమాన సర్వీసుల పునరుద్ధరణ పట్ల విమర్శలు వస్తున్నాయి.


ఇదే విషయమై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌  అభ్యంతరం వ్యక్తం చేశారు. నిషేధాన్ని ఈ నెల 31 వరకు పొడిగించాలని కోరారు. కాగా, డిసెంబరు 23 నుంచి యూకే-భారత్‌ విమాన సర్వీసులను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల 6వ తేదీ నుంచి పునఃప్రారంభించింది. 23 వరకు   సడలింపు కొనసాగనుంది. ఇరు దేశాల మధ్య వారానికి 15 చొప్పున సర్వీసులు నడవనున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాలకు మాత్రమే ఈ సర్వీసులు నడుస్తాయి.


విమాన సర్వీసుల ప్రారంభం నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం క్వారంటైన్‌ నిబంధనలను కఠినం చేసింది. ప్రయాణికులకు నెగెటివ్‌ గా తేలినా.. ఏడు రోజులు సంస్థాగత క్వారంటైన్‌, మరో ఏడు రోజులు హోం క్వారంటైన్‌ తప్పనిసరి చేసింది. దేశ ంలోని ఇతర ప్రాంతాలకు విమానాల్లో వెళ్లేవారు పది గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలని విమానాశ్రయ వర్గాలు సూచించాయి.


బ్రిటన్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్‌ విజృంభిస్తున్న వేళ.. 

 విమానాల రాకపోకలపై నిషేధం ఎత్తివేయడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రమాదకరమని ముంబైకి చెందిన లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో ప్రజలు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా 207 జిల్లాల నుంచి దాదాపు 8 వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.


82కి చేరిన కొత్త స్ట్రెయిన్‌ కేసులు

కరోనా కొత్త స్ట్రెయిన్‌ కేసులు దేశంలో 82కు చేరాయి. మరో 9 మందికి యూకే స్ట్రెయిన్‌ నిర్ధారణ అయినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. బుధవారం వరకు ఈ సంఖ్య 73గా ఉంది. ఇప్పటివరకు ఢిల్లీ చేరినవారిలో 13 మందికి కొత్త స్ట్రెయిన్‌ నిర్ధారణ అయింది. మరోవైపు దేశంలో గురువారం 18,139 కరోనా కేసులు నమోదయ్యాయి. 234 మంది చనిపోయారు.  20,539 మంది రికవరీ అయ్యారు. యాక్టివ్‌ కేసులు  2.25 లక్షలకు తగ్గాయి.


Updated Date - 2021-01-09T07:38:00+05:30 IST